
సాక్షి, అమరావతి: ‘రాజద్రోహం కేసులా..’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తాను అధికారంలో ఉండగా ఏనాడూ అలాంటి కేసులు పెట్టించ లేదని బుకాయిస్తుండటం విస్మయ పరుస్తోందని రాజకీయ పరిశీలకులు ఆశ్చర్యపోతున్నారు. రాజ ద్రోహానికి పాల్పడే ఆయన తొలిసారి సీఎం అయ్యారు. 1994 ఎన్నికల్లో ప్రజల మద్దతుతో పార్టీని గెలిపించుకుని సీఎం అయిన ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా రాజద్రోహానికి పాల్పడ్డారు. వైస్రాయ్ హోటల్ కేంద్రంగా కుట్ర పన్ని 1995లో ఎన్టీ రామారావును పదవి నుంచి తొలగించి, అడ్డదారిలో సీఎం అయ్యారు. పిల్లనిచ్చిన, రాజకీయ పునర్జన్మనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి నమ్మక ద్రోహానికి పాల్పడ్డారు. చంద్రబాబు సీఎంగా ఉన్నన్నాళ్లూ రాజద్రోహం కేసులను ఆయుధాలుగా చేసుకునే రాజకీయ ప్రత్యర్థులను వేధించారు. తన ప్రత్యర్థులు, తన అవినీతిని ప్రశ్నించే వారిపై ఆయన నిస్సంకోచంగా ఈ కేసులు పెట్టించారని, పొరుగు రాష్ట్రం సీఎంపైనా రాజద్రోహం కేసులు పెట్టించిన ఘనత ఈ దేశంలో చంద్రబాబుకే దక్కుతుందని పలువురు వ్యాఖ్యనిస్తున్నారు.
‘ఓటుకు కోట్లు’ కేసులో దొరికిపోయి..
రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉంటూ చంద్రబాబు తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని అడ్డదారిలో గెలిపించుకునేందుకు ‘ఓటుకు కోట్లు’ కుట్రకు పాల్పడ్డారు. ఆడియో, వీడియో సాక్ష్యాలతో సహా అడ్డంగా దొరికిపోయారు. ఆ అక్కసుతో ఏకంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌పై 12 రాజద్రోహం కేసులు పెట్టించారు. 12 చోట్ల ఫిర్యాదులు చేయించి 124 ఏ సెక్షన్ కింద కేసులు పెట్టించారు. ‘నీకు ఏసీబీ ఉంటే నాకూ ఏసీబీ ఉంది.. నీకు పోలీసులు ఉంటే నాకూ పోలీసులు ఉన్నారు’ అని కేసీఆర్‌ను ఉద్దేశించి మాట్లాడారు. తన ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తూ కేసీఆర్‌పై అక్రమంగా దేశద్రోహం కేసులు పెట్టించిన విషయం అందరికీ తెల్సిందే.
రాజద్రోహం కేసులతో బ్లాక్ మెయిల్
తన అక్రమాలు, అవినీతిని ప్రశ్నించిన వారిపై చంద్రబాబు లెక్కలేనన్ని రాజద్రోహం కేసులు పెట్టించారు. చంద్రబాబు తాను సీఎంగా ఉండగా విశాఖపట్నం ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తూ జీవో జారీ చేశారు. దీనిపై గిరిజనులు తీవ్ర స్థాయిలో ఉద్యమించారు. ఆ ఉద్యమానికి మద్దతుగా అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నం ఏజెన్సీలోని చింతపల్లిలో బహిరంగ సభ నిర్వహించారు. బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ మాట్లాడిన అప్పటి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై చంద్రబాబు ప్రభుత్వం రాజద్రోహం కేసుతోపాటు మూడు కేసులు నమోదు చేసింది. ఆ కేసుల పేరుతోనే బ్లాక్ మెయిల్ చేయడంతోపాటు కోట్లు ఎరవేసి ఆమెను నిబంధనలకు విరుద్ధంగా టీడీపీలో చేర్చుకున్నారు.
ప్రశ్నించిన వారిపై ఎడాపెడా కేసులే
► టీడీపీ ప్రభుత్వంలో అప్పటి హోం మంత్రి చినరాజప్ప దిష్టి బొమ్మను తగుల బెట్టారని బీజేపీ నేతలపై రాజద్రోహం కేసు పెట్టారు.
► టీడీపీ ప్రభుత్వంలో కోర్టు తీర్పులను విమర్శించారని చెబుతూ న్యాయవాదుల మీద సెక్షన్ 124 ఏ ప్రకారం రాజద్రోహం కేసులు బనాయించారు.
► చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు గుంటూరులో టీడీపీ నిర్వహించిన ‘నారా హమారా’ సభ సందర్భంగా ప్రభుత్వ అక్రమాలు, వైఫల్యాలను ప్రశ్నించారని కొందరు ముస్లిం యువకుల మీద కుట్ర కేసులు నమోదు చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారిపై కేసులు ఎత్తి వేసింది.
► తనకు వ్యతిరేకంగా వార్తలు రాశారని ‘సాక్షి’ గుంటూరు రిపోర్టర్‌పై తన మనుషులతో తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసించి అక్రమంగా కుట్ర కేసు పెట్టించారు.