చిలకలపూడిని మింగేస్తున్న డ్రాగన్‌ | China occupies 60 percent of the rold gold jewelry market | Sakshi
Sakshi News home page

చిలకలపూడిని మింగేస్తున్న డ్రాగన్‌

Published Sun, Jul 12 2020 3:33 AM | Last Updated on Sun, Jul 12 2020 3:33 AM

China occupies 60 percent of the rold gold jewelry market - Sakshi

సాక్షి, అమరావతి: చైనా.. మన భారత భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించడమే కాదు.. మారుమూల ప్రాంతాలకు సైతం చొచ్చుకొచ్చి మన మార్కెట్లను కబ్జా చేసేసింది. చైనా వస్తువుల్ని బహిష్కరించాలనే డిమాండ్‌ పురుడు పోసుకోకముందే.. రోల్డ్‌ గోల్డ్‌ (గిల్టు) నగల తయారీలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన చిలకలపూడి మార్కెట్‌ను డ్రాగన్‌ మింగేసింది.     

‘బంగారం’ లాంటి నగలు
► చిలకలపూడి చుట్టుపక్కల దాదాపు వందేళ్ల నాటినుంచి గిల్టు నగలు తయారు చేస్తున్నారు. 
► గాజులు, వడ్డాణాలు, చెవి దిద్దులు, నెక్లెస్‌లు, హారాలు, పాపిడి బిళ్లలు, జడగంటలు, దేవతా విగ్రహాలకు కిరీటాలు, హారాలు, గొలుసులు, వంకీలు, పట్టీలు, మాటీలను వేలాది డిజైన్లలో తయారు చేసే నిపుణులకు ఇక్కడ కొదవలేదు. వీటికి 6 నెలలు, ఏడాది, రెండుమూడేళ్ల వరకు గ్యారంటీ ఇచ్చి మరీ విక్రయిస్తుంటారు. 
► ప్రపంచ స్థాయి గుర్తింపు కలిగిన చిలకలపూడి బంగారం కుటీర పరిశ్రమగా  అభివృద్ధి చెంది అంతర్జాతీయ మార్కెట్లకు ఇమిటేషన్‌ నగలు అందిస్తోంది.
► కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన 10 వేల కుటుంబాలు (45 వేల మందికి పైగా కార్మికులు) వీటి తయారీపై జీవనోపాధి పొందుతున్నాయి. మచిలీపట్నంలోని పోతేపల్లి జ్యువెలరీ పార్కులో మొత్తం 236 పరిశ్రమలున్నాయి. 
► వీటికి అనుబంధంగా మచిలీపట్నం, గూడూరు, పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను, చల్లపల్లి, ఘంటసాల, పామర్రు, మొవ్వ తదితర ప్రాంతాల్లో వేలాది మంది ఇళ్ల వద్ద నగలకు రాళ్లు అద్దడం, మంగళ సూత్రాలకు మెరుగులు అద్దడం, పూసల దండలు చుట్టడం వంటి వివిధ రకాల పనులు చేస్తుంటారు.

రూ.80 కోట్ల టర్నోవర్‌ను మింగేసిన డ్రాగన్‌
► మచిలీపట్నం ప్రాంతంలో నెలకు సగటున రూ.7 కోట్ల చొప్పున ఏడాదికి రూ.80 కోట్ల విలువైన ఇమిటేషన్‌ నగలు ఉత్పత్తి అయ్యేవి. 
► గ్లోబలైజేషన్‌ పుణ్యమా అని ఇమిటేషన్‌ నగలపై కన్నేసిన డ్రాగన్‌ క్రమంగా చిలకలపూడి పరిశ్రమను కబ్జా చేసింది.
► ప్రస్తుతం చిలకలపూడి నగల మార్కెట్‌లో ఏకంగా 60 శాతం చైనా ప్రమేయం ఉంటే.. కేవలం 40 శాతం మాత్రమే స్థానికత ఉంది.
► నాణ్యత మాట అటుంచితే చైనా ఉత్పత్తుల ధర తక్కువగా ఉండటమే ఇందుకు కారణం.

లాభాలు తగ్గాయి
చైనా సరుకులు తక్కువ ధరకు వస్తున్నాయనే దిగుమతి చేసుకుంటున్నాం. 60 శాతం చైనా సరుకులు మన మార్కెట్‌ను ఆక్రమించాయి. వాటి నాణ్యత ఎలా ఉన్నా ముందుగానే డబ్బులు చెల్లించాల్సి రావడంతో లాభాలు తగ్గిపోయాయి. అవే ధరలకు మన దేశీయ మార్కెట్‌లో ముడి సరుకుల ఉత్పత్తి జరిగితే చైనా సరుకుల్ని బహిష్కరించవచ్చు.
– పీవీ సుబ్బారావు, అధ్యక్షుడు, మచిలీపట్నం ఇమిటేషన్‌ జ్యువెలరీ పార్క్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌

స్వయం సమృద్ధి సాధిస్తేనే..
చైనా ఉత్పత్తులను బహిష్కరించాలనే  నినాదం చాలా గొప్పదే. అయితే, మనం స్వయం సమృద్ధి సాధించే దిశగా దిగువ స్థాయి వరకు ప్రయత్నం జరగాలి. ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన చిలకలపూడి గిల్టు నగల రంగాన్ని నిలబెట్టుకునే స్థాయిలో మన ప్రయత్నాలు గట్టిగా జరగాలి.
    – నూకల సురేష్, గోల్డ్‌ కవరింగ్‌ జ్యువెలరీ అధినేత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement