
అమరావతి: సినీ విశ్లేషకుడు కత్తి మహేశ్ మృతిపై అనుమానాలు ఉంటే విచారణ జరపటానికి సిద్ధమని ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. కత్తి మహేశ్ దళిత జాతిలో ఉన్నత స్థితికి ఎదిగిన వ్యక్తి అని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడని బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో కూడా మహేశ్ ప్రచారంలో పాల్గొన్నారని తెలిపారు.
వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రూ.17 లక్షలు మంజూరు చేశారని గుర్తుచేశారు. ఆయన మృతిపై అనుమానాలు ఉన్నాయని కొందరు చేస్తున్న ప్రకటనలపై మంత్రి సురేశ్ స్పందించారు. ఆయన మృతిపై కుటుంబసభ్యులు ఫిర్యాదు చేస్తే విచారణ జరుపటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. మహేశ్ కుటుంబానికి భవిష్యత్తులో అండగా ఉంటామని, ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని మంత్రి సురేశ్ హామీ ఇచ్చారు.