మహేష్ ఇంట్లో రేపు ఫంక్షన్.. బంధువులతో ఇంటి లోగిలి కళకళలాడుతోంది.. మహేష్ కూతురు మాత్రం ఒక మూల కూర్చొని మూతి మూడు వంకర్లు తిప్పుతోంది.. మహేష్ పెదాలపై చిరునవ్వు కనిపిస్తున్నా.. మనసులో ఆందోళన ముఖంలో స్పష్టంగా తెలుస్తోంది.. కూతురు అడిగిన నగలు తేవడానికి తగిన డబ్బు లేదు.. ఏం చేద్దామా అని ఒకటే ఆలోచన.. ఇంతలో తళుక్కుమంటూ ఐడియా తట్టింది.. వెంటనే బందరులోని చిలకలపూడి వెళ్లాడు.. బడ్జెట్‌కు తగ్గట్టు, కూతురికి నప్పేట్టు నగలు తీసుకున్నాడు.. ఆ నగల ధగధగలతో ఫంక్షన్‌లో మహేష్ కూతురు మిలమిలా మెరిసిపోయింది.. మహేష్ మనసు ఆనందంతో మురిసిపోయింది. ఇదీ చిలకలపూడి ఇమిటేషన్ జ్యూయలరీ ప్రత్యేకత. అది నిజంగా కొత్త ‘బంగారు’ లోకమే.. కోవిడ్‌తో కుదేలైన ఈ వ్యాపారం.. ప్రభుత్వ ప్రోత్సాహంతో మళ్లీ కాంతులీనుతోంది.
మచిలీపట్నం: రోల్డ్‌గోల్డ్ నగల తయరీకి బందరు ఖ్యాతి గడించింది. బందరు కేంద్రంగా వందల ఏళ్లుగా సాగుతున్న ఈ పరిశ్రమ ఏడాదికి రూ. 100 కోట్లకు పైగా వ్యాపారం చేస్తోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ పరిశ్రమపై ఆధారపడి 30 వేల మంది జీవనోపాధి పొందుతున్నారు. కోవిడ్‌తో కుదేలైనా బందరు బంగారం మళ్లీ కాంతులీనుతోంది. కోవిడ్ వైరస్ తగ్గుముఖం పట్టడం, సాధారణ జన జీవనానికి ఎటువంటి ఆటంకం లేకుండా ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయటంతో రోల్డ్‌గోల్డ్ పరిశ్రమలు మళ్లీ తెరుచుకుంటున్నాయి.
ఇదీ చరిత్ర..
రోలింగ్ మెషిన్‌ల మీద రోల్ చేయగా వచ్చిన మెటీరియల్‌తో చేసిన నగలు కనుక వీటిని రోల్డ్ గోల్డ్ నగలు అంటారు. ఈ రోల్డ్ గోల్డ్ పరిశ్రమకు పితామహుడుగా గుడివాడ మోటూరుకు చెందిన కమ్మిలి వెంకటరత్నంను పరిగణిస్తారు. ఈయన 1902లో బందరు చిలకలపూడిలో కవరింగ్ గోల్డ్ పరిశ్రమను ప్రారంభించాడు.
ఆ తర్వాత అంచలంచెలుగా పరిశ్రమ అభివృద్ధి చెందగా.. 1982లో మచిలీపట్నం గోల్డ్ కవరింగ్ అండ్ ప్లేటింగ్ జ్యూయలరీ మ్యానుఫ్యాక్చరింగ్ వెల్‌ఫేర్ అసోసియేషన్ ప్రారంభమైంది. ఈ క్రమంలో పరిశ్రమను ప్రభుత్వం గుర్తించి మచిలీపట్నం శివారు పోతేపల్లిలో ‘మచిలీపట్నం ఇమిటేషన్ జ్యూయలరీ పార్క్’ పేరుతో అభివృద్ధి చేసింది. ప్రస్తుతం దీని పరిధిలో 240 యూనిట్లు ఉన్నాయి.
మళ్లీ కాంతులు..
► కోవిడ్ ప్రభావంతో దాదాపు పది నెలల పాటు పూర్తిగా మూతపడిన నగల తయారీ పరిశ్రమ నెమ్మదిగా కోలుకుంటోంది. ప్రస్తుతం 90 యూనిట్లలో నగల తయారీ జరుగుతుంది.
►ప్రత్యక్షంగా, పరోక్షంగా పది వేల మంది దీనిలో భాగస్వాములవుతున్నారు. దీంతో ప్రతి రోజూ రూ.50 లక్షల మేర విలువ గల బంగారు నగలను తయారు చేస్తూ, ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు.
►రోల్డ్‌గోల్ నగలను కొనుగోలు చేసేందుకు రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచే కాకుండా, పొరుగున ఉన్న తెలంగాణ, చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా కొనుగోలు దారులు వస్తున్నారు. ఇక్కడ నుంచి నగలు తీసుకెళ్లి వారి వారి ప్రాంతాలో దుకాణాలు నిర్వహించుకొని విక్రయిస్తుంటారు.
అ‘నగ’నగా చిలకలపూడి..
బందరు లడ్డూ, బాదం పాలుతో పాటు రోల్డ్‌గోల్డ్ నగల తయారీకి బందరు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంది. రోల్డ్‌గోల్డ్ నగల తయారీతో పాటు, వాటిని విక్రయించేందుకు దుకాణాలు సైతం ఇక్కడ వందలాదిగా వెలిశాయి. బందరులోని ఏ వీధిలో చూసిన రోల్డ్‌గోల్డ్ నగల దుకాణాలు దర్శనమిస్తాయి. చిలకలపూడిలో ప్రతి ఇల్లూ ఓ జ్యూయలరీ పరిశ్రమే.
రూ.3 వేలు పెడితే ఒంటినిండా బంగారం..
ప్రస్తుతం బంగారం ధర సామాన్యులకు అందుబాటులేని పరిస్థితి. అంతో, ఇంతో ఆర్థికంగా ఉన్నా, మార్కెట్‌లో ట్రెండ్‌కు అనుగుణంగా వచ్చిన మోడల్స్ కొనుగోలు చేయటం కష్టంగానే మారుతోంది. అందుకనే సామాన్యుల నుంచి ధనిక వర్గాల వారు వరకు వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలపై ఆసక్తి చూపుతారు. బందరులో రూ. 3 వేలు పెడితే ఒంటినిండా నగలు వేసుకోవచ్చు. గ్యారెంటీ లేనివి ఒక నెల, గ్యారంటీ ఆభరణాలు ఆరు నెలల పాటు ఫంక్షన్లు, పెళ్లిలో సింగారించుకుని జిగేల్‌మనచ్చు.
రాయితీ లేకుంటే మూతే..
ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన రోల్డ్‌గోల్డ్ పరిశ్రమను కోవిడ్ కోలుకోలేని దెబ్బతీసింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఇచ్చిన విద్యుత్ రాయితీ పరిశ్రమ నిలబడేలా చేసింది. ప్రస్తుతం గతంతో పోల్చితే 60 శాతం మేర వ్యాపారం సాగుతోంది. పది నెలల పూర్తిగా మూసివేశాం. ఆ కాలానికి కార్మికులను ఆదుకునేలా ప్రభుత్వం సాయం చేస్తే బాగుంటుంది. అన్నివర్గాల వారిని ఆదుకుంటున్న ప్రభుత్వం రోల్డ్‌గోల్డ్ పరిశ్రమలోని కార్మికులను కూడా ఆదుకోవాలి.
– అంకెం జితేంద్ర కుమార్, అసోసియేషన్ కార్యదర్శి
పదేళ్లుగా ఇదే వ్యాపారం
పదేళ్లుగా రోల్డ్‌గోల్డ్ నగల విక్రయం చేస్తున్నాం. దుకాణాన్ని నేనే చూసుకుంటాను. భర్త సాయంతో పాటు, మరో ఇద్దరికి జీతం ఇచ్చి షాపులో పెట్టుకున్నాం. ఇప్పుడైతే రోజుకు రూ.15 నుంచి రూ.20 వేలు వరకు అమ్మకం సాగుతోంది. కోవిడ్ ముందైతే రూ.30 వేలు వరకు అమ్మడుపోయేవి. అన్నీ పోను రోజుకు వెయ్యి వరకు మిగులుతోంది. మంచి మోడల్స్ కొనుగోలుకు ఎక్కువ ఆదరణ లభిస్తోంది.
– మారుబోయిన శివాని, చిలకలపూడి
తోడ్పాటు ఇస్తున్న ప్రభుత్వ రాయితీ..
ఎన్నో ఏళ్లుగా రోల్డ్‌గోల్డ్ పరిశ్రమను నమ్ముకుని వేలాది మంది జీవనం సాగిస్తున్నారు. కానీ వీరి సమస్యలను పాలకులెవ్వరూ పట్టించుకోలేదు. పాదయాత్ర సమయంలో బందరు వచ్చిన ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రోల్డ్‌గోల్డ్ పరిశ్రమను చూసి, తాము అధికారంలోకి వస్తే అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
ఇచ్చిన మాట మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే రోల్డ్‌గోల్డ్ యూనిట్‌లకు విద్యుత్ రాయితీ ప్రకటించారు. యూనిట్ విద్యుత్ వినియోగంపై వాస్తవంగా అయితే రూ. 9.50 చెల్లించాల్సి ఉంది. కానీ రోల్డ్‌గోల్ నగల తయారీదారులకు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రూ.6 రాయితీ కల్పించింది. దీంతో పరిశ్రమ పురోభివృద్ధివైపు అడుగులు వేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment