సాక్షి, తిరుపతి: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు. రహదారులు, ఇళ్లు, పలు సంస్థల నిర్మాణాలకు ఎంతగానో ఆర్థిక సాయం చేస్తోందన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని బేరివారి మండపం వద్ద శనివారం సాయంత్రం నిర్వహించిన సంపర్క్ అభియాన్ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మంగళగిరిలో రూ.1,680 కోట్లతో ఎయిమ్స్‌ను అభివృద్ధి చేశామని తెలిపారు.
ఇదే విషయాన్ని మన్ కీ బాత్‌లో ప్రధాని కూడా చెప్పారంటూ గుర్తు చేశారు. రాష్ట్రంలో 8,744 కి.మీ జాతీయ రహదారుల నిర్మాణంతో పాటు రూ.300 కోట్లతో తిరుపతి రైల్వేస్టేషన్‌ను వరల్డ్ క్లాస్ రైల్వేస్టేషన్‌గా ఆధునికీకరిస్తున్నట్లు చెప్పారు. తిరుపతిలో రూ.800 కోట్లతో ఐఐటీ, రూ.1,491 కోట్లతో ఐసర్ నిర్మాణంలో ఉందని తెలిపారు. కడప–రేణిగుంట–నాయుడుపేట జాతీయ రహదారిని అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు. దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా ఏపీలో పట్టణ ప్రాంత పేదలకు 21 లక్షలు, గ్రామీణ ప్రాంత పేదలకు 2.48 లక్షల ఇళ్లు ఇచ్చామని తెలిపారు.
స్వచ్ఛ భారత్ ద్వారా ఏపీలో 42 లక్షల మరుగుదొడ్ల నిర్మాణం జరిగిందని, ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం ద్వారా 3,273 కి.మీ మేర గ్రామీణ రోడ్లు నిర్మాణం చేపట్టామని తెలిపారు. ఇంతగా కృషి చేస్తున్న బీజేపీకి ఒక్క అవకాశం ఇస్తే రాయలసీమ వెనుకబాటుతనం పోగొట్టడంతోపాటు రాష్ట్రాభివృద్ధికి మరింతగా బాటలు వేస్తామని స్పష్టం చేశారు.
ప్రపంచ దేశాలకు దీటుగా భారత్
భారత ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలనలో భారతావని ప్రపంచ దేశాలకు దీటుగా అన్ని రంగాల్లో సుస్థిరాభివృద్ధిని సొంతం చేసుకుని ప్రపంచ ఆర్థిక రంగంలో పటిష్టంగా నిలిచిందని నడ్డా అన్నారు. ప్రధాని మోదీ రాజకీయాలకు సరికొత్త భాష్యం పలుకుతూ ఓటు బ్యాంకు రాజకీయాలకు దూరంగా బాధ్యత, పారదర్శకతతో కూడిన రాజకీయాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పారు.
గతంలో కేవలం 59 గ్రామాలకే ఇంటర్నెట్ కనెక్షన్లు ఉంటే ఇవాళ కేంద్రం రెండు లక్షల గ్రామాలకు ఇంటర్నెట్ కనెక్షన్లు ఇచ్చిందన్నారు. 19 వేల గ్రామాలకు సౌభాగ్య పథకం ద్వారా విద్యుత్ సౌకర్యాన్ని కల్పించిందన్నారు. 3 లక్షల 28 వేల కిలోమీటర్ల గ్రామసడక్ పథకం ద్వారా గ్రామీణ రోడ్లను అభివృద్ధి చేసిందని తెలిపారు.
ప్రధాన మంత్రి గరీబ్ అన్న్ కల్యాణ్ యోజన పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో 2 కోట్ల 60 లక్షల మంది ప్రజలు లబ్ధి పొందుతున్నారని చెప్పారు. పేదరిక నిర్మూలనను 22 శాతం నుంచి 10 శాతం కంటే తక్కువకు తీసుకొచ్చిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందన్నారు. మోదీ ముందు చూపు వల్లే దేశంలో ఆర్థిక వ్యవస్థ నిలకడగా ముందుకు సాగుతోందన్నారు. ప్రపంచ ఆర్థిక రంగంలో భారత్ 5వ స్థానానికి ఎగబాకిందని తెలిపారు.
ఏపీలో అసమర్థ పాలన
ఆంధ్రప్రదేశ్‌లో తాము వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందించి రాష్ట్రాభివృద్ధికి నిధులు అందిస్తున్నప్పటికీ అసమర్థ పాలన కొనసాగుతోందని నడ్డా విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి ఎక్కువైందన్నారు. ఇసుక, మద్యం, ల్యాండ్, మైనింగ్ మాఫియా తారస్థాయికి చేరిందని ధ్వజమెత్తారు. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి ఆనాడు ప్రధాని శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ.. రాష్ట్రానికి రాజధాని లేకపోవడం శోచనీయమన్నారు.
చిత్తూరు జిల్లాకు కేంద్రం ఇచ్చిన నిధులను గత పాలనలో చంద్రబాబు పక్కదారి పట్టించి అధోగతిపాలు చేశారని ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. రూ.7,400 కోట్లతో కండలేరు జలాశయం నుంచి శ్రీకాళహస్తి, తిరుపతి, మదనపల్లికి నీరందించే బృహత్తర పతకాన్ని చంద్రబాబు రద్దు చేశారని ధ్వజమెత్తారు. తిరుపతిలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కోసం బీసీసీఐ ముందుకొస్తే భూ సమస్య పరిష్కరించకుండా స్టేడియం ప్రతిపాదనను కూడా రద్దు చేశారని తెలిపారు.
హైదరాబాద్ తరహా కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేత తిరుపతిలో శంకుస్థాపన చేయిస్తే ఆ ప్రాజెక్టునూ టీడీపీ పక్కన పెట్టిందన్నారు. నిమ్జ్‌ను చిత్తూరు జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో ఏర్పాటు చేయాలనుకుంటే దాన్ని కూడా రద్దు చేశారని తెలిపారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ కేంద్ర పెద్దలను కాకా పట్టడం కోసం సీఎం జగన్ తరచూ ఢిల్లీ టూర్లకు వెళుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు పురందేశ్వరి, సునీల్ దేవదర్, సత్యకుమార్, జీవీఎల్‌నరసింహరావు, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, సుజనాచౌదరి, ఆదినారాయణరెడ్డి, విష్ణువర్థన్‌రెడ్డి, కోలా ఆనంద్, భానుప్రకాష్‌రెడ్డి, దయాకర్‌రెడ్డి తదితరులు ప్రసంగించారు.
కార్యకర్తల కష్టాల్లో నుంచి పుట్టుకొచ్చిన పార్టీ బీజేపీ
తిరుచానూరు (చంద్రగిరి)/తిరుమల : ప్రతి కార్యకర్త ఎటువంటి లాభపేక్ష లేకుండా కష్టపడి పనిచేయడంతోనే ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అధ్యక్షతన జిల్లా శక్తి కేంద్ర ప్రముఖ్ కార్యక్రమాన్ని శనివారం తిరుచానూరు సమీపంలోని ఓ కల్యాణ మండపంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ.. ఎటువంటి అవినీతికి తావివ్వకుండా పారదర్శక పాలన అందిస్తున్న ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుందన్నారు. అయోధ్యలో చరిత్రలో నిలిచిపోయేలా రామ మందిరం నిర్మిస్తున్న ఘనత కూడా బీజీపీకే దక్కిందని తెలిపారు. తొమ్మిదేళ్ల పాలనలో బీజేపీ చేపిట్టిన అభివృద్ధి పనులను ఈ నెల 20వ తేది నుంచి 30వ తేది వరకు ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించాలని ఆయన పిలుపునిచ్చారు.
త్వరలోనే ప్రధాని మోదీ కార్యకర్తలతో నేరుగా కలసే అవకాశం ఉందన్నారు. కాగా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు పండితులు వేద ఆశీర్వచనాలు, అధికారులు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. అంతకు ముందు శ్రీకాళహస్తిలోని జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment