పవన్‌కు ‘పంచాయతీ’.. లోకేశ్‌కి విద్య, ఐటీ | CM Chandrababu Naidu Allotted Departments To The Ministers, List Of Ministries Details | Sakshi
Sakshi News home page

పవన్‌కు ‘పంచాయతీ’.. లోకేశ్‌కి విద్య, ఐటీ

Published Sat, Jun 15 2024 4:59 AM | Last Updated on Sat, Jun 15 2024 11:29 AM

CM Chandrababu allotted departments to ministers

మంత్రులకు శాఖలు కేటాయించిన సీఎం చంద్రబాబు 

జగన్‌ బాటలో.. ఎస్సీ మహిళ అనితకు హోంశాఖ

పయ్యావుల, అనగాని, కొల్లు, నిమ్మల, గొట్టిపాటికి కీలక శాఖలు

బీజేపీ నుంచి గెలిచిన సత్యకుమార్‌కు వైద్య, ఆరోగ్యం 

నారాయణకు మళ్లీ మున్సిపల్‌ శాఖే

చంద్రబాబు వద్దే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శాఖ

సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు ఈ నెల 12వ తేదీన మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి శాఖలు కేటాయించిన నేపథ్యంలో ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ శుక్రవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. జనసేన అధ్యక్షుడు కొణిదెల పవన్‌ కళ్యాణ్‌కు ఉప ముఖ్యమంత్రి హోదాతో పంచాయతీరాజ్‌ – గ్రామీ­ణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖలను కేటాయించారు.

నారా లోకేశ్‌కు విద్యా శాఖ (మానవ వనరుల అభివృద్ధి)తోపాటు ఐటీ శాఖ కేటాయించారు. గతంలోనూ ఆయన ఐటీ శాఖ నిర్వహించారు. కె.అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పి.నారాయణ, వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్‌కు కీలక శాఖలు లభించాయి.   

రాజధాని వ్యవహారాలు మళ్లీ నారాయణే! 
పాయకరావుపేట నుంచి గెలిచిన టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనితకు ప్రాధాన్యమైన హోంశాఖ దక్కింది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన ప్రభుత్వంలో తొలిసారిగా దళిత మహిళకు హోంమంత్రి పదవి కట్టబెట్టిన విషయం తెలిసిందే. తొలిసారి మేకతోటి సుచరిత, రెండోసారి తానేటి వనితకు హోంశాఖ ఇచ్చి సామాజిక న్యాయం, మహిళా సాధికారతను చాటుకున్నారు. 

ఇప్పుడు అదే బాటలో సీఎం చంద్రబాబు దళిత మహిళకు హోంశాఖ ఇచ్చారు. ఇక పీఏసీ ఛైర్మన్‌గా పని చేసిన పయ్యావుల కేశవ్‌కు ఆర్థిక శాఖ లభించింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చురుగ్గా వ్యవహరించిన నిమ్మల రామానాయుడుకు జలవనరుల శాఖను అప్పగించారు. రేపల్లె నుంచి మూడోసారి గెలిచిన అనగాని సత్యప్రసాద్‌కు రెవెన్యూ శాఖ బాధ్యతలు కేటాయించారు. 

పొంగూరు నారాయణకు మళ్లీ మున్సిపల్‌ శాఖ దక్కింది. 2014–19 మధ్య మున్సిపల్‌ శాఖ మంత్రిగా రాజధాని వ్యవహారాలన్నింటినీ ఆయన చక్కబెట్టారు. ఇప్పుడు మరోసారి అదే శాఖ ఇవ్వడంతో రాజధాని కార్యకలాపాలు నారాయణే నిర్వహిస్తారని స్పష్టమవుతోంది. బీజేపీ తరఫున గెలిచి మంత్రివర్గంలో చేరిన సత్యకుమార్‌కు వైద్య, ఆరోగ్య శాఖ అప్పగించారు. జనసేనకు చెందిన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్‌కి పౌరసరఫరాల శాఖ కేటాయించారు. 

శాఖల్లో స్వల్ప మార్పులు  
కొత్త ప్రభుత్వం కొలువుదీరాక శాఖల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పింఛన్ల పంపిణీ, డ్వాక్రా వ్యవహారాలకు సంబంధించి ‘సెర్ప్‌’ను పంచాయతీరాజ్‌ శాఖ నుంచి విడదీసి చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రి పరిధిలోకి తెచ్చారు. దివ్యాంగులు, సీనియర్‌ సిటిజన్ల సంక్షేమ విభాగాలు సాధారణంగా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ పరిధిలో ఉంటాయి. తాజాగా వాటిని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రికి అప్పగించారు. 

పరిశ్రమల శాఖను రెండుగా విభజించి భారీ పరిశ్రమలు–వాణిజ్యం ఒకరికి కేటాయించగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలను మరొకరికి అప్పగించారు. ఇక విద్యా శాఖ పేరును మానవ వనరుల అభివృద్ధి శాఖగా మార్చారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శాఖను ఎవరికీ కేటాయించకపోవడం గమనార్హం. ఈ శాఖలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాల వ్యవహారాల్లోనే విపక్షంలో ఉండగా చంద్రబాబు జైలుకు వెళ్లిన విషయం విదితమే.  

సాంఘిక సంక్షేమం పరిధిలో సచివాలయాలు 
వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రికి అప్పగించడం చర్చనీయాంశమైంది. ఐదేళ్ల క్రితం కొత్తగా గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఏర్పాటైంది. ప్రతి 2 వేల జనాభాకు ఒక సచివాలయం, 50 నుంచి 70 కుటుంబాలకు ఒక వలంటీర్‌ చొప్పున నియమించి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ప్రజలకు ఇంటి వద్దే పౌర సేవలు, పథకాలు అందించడం తెలిసిందే. 

1.21 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 2.65 లక్షల మందిని వలంటీర్లుగా నియమించింది. ఈ వ్యవస్థను ఇప్పుడు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రికి అప్పగించడంతో దానికి అనుబంధంగా నిర్వహిస్తారని చెబుతున్నారు. సచివాలయ వ్యవస్థలోనూ భారీ మార్పులు ఉండవచ్చనే ప్రచారం జరుగుతోంది.  

శాఖల కేటాయింపు ఇలా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement