విశాఖపట్నం, సాక్షి: మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని, మాట్లాడే ప్రతీ మాటకు నిబద్దత ఉండాలని ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏపీ పరిస్థితులపై కేంద్ర మంత్రి పియూష్ గోయాల్ చేసిన వ్యాఖ్యలను శుక్రవారం మీడియా ముఖంగా మంత్రి బొత్స ఖండించారు.
కేంద్ర మంత్రి వ్యాఖ్యలు సరికాదు. పియూష్ గోయల్ ఏది పడితే అది మాట్లాడుతున్నారు. విద్యాశాఖపై వస్తున్న కథనాలు నిరూపించాలి. నిజం లేదు గనుకే తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు అని బొత్స కౌంటర్ ఇచ్చారు. కొన్ని పత్రికలు దురుద్దేశంతో తప్పుడు కథనాలు రాసి ప్రజలను నమ్మించాలని చూస్తున్నాయి. ఏనుగు వెళుతుంటే కుక్కలు మొరుగుతాయి. రాష్ట్రంలో ఏ ఒక్క అధ్యాపకుడు అయినా విద్యాశాఖ మంత్రిగా ఉన్న నాపై వేలు ఎత్తి చూపించగలరా?. అసలు విద్యాశాఖ లో అవినీతి జరిగిందని చెప్పగలరా?..
.. ఎటువంటి కార్యక్రమం తీసుకొచ్చినా ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడి చేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో రికార్డ్ శాతం ఫలితాలు వచ్చాయి. ఎక్కడా చిన్నపాటి పొరపాటు కూడా లేకుండా పరీక్షలు నిర్వహించాం. రాష్ట్రంలో ఉపాధ్యాయులు చాలా బాధ్యతగా ఉన్నారు. బావి భారత నిర్మాణానికి ఉపాధ్యాయులు కష్టపడుతున్నారు. అందుకే 10వ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చాయి
రైల్వే జోన్ సంగతి ఏమైంది?
పియుష్ గోయల్ గురివింద గింజలా మాట్లాడుతున్నారు. 2014లో ఏపీలో ఓ దద్దమ్మ ముఖ్యమంత్రిగా(చంద్రబాబును ఉద్దేశిస్తూ..) ఉన్నారు. అప్పుడు కూటమిలో వీరంతా ఉన్నారు. అప్పుడు రైల్వే మంత్రిగా ఉండి పియుష్ గోయల్ ఎందుకు రైల్వే జోన్ ఇవ్వలేదు?. రైల్వే జోన్ కోసం 52 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అడ్డంకులు అన్నీ తొలగించి రైల్వే జోన్ కోసం భూములు అప్పగించాం అని మంత్రి బొత్స గుర్తుచేశారు. 2014-19 మధ్య కేంద్రంలో ఉంది సింగిల్ ఇంజిన్ ప్రభుత్వమా?.. మధ్యలో ఒక ఇంజిన్ పని చేసిందా? మరో ఇంజిన్ రిపేర్ అయ్యిందా? అని మంత్రి బొత్స ఎద్దేశా చేశారు.
స్వాతంత్రం వచ్చిన తరువాత ఎలక్టోరల్ బాండ్స్ లో అతి పెద్ద అవినీతి జరిగింది బీజేపీ హయాంలోనే. రాష్ట్ర ప్రయోజనాల కోసమే వైఎస్సార్‌సీపీ పని చేస్తుంది. మేలు జరిగే ప్రతీ అంశానికి మద్దతు ఇస్తాం. ఏది చేసినా రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికగా జరిగే కేటాయింపు. దళితుల రిజర్వేషన్లు తగ్గించాలని చూస్తే బీజేపీ మట్టి కొట్టుకుపోతుంది..
..మంత్రి పదవుల్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మాట్లాడే ప్రతీ మాటకు నిబద్దత ఉండాలి. పియుష్ గోయల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇకపై మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని ఆయన్ని కోరుతున్నా అని మంత్రి బొత్స అన్నారు.
కేంద్రంలో అలాంటి ప్రభుత్వం రావాలి
కేంద్రంలో మాపై ఆధారపడే పార్టీ రావాలని కోరుకుంటున్నాం. అలా వస్తే రాష్ట్రానికి రావాల్సిన ఇంకా కొన్ని ప్రయోజనాలు కోసం మాట్లాడవచ్చు. అది మా స్వార్థం. ప్రస్తుతం మనం అడిగితే పనులు అయ్యే పరిస్థితి కేంద్రంలో లేదు. కేంద్రం అన్నీ రాజకీయ కోణంలో ఆలోచిస్తుంది. అందుకే మనపై ఆధారపడే ప్రభుత్వం రావాలి..
అందుకే కన్నీళ్లొచ్చాయ్
షర్మిల మొన్నటి దాకా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి చెల్లి. కానీ, నిన్నటి నుంచి ప్రత్యర్థి పార్టీ వ్యక్తి. వారి పార్టీ విధానాలు వారివి. అది వాళ్ల ఇష్టం.చావుకి పుట్టుకకి సంబంధాలు ఉంటాయి. కానీ మిగతా వాటికి ఎందుకు ఉంటాయి?. మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ నన్ను తండ్రితో పోల్చినప్పుడు వైఎస్సార్ గుర్తొచ్చారు. సీఎం జగన్ నా పేరు పిలవగానే.. జనం కూడా బాగా స్పందించారు. అందుకే భావోద్వేగానికి గురయ్యా అని బొత్స అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment