సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను ఎన్ని వంకర్లు తిప్పారో.. ఆ కేసులో నిందితుడు నారా లోకేశ్ సీఐడీ విచారణలో ప్రశ్నలకు అన్ని వంకర్లు తిరిగారు. చంద్రబాబు కుటుంబం, ఆయన అస్మదీయుల భూముల విలువ అమాంతంగా పెరిగేలా ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను మార్చిన తీరుపై సీఐడీ అధికారులు అడిగిన సూటి ప్రశ్నలకు లోకేశ్ నేల చూపులు చూశారు. తాను సభ్యుడిగా ఉన్న మంత్రివర్గ ఉప సంఘం ద్వారానే అక్రమాల కథ నడిపిన తీరును సీఐడీ ఆధారాలతో సహా ముందు పెట్టడంతో బిత్తరపోయారు.
హెరిటేజ్ భూముల కొనుగోలు, లింగమనేని కుటుంబం నుంచి క్విడ్‌ప్రోకో కింద పొందిన కరకట్ట నివాసంపై ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారు. విచారణకు సహకరించకుండా దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు యత్నించారు. ఈ కేసులో ఏ–14గా ఉన్న లోకేశ్‌ను సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు రెండో రోజు బుధవారం తాడేపల్లిలోని సీఐడీ కార్యాలయంలో విచారించారు.
ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగిన ఈ దర్యాప్తునకు సహకరించకుండా ఉండేందుకు లోకేశ్ అనేక ప్రయత్నాలు చేశారు. అయినా సిట్ బృందం తమదైన శైలిలో కీలక సమాచారాన్ని రాబట్టినట్టు తెలిసింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆయన న్యాయవాది సమీప దూరంలో ఉండగా ఆడియో, వీడియో రికార్డింగ్ నిర్వహిస్తూ అధికారులు లోకేశ్‌ను విచారించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ దర్యాప్తునకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
అలైన్‌మెంట్ మార్చాలని ఎందుకు ఒత్తిడి చేశారు?
ఇన్నర్ రింగ్ రోడ్డుతో పాటు అమరావతి కోర్ కేపిటల్‌పై టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రివర్గ ఉప సంఘం ద్వారా అక్రమాల కథ నడిపిన తీరుపై సీఐడీ లోకేశ్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది. జూనియర్ మంత్రి అయినప్పటికీ లోకేశ్‌కు ఉప సంఘంలో స్థానం కల్పించడంపై మొదటగా ప్రశ్నించింది. పేరుకు మంత్రివర్గ ఉప సంఘం అయిన్పటికీ ఇతర సభ్యులకంటే అందులో లోకేశ్, నారాయణదే హవా అని, భూ సమీకరణ, ఇన్నర్‌రింగ్ రోడ్డుకు భూసేకరణపై వారే కీలకంగా వ్యవహరించినట్టు సీఐడీ ఆధారాలు సేకరించింది.
వాటిని లోకేశ్‌కు చూపిస్తూ ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను మార్చాలని సీఆర్‌డీఏ అధికారులపై ఎందుకు ఒత్తిడి చేశారని ప్రశ్నించింది. తామేమీ ఒత్తిడి చేయలేదని లోకేశ్ బుకాయించారు. మంత్రివర్గ ఉపసంఘం, టీడీపీ ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే అలైన్‌మెంట్‌ను మార్చినట్లు అప్పటి సీఆర్‌డీఏ అధికారులు వాంగ్మూలం ఇచ్చిన అంశాన్ని సీఐడీ అధికారులు ప్రస్తావించడంతో లోకేశ్ షాక్ తిన్నారు. దాంతో ఆయన నోట మాట రాలేదని సమాచారం. వెంటనే తన న్యాయవాదితో సంప్రదించి చెబుతానని చెప్పారు.
న్యాయవాదితో మాట్లాడిన తరువాత కూడా ఆయన ఈ అంశంపై సమాధానం దాట వేసేందుకే ప్రయత్నించారు. ముందుగానే సీఆర్‌డీఏ అధికారులతో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను ఖారారు చేయించి, దానినే మాస్టర్‌ప్లాన్‌లో చేర్పించి సింగపూర్‌కు చెందిన కన్సల్టెన్సీ ద్వారా ఆమోదింపజేయడం అంటే అక్రమమే కదా.. అని అధికారులు ప్రశ్నించడంతో లోకేశ్ మౌనంగా ఉండిపోయారు. మంత్రివర్గ ఉప సంఘం వ్యవహారం అంతా బూటకమని, ఆ ముసుగులో చంద్రబాబు, నారాయణ, లింగమనేని కుటుంబాల భూముల విలువ అమాంతంగా పెంచుకున్నారని సీఐడీ కీలక ఆధారాలు చూపించడంతో లోకేశ్ నిశ్చేష్టుడయ్యారు.
హెరిటేజ్ భూముల అంశంపై అసహనం
ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని హెరిటేజ్ ఫుడ్స్ భూములు కొన్న అంశంపై సీఐడీ సూటి ప్రశ్నలకు లోకేశ్ తీవ్ర అసహనానికి గురయ్యారు. ఏ ప్రాతిపదికన ఆ ప్రాంతంలో భూములు కొనాలని హెరిటేజ్ ఫుడ్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని అధికారులు వేసిన ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానమివ్వలేదు. ప్రస్తుతం తాను హెరిటేజ్ ఫుడ్స్‌లో డైరెక్టర్‌గా లేనని, ఆ విషయాలు తనకు తెలియవని అన్నారు. భూములు కొనాలని తీర్మానించిన సమయంలో మీరే డైరెక్టర్‌గా ఉన్నారు కదా అనే ప్రశ్నకు మాత్రం సమాధానం దాటవేయడం గమనార్హం.
కరకట్ట నివాసం అంశంపై కస్సుబుస్సు
లింగమనేని కుటుంబం నుంచి క్విడ్‌ప్రోకో కింద పొందిన కరకట్ట బంగ్లాపై సీఐడీ ప్రశ్నించడంతో లోకేశ్ తత్తరపాటుకు గురై అధికారులపై కస్సుబుస్సులాడారు. ఆ ఇంటికి తాము అద్దె చెల్లించామన్నారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి ఆదాయ పన్ను రిటర్న్‌లను అధికారులు చూపిస్తూ ప్రశ్నించడంతో ఆయన తీవ్ర అసహనానికి గురయ్యారు. తన తల్లి ఆదాయ పన్ను రిటర్న్‌ను ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. దర్యాప్తులో భాగంగా ఏ పత్రాలనైనా సంబంధిత శాఖలను సంప్రదించి తీసుకునే వెసులుబాటు కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలకు ఉందనే అవగాహన ఆయనకు లేకపోవడం విడ్డూరం.
లింగమనేని రమేశ్ ఆ కరకట్ట నివాసాన్ని ఉచితంగా ఇచ్చానని ఓసారి, కాదు దేశ భక్తితో ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చానని మరోసారి చెప్పిన విషయాలను అధికారులు ప్రస్తావించారు. దాంతో అసలు తనకు ఆ కరకట్ట నివాసం గురించి తెలియదని లోకేశ్ బుకాయించారు. మంత్రి హోదాలో మీరు నివసించిన ఇంటి గురించి తెలియదా... అని అధికారులు రెట్టించి అడిగేసరికి సమాధానం దాటవేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ కుంభకోణానికి సంబందించి మరికొన్ని కీలక వ్యవహారాలపై లోకేశ్‌ను సీఐడీ అధికారులు ప్రశ్నించారు.
కానీ ఆయన నుంచి సరైన సమాధానం రాలేదు. వీలైనంతవరకు దర్యాప్తునకు సహకరించకుండా విషయాన్ని పక్కదారి పట్టించేందుకే యత్నించారు. పలువురు అధికారుల పేర్లను ప్రస్తావిస్తూ వారిని ప్రశ్నించాలని సీఐడీకి సూచించడం హాస్యాస్పదంగా మారింది. దర్యాప్తు అధికారుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన నిందితుడే ఇతరులను ప్రశ్నించాలని చెబుతుండటం విడ్డూరంగా ఉందని సీఐడీవర్గాలు వ్యాఖ్యానించాయి. అవసరమైతే మరోసారి విచారణకు రావల్సి ఉంటుందని సీఐడీ అధికారులు లోకేశ్‌కు చెప్పి బుధవారం విచారణ ప్రక్రియను ముగించారు.
సంబంధం లేని ప్రశ్నలు వేశారు: లోకేశ్
సీఐడీ అధికారులు తనకు ఏమాత్రం సంబంధం లేని ప్రశ్నలు వేశారని లోకేశ్ చెప్పారు. రెండో రోజు విచారణ అనంతరం సీఐడీ కార్యాలయం బయట మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మిస్తే హెరిటేజ్ ఫుడ్స్ భూములు కోల్పోతుందని ఈ విచారణ ద్వారా తనకు తెలిసిందన్నారు. కరకట్ట నివాసానికి తన తల్లి అద్దె చెల్లించారన్నారు. తన తల్లి ఆదాయ పన్ను రిటర్న్‌లను అధికారులు ఎలా సేకరిస్తారని ప్రశ్నించారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తానన్నారు. సాక్షి పత్రికలో షేర్లను కొందరు కొన్నట్లుగా తమ హెరిటేజ్ ఫుడ్స్ షేర్లను లింగమనేని కొనలేదని వ్యాఖ్యానించారు.
‘సాక్షి’ ప్రశ్నలకు తత్తరపాటు
ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణంలో లోకేశ్ పాత్రపై ‘సాక్షి’ ప్రతినిధులు ప్రశ్నించడంతో ఆయన తీవ్ర అసహనానికి గురయ్యారు. సాక్షి పత్రికపై అసత్య ఆరోపణలు చేసి విషయాన్ని పక్కదారి పట్టించేందుకు యత్నించారు. కానీ సాక్షి ప్రతినిధులు సూటి ప్రశ్నలు సంధించడంతో తత్తరపాటుకు గురయ్యారు. ఇతర మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. లోకేశ్‌తో సాక్షి, ఇతర మీడియా ప్రతినిధుల సంభాషణ ఇలా సాగింది..
సాక్షి: మీరు మంత్రివర్గ ఉప సంఘంలో సభ్యుడయ్యాకే ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను మార్చారని, హెరిటేజ్ ఫుడ్స్‌కు భూములు కొన్నారన్న అభియోగంపై మీ స్పందన ఏమిటి?
లోకేశ్: మంత్రివర్గ ఉప సంఘం సభ్యుడిగా నేను ఒత్తిడి చేసి ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌లో మార్పులు చేశానని సీఐడీ అంటోంది. కానీ అది నా శాఖకు ప్రమేయం లేని అంశం. అదే చెప్పా.
సాక్షి: ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ హెరిటేజ్ ఫుడ్స్ భూములు ఉన్న కంతేరు వైపు ఎందుకు మళ్లింది?
లోకేశ్: సీఐడీ అధికారులు నాకు బాహుబలి సినిమా చూపించారు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ గూగుల్ మ్యాప్ చూపించి ప్రశ్నించారు. ఆ రోడ్డు నిర్మిస్తే హెరిటేజ్ ఫుడ్స్ భూములు కోల్పోతుందని నాకు అర్థమైంది.
సాక్షి: క్విడ్‌ప్రోకో కిందే లింగమనేని మీకు కరకట్ట బంగ్లా ఇచ్చారని సీఐడీ అభియోగం మోపింది కదా?
లోకేశ్: మాకు క్విడ్ ప్రోకో అలవాటు లేదు. అలా మా హెరిటేజ్ ఫుడ్స్‌లో ఎవరూ పెట్టుబడులు పెట్టలేదు.
సాక్షి: మరి మీకు మాత్రమే లింగమనేని ఆ కరకట్ట బంగ్లాను ఎందుకు ఇచ్చారు?
లోకేశ్: ఆ ఇంటికి మేము అద్దె చెల్లిస్తున్నాం. ప్రభుత్వానికి ఆ మేరకు లేఖ కూడా రాశాం.
సాక్షి: అదే నిజమైతే 2019కు ముందు ఎందుకు అద్దె చెల్లించలేదు?
లోకేశ్: (వెంటనే సమాధానం చెప్పలేక మౌనం వహించారు. కాసేపటికి తేరుకుని..) ఆ విషయం నాకు తెలీదు. నాకు తెలిసినంతవరకు ఇప్పుడు అద్దె చెల్లిస్తున్నాం. మా అమ్మ ఐటీ రిటర్న్ రికార్డులు సీఐడీకి ఎలా వచ్చాయి? దీనిపై న్యాయపోరాటం చేస్తాం.
సాక్షి: మీ సన్నిహితుడు కిలారు రాజేశ్ ఎందుకు పరారయ్యారు?
లోకేశ్: ఆయన గురించి నాకేం తెలుస్తుంది? ఎక్కడ ఉన్నారో నాకు తెలీదు
ఇతర మీడియా ప్రతినిధులు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును జైలుకు పంపారు అని మీరు అంటున్నారు. జ్యుడిషియల్ రిమాండ్ విధించేది కోర్టులు కదా?
లోకేశ్: ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ వేసింది జగన్ ప్రభుత్వమే. అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును జ్యుడిషియల్ రిమాండ్‌కు
పంపారు.
మీడియా ప్రతినిధులు: మీరు మళ్లీ ఢిల్లీ వెళ్లిపోతారా?
లోకేశ్: నేను ఎక్కడికి వెళ్తానో మీకు చెప్పాలా? అది మీకు అనవసరం. నేను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిని. ఎక్కడికి వెళ్లినా
షెడ్యూల్ ఇస్తా.
Comments
Please login to add a commentAdd a comment