సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణం పొందకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని నియంత్రించాలన్న ప్రధాన ఉద్దేశంతోనే రఘురామకృష్ణరాజు ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దాఖలు చేశారని హైకోర్టు తేల్చింది. పేదలు, అణగారిన వర్గాల కోసం ఈ వ్యాజ్యం దాఖలు చేయలేదని తెలిపింది. ఆయన ఉద్దేశం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని స్పష్టం చేసింది. ఆ వ్యాజ్యాన్ని కొట్టివేసింది.
ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్‌కు చెల్లించే పన్నులను ఆదాయంగా చూపి ఆర్థిక సంస్థల నుంచి రుణం పొందేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఈ పిల్ దాఖలు చేశారు. దీనిని కొట్టివేస్తూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు ధర్మాసనం జూన్ 24న తీర్పునిచ్చింది. ఈ తీర్పు ప్రతిని తాజాగా అందుబాటులో ఉంచింది.
ఈ వ్యాజ్యం విచారణార్హతపై ధర్మాసనం తన తీర్పులో లోతుగా చర్చించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను ఉదహరించింది. కేవలం అకడమిక్ ప్రయోజనం కోసం దాఖలు చేసే వ్యాజ్యాలను న్యాయస్థానాలు విచారించబోవని తెలిపింది. ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలను పిల్‌ల ద్వారా లేవనెత్తినప్పుడు వాటిని న్యాయస్థానాలు పరిగణనలోకి తీసుకోరాదంది. ఏ రకంగానూ ఈ వ్యాజ్యాన్ని విచారించబోమని స్పష్టంచేసింది.
రుణం పొందకుండా రాష్ట్ర ప్రభుత్వం లేదా దాని కార్పొరేషన్‌లను అడ్డుకుంటే ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలుపై తీవ్ర ప్రభావం చూపుతుందని ధర్మాసనం తెలిపింది. ప్రభుత్వానికి ఆర్థికపరమైన ఇబ్బందులు కలిగించే వ్యవహారాల్లో జోక్యం చేసుకొనే విషయంలో న్యాయస్థానాలు ఆచితూచి వ్యవహరిస్తాయంది. అలాంటి వ్యవహారాల నిర్వహణను ప్రభుత్వానికి వదిలేయాలని స్పష్టం చేసింది.
ఆర్థిక వ్యవహారాలను నిర్వహించేందుకు న్యాయస్థానాలేమీ ఆర్థికవేత్తలో, ఆర్థిక నిపుణులో కాదని తేల్చి చెప్పింది. రుణం పొందేందుకు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్‌కు అనుమతినిస్తే రాష్ట్ర ప్రజలకు తీవ్రమైన ఆర్థిక ముప్పును కలిగిస్తుందని చెప్పారని, అది ఏ విధంగానో చెప్పేందుకు ఎలాంటి వివరాలను కోర్టు ముందుంచలేదని హైకోర్టు ఆక్షేపించింది. కేవలం రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘనను మాత్రమే ప్రశ్నించారని, దీనికీ, పేద ప్రజల సంక్షేమానికి ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది.
ఆయన ఉద్దేశం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధం
Published Fri, Jul 1 2022 3:19 AM | Last Updated on Fri, Jul 1 2022 7:50 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment