ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం | CM Jagan Comments At YSR Asara Scheme Funds Release event | Sakshi
Sakshi News home page

ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం

Published Sun, Mar 26 2023 3:37 AM | Last Updated on Sun, Mar 26 2023 3:03 PM

CM Jagan Comments At YSR Asara Scheme Funds Release event - Sakshi

మన ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో పొదుపు సంఘాల పని తీరు ఎలా మారిందో అందరికీ కనిపిస్తోంది. గత ప్రభుత్వ పాలనలో దెబ్బతిన్న పొదుపు సంఘాల ఉద్యమం మళ్లీ ఊపిరి పోసుకుంది. తద్వారా ఈ రోజు 91 శాతానికి పైగా సంఘాలు ఏ, బీ గ్రేడ్‌లలో కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో 18 శాతం సంఘాలు ఎన్‌పీఏలు.. ఓవర్‌ డ్యూస్‌గా ఉంటే, ఈ రోజు అది కేవలం 0.45 శాతం మాత్రమే. అక్కచెల్లెమ్మల పట్ల మన ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం. 
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఇది మహిళా పక్షపాత ప్రభుత్వమని.. అక్క చెల్లెమ్మలకు విద్య, ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారత కల్పించాలని తపిస్తున్న ప్రభుత్వమని, ఇక్కడికి విచ్చేసిన తన అక్కచెల్లెమ్మలే ఇందుకు నిదర్శనమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మహిళలు అన్ని విధాలుగా ఎదగాలని, బాగు పడాలని.. 21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచి, ప్రతి ఇంటి నుంచి రావాలన్న తపన, తాపత్రయంతో గత 45 నెలల పాలన సాగిందని చెప్పారు.

ఇప్పటిదాకా వివిధ పథకాల ద్వారా అక్కచెల్లెమ్మలకు రూ.2.25 లక్షల కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. ఏలూరు జిల్లా దెందులూరులో శనివారం ఆయన వైఎస్సార్‌ ఆసరా పథకం కింద మూడో విడత నగదు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పది రోజుల పాటు ప్రతి మండలంలో జరగబోయే ఆసరా సంబరాల్లో రాష్ట్రంలో 78,94,169 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నేరుగా రూ.6,419 కోట్లు జమ చేయనున్నారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కేవలం 45 నెలల్లోనే మహిళా సాధికారత విషయంలో మనందరి ప్రభుత్వం తీసుకు వచ్చిన మార్పులు, ఫలితాలు ఎంత గొప్పగా ఉన్నాయన్నది స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ‘నా పాదయాత్ర సందర్భంగా ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ మీ తమ్ముడిగా, అన్నగా మాటిచ్చాను. ఆ రోజు నేను విన్నాను, నేను మీ బాధలు చూశాను, నేను ఉన్నాను అని చెప్పిన మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తోడుగా ఉంటూ వచ్చాను.

అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు 2019 మార్చి 31 వరకు ఉన్న రూ.25,500 కోట్లకు పైగా రుణాల విషయంలో తోడుగా ఉంటామని చెప్పాం. తద్వారా 78,94,169 మంది అక్కచెల్లెమ్మలకు ఇప్పటికే రెండు వాయిదాల్లో రూ.12,758 కోట్లు ఇచ్చాం. ఈ రోజు నుంచి ప్రారంభమై.. పది రోజుల పాటు జరిగే ఆసరా పండగ కార్యక్రమంలో మరో రూ.6,419 కోట్లు నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా జమ అవుతాయి. మొత్తంగా రూ.19,178 కోట్లు లబ్ధి చేకూర్చాం’ అని చెప్పారు. సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..  
ఏలూరు జిల్లా దెందులూరులో జరిగిన సభకు హాజరైన అశేష జనసందోహంలో ఓ భాగం 

వ్యాపార పరంగా అండగా నిలిచాం  
► పొదుపు సంఘాలకు ఇస్తున్న ఆసరా డబ్బు ఎలా ఖర్చు చేసుకోవాలన్నది అక్కచెల్లెమ్మల అభిమతానికి వదిలి పెట్టాం. వీటిని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం లేదా స్వయం ఉపాధి పొందాలనుకునే వారికి ప్రభుత్వం అన్ని రకాలుగా తోడుగా ఉంది.  

► తోడ్పాటు అందించడానికి వ్యాపార దిగ్గజ సంస్థలైన ఎల్‌ అండ్‌ టీ, పీ అండ్‌ జీ, రిలయన్స్, ఐటీసీ, అమూల్, అల్లానా, మహేంద్రా గ్రూప్, తానాగేర్, కాల్‌ గుడి, హిందూస్తాన్‌ యూనీ లీవర్‌ వంటి కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుని బ్యాంకులకు కూడా అనుసంధానం చేసి ప్రతి అక్కచెల్లెమ్మలకు వ్యాపార మార్గాలు చూపించేలా అడుగులు వేస్తోంది. 

► ఈ 45 నెలల కాలంలోనే మనందరి ప్రభుత్వం చూపిన శ్రద్ధ వల్ల అక్కచెల్లెమ్మలకు ఈరోజు నిత్యావసర సరుకుల షాపులు, వస్త్ర వ్యాపారం, ఆవులు, గేదెల ద్వారా పాడి, గొర్రెలు, మేకల పెంపకం, పౌల్ట్రీ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, చేపల పెంపకం, కూరగాయలు, పండ్ల తోటలు, హస్తకళలతో పాటు తమకు నైపుణ్యం ఉన్న ఇతర మార్గాల్లో పెద్ద ఎత్తున వీరందరికీ స్వయం ఉపాధి మార్గాలు చూపించింది. 

► ఆసరా, చేయూత, సున్నా వడ్డీ వంటి అనేక కార్యక్రమాలను క్రోడీకరించాం. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 9,86,616 మంది అక్కచెల్లెమ్మలకు బ్యాంకుల ద్వారా రూ.4,355 కోట్లను అనుసంధానం చేశాం. వారంతా ఇవాళ వివిధ రకాల వ్యాపారాలలో నిమగ్నమై వాళ్ల కుటుంబాలకు అండగా నిలబడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో 2014–2019 మధ్య పొదుపు సంఘాలకు సంబంధించి రూ.14 వేల కోట్ల బ్యాంకు రుణాలు ఇస్తే, ఇవాళ అక్కచెల్లెమ్మలకు సగటున రూ.30 వేల కోట్ల రుణాలు మన ప్రభుత్వం ద్వారా అందుతున్నాయి.   
వైఎస్సార్‌ ఆసరా మూడో విడత సాయం కింద లబ్ధిదారులకు చెక్కు అందజేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌  

మన పొదుపు సంఘాల వైపు ఇతర రాష్ట్రాల చూపు 
► వివిధ బ్యాంకుల ద్వారా ఈ సంఘాలకు ఏటా రూ.30 వేల కోట్లకు పైగా రుణాలు అందుతుండగా.. వాటిని చెల్లించే విషయంలో 99.55 శాతం రికవరీ ఉంది. అంటే ప్రతి అక్కచెల్లెమ్మ తీసుకున్న రుణాల్లో 99.55 శాతం తిరిగి చెల్లిస్తూ.. దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచారు. తద్వారా మన రాష్ట్రంలో ఏం జరుగుతోందని మిగిలిన రాష్ట్రాల వారు వచ్చి పొదుపు సంఘాల విప్లవాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నారు.  

► ప్రభుత్వం బ్యాంకర్లతో మాట్లాడి పొదుపు సంఘాలకిచ్చే రుణాల వడ్డీ శాతాన్ని తగ్గించింది. ఇంతకు ముందు రూ.3 లక్షల రుణానికి 13 శాతం ఉండే వడ్డీని 7 శాతానికే తగ్గించాం. రూ.5 లక్షల రుణంపై వడ్డీ 13 శాతం ఉంటే 9.5 శాతానికి తగ్గించాం. ఈ వడ్డీ శాతం ఇంకా తగ్గించేలా బ్యాంకర్లపై ఒత్తిడి తీసుకువస్తాం.  

► అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలని ఇంత బాధ్యతగా చేస్తున్నాం. వారు ఏం వ్యాపారం చేస్తున్నారు? ఆదాయం ఎంత వస్తుంది? ఏ మేరకు వడ్డీ రీజనబుల్‌? ఎంత శాతం కన్నా వడ్డీ ఎక్కువ ఉండకూడదు.. తదితర విషయాలు చెప్పి, మీ తరఫున బ్యాంకులతో మాట్లాడుతూ బాధ్యతగా అడుగులు వేస్తున్న ప్రభుత్వమిది.   
పొదుపు సంఘాల మహిళలు, ప్రజాప్రతినిధులతో సీఎం వైఎస్‌ జగన్‌  

నాడు రుణ మాఫీ కాదు.. పథకాలే రద్దు           
► చంద్రబాబు హయాంలో అక్కచెల్లెమ్మలందరికీ రుణాలు మాఫీ చేస్తాం.. ఎన్నికల వేళ ఎవరూ వాటిని కట్టొద్దని చెప్పారు. ఎన్నికలయ్యాక అక్కచెల్లెమ్మలతో పని అయిపోవడంతో ఆ హామీని గాలికి వదిలేశారు. వారి రుణాల మాఫీ కథ దేవుడెరుగు.. 2016 అక్టోబర్‌ నుంచి వారి తరఫున కట్టాల్సిన సున్నా వడ్డీ పథకాన్ని సైతం రద్దు చేసిన దుస్థితి చూశాం.  

► అలాంటి దారుణమైన పరిస్థితుల్లో అక్కచెల్లెమ్మలకు తోడుగా, అండగా ఉంటూ బ్యాంకులకు వాళ్లు కట్టాల్సిన వడ్డీని చెల్లిస్తున్నాం. 2016 అక్టోబర్‌లో నిలిచిపోయిన సున్నా వడ్డీ పథకాన్ని తిరిగి తీసుకువచ్చి రూ.3,615 కోట్లు సున్నా వడ్డీ కింద కింద చెల్లించాం. తద్వారా మహిళా పక్షపాత ప్రభుత్వం అని చెప్పడానికి గర్వ పడుతున్నాం.  

30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు  
► జగనన్న అమ్మఒడి ద్వారా 44.48 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు, 82 లక్షల మంది పిల్లలకు మంచి చేస్తూ.. రూ.19,674 కోట్లు సాయం చేశాం. వైఎస్సార్‌ చేయూత ద్వారా 26.39 లక్షల మందికి రూ.14,219 కోట్లు లబ్ధి చేకూర్చాం. వైఎస్సార్‌ కాపునేస్తం ద్వారా 3.56 లక్షల మందికి రూ.1,518కోట్లు, ఈబీసీనేస్తం ద్వారా మరో 3.94 లక్షల మందికి రూ.596 కోట్లు అందించాం. 

► వైఎస్సార్‌ ఆసరా, సున్నా వడ్డీ ద్వారా ఇంకో రూ.22,793 కోట్లు అక్కచెల్లెమ్మల చేతిలో పెట్టాం. విద్యా దీవెన ద్వారా 26.99 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు వారి పిల్లల చదువుల కోసం రూ.9,947 కోట్లు ఇచ్చాం. వసతి దీవెన ద్వారా మరో 22.58 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు వారి పిల్లల వసతి, భోజన సౌకర్యం కోసం రూ.3,363 కోట్లు ఇచ్చాం.  

► 30 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలని వారి పేరుతో ఇళ్ల పట్టాలిచ్చాం. వీరిలో 22 లక్షల మంది ఇప్పటికే ఇళ్లు కట్టడం ప్రారంభించారు. ఆ ఇళ్లు పూర్తయితే ఒక్కో ఇంటి విలువ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు వేసుకున్నా.. ప్రతి అక్కచెల్లెమ్మ చేతిలో అంత డబ్బు పెట్టినట్టు అవుతుంది. ఇవన్నీ పూర్తయితే ఈ ఒక్క పథకం ద్వారానే రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల వరకు వారి చేతిలో పెట్టినట్లవుతుంది.  
ఈ కార్యక్రమంలో మంత్రులు రోజా, తానేటి వనిత, ఉషాశ్రీచరణ్,  కొట్టు సత్యనారాయణ, విశ్వరూప్, కారుమూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు.

నామినేటెడ్‌ పదవులు, పనుల్లోనూ 50%
► నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం పోస్టులు అక్కచెల్లెమ్మలకే రావాలని ఏకంగా అసెంబ్లీలోనే చట్టం చేశాం. నామినేషన్‌ ద్వారా ఇచ్చే కాంట్రాక్టు పనుల్లో కూడా 50 శాతం ఇవ్వాలని చట్టం చేశాం. ఏ రాజకీయ పదవి చూసినా.. ఎంపీపీ నుంచి జెడ్పీ చైర్‌పర్సన్‌ వరకు, మున్సిపల్‌ చైర్మన్‌ నుంచి కార్పొరేషన్‌ మేయర్‌ వరకు గుడి చైర్మన్‌ నుంచి ఏఎంసీ చైర్మన్‌ పదవుల వరకు ఏ పదవిలో చూసినా 50 శాతం అక్కచెల్లెమ్మలు కనిపిస్తున్నారు. 

► అక్కచెల్లెమ్మలు ఎక్కడకు వెళ్లినా ధైర్యంగా వెళ్లాలని, వారి రక్షణ కోసం దేశంలో ఎక్కడా కనీవినీ ఎరుగని విధంగా దిశ యాప్‌ను తీసుకొచ్చాం. దీని ద్వారా 1.17 కోట్ల మంది ఈ యాప్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు.  ఎవరికి ఆపద వచ్చినా ఎక్కడికి వెళ్లినా యాప్‌లోని ఎస్‌ఓఎస్‌ బటన్‌ నొక్కినా, లేక సెల్‌ఫోను ఐదు సార్లు ఊపినా వెంటనే పోలీసు సోదరుడు పది నిమిషాల్లో అక్కడికి చేరుకుని అండగా నిలిచే గొప్ప వ్యవస్థను తీసుకొచ్చాం. ఈ రోజు దిశ యాప్‌ ద్వారా 26 వేల మంది అక్కచెల్లెమ్మలకు మంచి జరిగింది.  

ఈ ప్రభుత్వం.. మీ ప్రభుత్వం..
ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం.. వివక్ష మీద పోరాటం చేస్తున్న ప్రభుత్వం. కోట్ల మంది అక్కచెల్లెమ్మలు తమ అన్నకు రక్షా బంధనం కట్టిన ప్రభుత్వం. ప్రతి రూపాయి కూడా మన అక్కచెల్లెమ్మల చేతిలో పెడుతుంది. వారికి ఇస్తే కుటుంబాలు బాగు పడతాయని నమ్మిన ప్రభుత్వం ఇది. దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా మహిళా సంక్షేమం మీద ఇన్ని రంగాలలో వారిని అభివృద్ధి పథం మీద నడిపించాలని తపన పడుతోంది. వారి రక్షణ మీద కూడా మనలా దృష్టి పెట్టిన ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు.    

బాబు మోసం చేస్తే.. జగన్‌ ఆదుకున్నారు 
సీఎం వైఎస్‌ జగన్‌ సహకారంతో దెందులూరులో రూ.1900 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. రూ.85 కోట్లతో లిఫ్ట్‌ ఇరిగేషన్, రూ.70 కోట్లతో మంచినీటి పథకం, నూజివీడు – దెందులూరు మధ్య తమ్మిలేరుపై బ్రిడ్జి శంకుస్థాపన, సీహెచ్‌సీ ప్రారంభోత్సవం సీఎం చేతుల మీదుగా జరగడం ఆనందంగా ఉంది. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని నాడు చంద్రబాబునాయుడు ఇదే దెందులూరులో హామీ ఇచ్చి మోసం చేశారు. సీఎం జగన్‌ చెప్పిన మాట మేరకు డ్వాక్రా రుణాల చెల్లింపు దిశగా దెందులూరు వేదికగా మరో అడుగు మందుకు వేయడం ఆనందంగా ఉంది 
    – కొఠారు అబ్బయ్యచౌదరి, దెందులూరు ఎమ్మెల్యే  

కలకాలం సీఎం చల్లగా ఉండాలి 
వైఎస్సార్‌ ఆసరా కార్యక్రమం మహిళల జీవితాల్లో వెలుగులు నింపింది. ఈ పథకం ద్వారా మా గ్రూప్‌ సభ్యులకు రూ.2.95 లక్షలు వచ్చాయి. నా వాటాగా రూ.27,400 దక్కాయి. గత రెండు విడతల ఆసరా కార్యక్రమం ద్వారా అందిన మొత్తాలతో కుట్టు మిషన్, జిగ్‌ జాగ్‌ మిషన్‌ కొనుగోలు చేసి, టైలరింగ్‌ ద్వారా రోజుకు రూ.500 నుంచి రూ.700 వరకు సంపాదిస్తున్నా. పిల్లలను చదివించుకుంటున్నా. చిన్న కొడుకు 8వ తరగతి చదువుతున్నాడు. జగనన్న ఇచ్చిన ట్యాబ్‌తో బాగా చదివి క్లాస్‌లో ఫస్ట్‌ ర్యాంక్‌లో నిలిచాడు. కలకాలం మీరు (సీఎం) చల్లగా ఉండాలి.   
  – ఎండీ.రుబీనా బేగం, 48వ డివిజన్, ఏలూరు  

మహిళల జీవితాల్లో వెలుగులు 
వైఎస్సార్‌ ఆసరా ద్వారా మా గ్రూపునకు రూ.5 లక్షలు అందింది. ఇందులో నా వాటాకు తోడుగా ఉన్నతి, స్త్రీనిధి ద్వారా రుణాలు తీసుకుని ట్రాక్టర్‌ కొనుగోలు చేశాను. నా భర్తకు రోడ్డు ప్రమాదం కారణంగా కాలు విరిగి పోవడం వల్ల ప్రస్తుతం కుటుంబాన్ని నేనే నడిపిస్తున్నాను. ఆరోగ్యశ్రీ ద్వారా నా భర్తకు ఉచితంగా వైద్యం అందింది. వైఎస్సార్‌ ఆసరా నా లాంటి మహిళలు లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది. మహిళల సంక్షేమం కోసం ఇంతలా తపించే సీఎం వైఎస్‌ జగన్‌కు దేవుడి ఆశీస్సులు, ప్రజల ఆదరాభిమానాలు ఎప్పటికీ ఉంటాయి. 
    – కలపాల గంగారత్నకుమారి, దొరమామిడి, బుట్టాయగూడెం మండలం     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement