సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ప్రజల ఆలోచనకు శనివారం నాటి విశాఖ గర్జన ప్రతిరూపంగా నిలిచిందని, జోరు వానలోనూ ప్రజలు గర్జనలో పాల్గొన్నారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విశాఖకు రాజధాని వద్దని గొంతులెత్తుతున్న వారికి ఓ కనువిప్పు అని పేర్కొన్నారు. విశాఖకు రాజధాని వద్దనే వాళ్లు తమ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలన్నారు. టీడీపీ, జనసేన పార్టీలు కూడా తమ వైఖరిని మార్చుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. విశాఖ మీద.. ఉత్తరాంధ్ర మీద ఎందుకంత ద్వేషం అని ప్రశ్నిచారు. రాజధానికి విశాఖ దోహదపడుతుందని తెలిసి కూడా విషం కక్కుతున్నారని.. ప్రతిపక్ష పార్టీల ఆకాంక్షలు నెరవేరవన్నారు. విశాఖకు రాజధాని వచ్చి తీరడం ఖాయమని స్పష్టం చేశారు.
‘విశాఖలో ఇంటింటికెళ్లి బ్యాలెట్ పెడితే ప్రతిపక్షాలకు ఆ ప్రాంత ప్రజల అభిప్రాయం తెలుస్తుంది. విశాఖ గర్జన జరుగుతుంటే.. రాజధాని వద్దని టీడీపీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టింది. ఈ ప్రాంతానికి టీడీపీ అవసరమా? ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటున్నారని టీడీపీ నేతలను ప్రజలు చొక్కా పట్టుకుని అడగాలి. అమ్మ పెట్టా పెట్టదు.. అడుక్కు తిననివ్వదన్నట్టుగా ఉంది.
జనసేనకు ఓ విధానం ఉందా..? జనసేన అసలు రాజకీయ పార్టీనేనా..? జనసేనకు రాజకీయ పార్టీ లక్షణమే లేదు. విశాఖకు రాజధాని వద్దని పవన్ ఎందుకొద్దంటున్నారు? గాజువాక నుంచి పోటీ చేసినప్పుడు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పలేదా? ఎయిర్ పోర్టులో సంఘటనను చంద్రబాబు తప్పు పట్టడం పోయి.. పోలీసులను తప్పు పడతారా? ఏ చిన్న సంఘటన జరిగినా చంద్రబాబు లేఖలు రాస్తున్నారు కదా? మంత్రులపై దాడిని ఎందుకు తప్పు పట్టరు? జనసేన రాజకీయ పార్టీ కాదు. జనసేన ఓ సెలబ్రిటీకి చెందిన పార్టీ. రాజధాని అంటే ఎయిర్ కనెక్టివిటీ.. సీ కనెక్టివిటీ ఉండాలి.. రైల్ కనెక్టివిటీ ఉండాలి. అమరావతికి ఏ కనెక్టివిటీ ఉంది? విశాఖకు కొద్దిపాటి ఖర్చు పెడితే అద్భుతమైన అభివృద్ధి జరుగుతుంది.’ అని పేర్కొన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.
ఇదీ చదవండి: పవన్ కల్యాణ్ తీరుపై విశాఖ వాసుల ఆందోళన.. పవన్ గో బ్యాక్ అంటూ నినాదాలు
Comments
Please login to add a commentAdd a comment