సాక్షి, అమరావతి: ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్ మార్పులో అక్రమాలు, క్విడ్ ప్రోకో ఆరోపణలపై సీఐడీ నమోదు చేసిన కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు హైకోర్టు బుధవారం తాత్కాలిక ఊరటనిచ్చింది. ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో చంద్రబాబు కస్టడీ కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్‌లో తదుపరి ముందుకెళ్లొద్దని విజయవాడ ఏసీబీ కోర్టును హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 16వ తేదీ వరకు పీటీ వారెంట్ విషయంలో ఎలాంటి ఉత్తర్వులు జారీచేయవద్దని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్రెడ్డి బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు.
ఈ కేసులో తదుపరి ఎలాంటి సమయం ఇచ్చే ప్రసక్తేలేదని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఒకవేళ సీనియర్ న్యాయవాదులు సుప్రీంకోర్టులో ఏదైనా కేసులో వాదనలు వినిపించాల్సి ఉంటే ఒక్కరోజు మాత్రమే గడువునివ్వడం సాధ్యమవుతుందని తేల్చి చెప్పారు. ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబునాయుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై బుధవారం జస్టిస్ సురేష్ రెడ్డి విచారించారు. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్, స్పెషల్ పీపీ యడవల్లి నాగవివేకానంద వాదించారు.
అప్పటివరకు రక్షణ కల్పించండి..
అంతకుముందు సిద్ధార్థ లూథ్రా తదితరులు వాదనలు వినిపిస్తూ.. 2022లో కేసు నమోదు చేశారని, ఇప్పటివరకు చంద్రబాబుకు ఎలాంటి నోటీసు ఇవ్వడంగానీ, విచారణకు పిలవడంగానీ చేయలేదని చెప్పారు. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన తరువాతే ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో సీఐడీ పీటీ వారెంట్ దాఖలు చేసిందన్నారు.
పీటీ వారెంట్‌పై ఏసీబీ కోర్టు విచారించి చంద్రబాబు కస్టడీకి అనుమతినిస్తే తాము దాఖలు చేసిన ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ నిరర్థకం అవుతుందని చెప్పారు. డీమ్డ్ కస్టడీగా పరిగణించలేమని హైకోర్టు చెప్పిన నేపథ్యంలోనే తాము ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశామని తెలిపారు. అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేయాలని కోరారు. విచారణను ఈ నెల 16కి వాయిదా వేయాలని, అప్పటివరకు రక్షణ కల్పించాలని కోరారు.
ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దు..
తరువాత సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ తదితరులు వాదనలు వినిపిస్తూ.. వాదనలు వినిపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఒకవేళ విచారణను 16కి వాయిదా వేస్తే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని కోర్టుకు తెలిపారు. ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో బెయిల్ కోసం చంద్రబాబు గతంలో దాఖలు చేసిన పిటిషన్‌లోనే తాము అన్ని వివరాలతో కౌంటర్ దాఖలు చేశామన్నారు. ప్రస్తుతం పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదని చెప్పారు. చంద్రబాబు కస్టడీ కోసం సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్ నెలరోజులుగా ఏసీబీ కోర్టులో పెండింగ్‌లో ఉందన్నారు.
ఫైబర్ గ్రిడ్ కేసులో హైకోర్టు ఇప్పటికే చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిందని తెలిపారు. పీటీ వారెంట్‌పై విచారణ కొనసాగించుకోవచ్చునని హైకోర్టు ఇప్పటికే ఉత్తర్వులిచ్చిందని చెప్పారు. ఫైబర్ గ్రిడ్ కేసుకు, ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసుకు సారూప్యత ఉందని వివరించారు. చంద్రబాబు కోరుకున్న విధంగా ఈ కేసులో ఏ రక్షణ కల్పించినా, గత ఉత్తర్వులకు భిన్నంగా వ్యవహరించినట్లవుతుందని చెప్పారు.
ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్‌పై జరుగుతున్న విచారణను కొనసాగనివ్వాలని కోరారు. చంద్రబాబుకు అనుకూలంగా ఏ రకమైన ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టుకు విన్నవించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ నెల 16వ తేదీ వరకు పీటీ వారెంట్ విషయంలో ఏరకంగాను ముందుకెళ్లొద్దని ఏసీబీ కోర్టును ఆదేశించారు. విచారణను అదే రోజుకు వాయిదా వేశారు.
అంగళ్లు కేసులో చంద్రబాబు పిటిషన్‌పై విచారణ నేటికి వాయిదా
అన్నమయ్య జిల్లా అంగళ్లు వద్ద టీడీపీ శ్రేణులు సాగించిన విధ్వంసం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఈ నెల 12వ తేదీ వరకు అరెస్ట్ చేయబోమని ముదివీడు పోలీసులు హైకోర్టుకు నివేదించారు. అలాగే ఈ కేసులో చంద్రబాబుపై అదేరోజు వరకు పీటీ వారెంట్ కూడా దాఖలు చేయబోమని పోలీసుల తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ దుష్యంత్‌రెడ్డి కోర్టుకు చెప్పారు. ఈ కేసులో అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించనున్నారని, అందువల్ల విచారణను గురువారానికి వాయిదా వేయాలని కోరారు.
వాయిదాకు చంద్రబాబు తరఫు న్యాయవాదులు సైతం అభ్యంతరం చెప్పలేదు. దీంతో న్యాయస్థానం విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. అంగళ్లు కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
స్కిల్ కుంభకోణంలో బెయిలివ్వాలని చంద్రబాబు పిటిషన్.. నేడు విచారణ
స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో తనకు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరిస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ చంద్రబాబునాయుడు హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం తేలేంతవరకు కనీసం మధ్యంతర బెయిల్ అయినా మంజూరు చేయాలని కోర్టును అభ్యర్ధించారు. తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తిని, సీఐడీ దర్యాప్తునకు అన్ని విధాలుగా సహకరిస్తానని పిటిషన్‌లో పేర్కొన్నారు.
బెయిల్ మంజూరు సందర్భంగా ఎలాంటి షరతులు విధించినా వాటికి కట్టుబడి ఉంటానని తెలిపారు. కస్టడీ తరువాత తాను దాఖలు చేస్తున్న తొలి బెయిల్ పిటిషన్ ఇదేనన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసు నమోదు చేశారని తెలిపారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారించనుంది.
Amaravati IRR Case Updates: ఇన్నర్ కేసులో చంద్రబాబుకు తాత్కాలిక ఊరట
Published Thu, Oct 12 2023 4:35 AM | Last Updated on Thu, Oct 12 2023 8:24 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment