సాక్షి, అమరావతి: ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా భీమవరంలో ఈ నెల 4వ తేదీన అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి హాజరవుతున్న తనకు భద్రత కల్పించడంతో పాటు అరెస్టు చేయకుండా పోలీసులను ఆదేశించాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇదేం పిటిషన్ అంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వీలుగా ఈ నెల 3, 4వ తేదీల్లో కేంద్రం తనకు ఇప్పటికే జడ్ ప్లస్ భద్రత కల్పించిందని ఒకవైపు చెబుతూ మరోవైపు పోలీసు భద్రత కోరడం ఏమిటంటూ విస్మయం వ్యక్తం చేసింది. స్థానిక పోలీసుల కంటే ఎస్పీజీ అందించే జడ్ ప్లస్ కేటగిరీ పటిష్టమైనదని గుర్తు చేసింది. జడ్ ప్లస్ ఉన్నప్పుడు స్థానిక పోలీసుల భద్రత అవసరం లేదని, ఆ దిశగా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది.
ఇప్పటికే నమోదైన కేసుల్లో తనను అరెస్ట్ చేయకుండా పోలీసులను ఆదేశించాలన్న రఘురామకృష్ణరాజు అభ్యర్థనపై కూడా న్యాయస్థానం అభ్యంతరం తెలిపింది. ఇప్పటికే నమోదైన కేసుల్లో హైకోర్టును ఆశ్రయించి స్టే పొందారని, తద్వారా అరెస్ట్ నుంచి రక్షణ ఉందని, అలాంటప్పుడు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వడం ఎలా సాధ్యమంటూ ప్రశ్నించింది. అలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఒకవేళ ఏదైనా కేసు నమోదు చేస్తే చట్ట ప్రకారం నడుచుకునేలా పోలీసులను ఆదేశించాలని, కనీసం ఆ ఉత్తర్వులైనా ఇవ్వాలని రఘురామకృష్ణరాజు అభ్యర్థించారు. దీంతో ఈ నెల 3, 4వ తేదీల్లో ఒకవేళ రఘురామకృష్ణరాజుపై ఏదైనా కేసు నమోదు చేస్తే చట్ట ప్రకారం నడుచుకోవాలని పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు. ఇంతకు మించి ఈ పిటిషన్‌లో ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదని స్పష్టం చేస్తూ న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
చదవండి: (CM YS Jagan: ఆదోని పర్యటనకు సీఎం జగన్)
ఏ కారణం కనిపించడం లేదు...
అంతకు ముందు రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాది ఉమేశ్ చంద్ర వాదనలు వినిపిస్తూ భద్రత కల్పించాలని డీజీపీని కోరితే ఇప్పటి వరకు స్పందన లేదన్నారు. ఆ రెండు తేదీల్లో కేంద్రం తమకు జెడ్ ప్లస్ భద్రత కల్పించిందన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. జడ్ ప్లస్ భద్రత ఉంటే మళ్లీ రాష్ట్ర పోలీసుల భద్రతతో పనేముందని ప్రశ్నించారు. ఎన్ని రకాల భద్రత కల్పించాలి మీకు? అంటూ ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. అవాంఛిత ఘటనలను సృష్టించి పిటిషనర్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఉమేశ్ చంద్ర పేర్కొనగా శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఏదో ఒక కారణంతో అరెస్ట్ చేసే అవకాశం ఉందని, అందువల్ల భద్రత కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని ఉమేశ్ చంద్ర కోరారు.
అయితే భద్రత కల్పించాలంటూ ఆదేశాలు ఇచ్చేందుకు ఎలాంటి కారణాలు కన్పించడం లేదని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. గతంలో పిటిషనర్‌పై 8 కేసులు నమోదు చేశారని, అందులో ఈ కోర్టు స్టే ఇచ్చిందని ఉమేశ్ నివేదించారు. ఆ రకంగా కూడా మీకు రక్షణ ఉందని, అలాంటప్పుడు ఇక ఏ రకమైన భద్రత కోసం ఆదేశాలు ఇవ్వాలని న్యాయమూర్తి ప్రశ్నించారు. స్టే ఉన్న కేసుల్లో పోలీసులు ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. ఈ సమయంలో ఉమేశ్ అధికరణ 226 కింద కోర్టు పరిధిని వివరించే ప్రయత్నం చేయగా.. తమ అధికారం ఏమిటో, పరిధి ఏమిటో బాగా తెలుసునని, ఆ విషయం తమకు చెప్పాల్సిన అవసరం లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
చదవండి: (Intercity Express Train: పట్టాలెక్కని పేదోడి రైలు)
పబ్లిసిటీ స్టంట్‌లో భాగమే..
తన నియోజకవర్గంలో ప్రధాని కార్యక్రమానికి హాజరవుతున్న తనకు భద్రత కల్పించడంతో పాటు అరెస్ట్ చేయకుండా పోలీసులను ఆదేశించాలంటూ రఘురామకృష్ణరాజు శుక్రవారం అత్యవసరంగా లంచ్‌మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ పబ్లిసిటీ స్టంట్‌లో భాగంగానే రఘురామకృష్ణరాజు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారని నివేదించారు. ఎవరో చేసిన వ్యాఖ్యలను డీజీపీకి ఆపాదిస్తున్నారన్నారు.
ప్రధాని పర్యటనకు ముందే పెద్ద సీన్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తూ వ్యాజ్యాన్ని దాఖలు చేశారని తెలిపారు. ప్రధాని కాన్వాయ్‌లో ఉండాలని ఆయన భావిస్తున్నారని చెప్పారు. అయితే కాన్వాయ్‌లో ఎవరుండాలన్నది కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్‌జీపీ) నిర్ణయిస్తుందని, రాష్ట్ర పోలీసులు కాదన్నారు. ఏదో రకంగా వార్తల్లో ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ వ్యాజ్యం దాఖలు చేశారన్నారు. ఎంపీగా ఉంటూ ఆయన ఎప్పుడూ రెచ్చగొట్టే ప్రయత్నాలను చేస్తుంటారన్నారు. వ్యక్తులు, వర్గాల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టేలా మాట్లాడడం పిటిషనర్‌కు అలవాటన్నారు. ఈ వ్యాజ్యం దాఖలు చేయడం ద్వారా కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేశారన్నారు.
ముఖ్యమంత్రిపై అడ్డగోలు ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారని తెలిపారు. ఈ సమయంలో రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాది పీవీజీ ఉమేశ్ చంద్ర స్పందిస్తూ.. నరసాపురం వెళ్తే పిటిషనర్‌పై పోలీసులు మరిన్ని కేసులు పెట్టే అవకాశం ఉందన్నారు. దీనిపై న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ఊహాతీతమైన కారణాల ఆధారంగా భద్రతకోసం ఆదేశాలు ఇవ్వమంటారా? అని ప్రశ్నించారు. ఎవరిపైనా తప్పుడు కేసులు పెట్టాల్సిన అవసరం పోలీసులకు లేదని ఏజీ శ్రీరామ్ స్పష్టం చేశారు. పిటిషనర్
ఆందోళనలన్నీ నిరాధారమన్నారు. ఎంపీ అయినా సామాన్యుడైనా చట్టం ముందు అంతా ఒక్కటేనన్నారు.
Comments
Please login to add a commentAdd a comment