
వైఎస్సార్ సున్నా వడ్డీ చెల్లింపుల చెక్కుతో సీఎం జగన్. చిత్రంలో మంత్రి కన్నబాబు తదితరులు
తప్పనిసరిగా నమోదు చేసుకోండి
ఇప్పుడు 6.28 లక్షల మంది రైతుల్లో దాదాపు 2.50 లక్షల మంది వివరాలు ఈ–క్రాప్‌లో లేకపోయినా వారి పట్ల ఉదారంగా ఉండేందుకు అందరికీ సున్నా వడ్డీ ఇస్తున్నాం. ఏ ఒక్క రైతుకూ సున్నా వడ్డీ అంద కుండా ఉండొద్దు. ప్రతి అడుగులోనూ ఒక మంచి జరుగుతున్నప్పుడు రైతన్నలు సహకరించాలి. ప్రభుత్వం ఏ సహాయం చేయాలన్నా ఈ–క్రాపింగ్ చాలా అవసరం. దీన్ని ఏ ఒక్క రైతు కూడా మర్చిపోవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ఏడాది జూన్ నుంచి మళ్లీ ఈ–క్రాపింగ్ నమోదు ప్రారంభం అవుతుంది. కాబట్టి ప్రతి రైతు ఈ ఏడాది ఖరీఫ్‌కు సంబంధించి ఈ–క్రాపింగ్‌లో నమోదు చేయించుకోండి. దీనివల్ల మీకు మంచి జరుగుతుంది.
– ముఖ్యమంత్రి జగన్
రైతుబిడ్డగా చెబుతున్నా...
నా సుదీర్ఘ 3,648 కి.మీ పాదయాత్రలో రైతుల కష్టాలు, కడగండ్లను స్వయంగా చూశా. వారికి ఎలా మేలు చేయాలన్నది ఆనాడే ఆలోచించా. రైతుల కష్ట నష్టాలకు ప్రధానంగా నాలుగు కారణాలున్నాయి. ఒకటి... పెట్టుబడి ఖర్చు బాగా పెరగడం. రెండో కారణం.. రైతు కష్టపడి పండించిన పంట అమ్ముకునే సమయంలో దళారుల ప్రమేయం. మూడో కారణం... పంటలకు తగిన గిట్టుబాటు ధర రాకపోవడం. నాలుగో కారణం... ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టం. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ఈ 22 నెలల కాలంలో దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు అండగా నిలబడ్డామని ఒక రైతు బిడ్డగా, మీ అందరి బిడ్డగా, ఒక అన్నగా సగర్వంగా చెబుతున్నా.
– సీఎం వైఎస్ జగన్
ఒకరోజు ముందే రైతులకు పండుగ
రెండు ఎకరాల్లో పత్తి, రెండున్నర ఎకరాల్లో కంది సాగు చేస్తున్నాను. బ్యాంకు నుంచి రూ.90 వేలు రుణం తీసుకున్నా. సకాలంలో చెల్లించినందుకు నాకు సున్నా వడ్డీ కింద రూ.3,600 జమ అవుతున్నట్లు ఆర్బీకేలోని జాబితాలో ఉంది. శ్రీరామనవమి ఈరోజే వచ్చినంత సంతోషంగా ఉంది. 2సార్లు రైతు భరోసా కూడా అందింది. పంటల బీమాకు మీరు ఒక్క రూపాయి కడితే చాలన్నారు. మొదటి ఏడాది పత్తి, కందికి కట్టా. పంటనష్ట పరిహారం కూడా అందింది.
– సీహెచ్ శ్రీనివాస్, దువ్వల, ప్రకాశం జిల్లా
సాక్షి, అమరావతి: ఇది రైతు పక్షపాత ప్రభుత్వమని, మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రెండేళ్లలో ఇప్పటివరకు రూ.65 వేల కోట్లకు పైగా అన్నదాతల సంక్షేమం కోసం ఖర్చు చేశామని మీ అందరి బిడ్డగా, ఒక రైతు బిడ్డగా సగర్వంగా చెబుతున్నానని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. విత్తనం సరఫరా మొదలు పంటలు అమ్ముకునే వరకు రైతులకు అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. రైతులు ఏ పరిస్థితుల్లో నష్టపోతారో గ్రహించడమే కాకుండా వాటిని నివారించేలా సాగుదారుల కోసం పలు చర్యలను తీసుకున్నట్లు చెప్పారు. ప్రభుత్వం నుంచి సాయం పొందేందుకు వీలుగా ప్రతి రైతు తమ పంటల వివరాలను ఈ–క్రాప్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద 2019 – 20 రబీ సున్నా వడ్డీ రాయితీని సీఎం జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి విడుదల చేశారు. అర్హులైన 6,27,906 మంది రైతుల ఖాతాల్లో రూ.128.47 కోట్లను జమ చేశారు. లక్ష రూపాయల వరకు పంట రుణం తీసుకుని ఏడాదిలోగా తిరిగి చెల్లించిన రైతులకు ప్రభుత్వం వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని వర్తింపచేస్తోంది. ఈ సందర్భంగా వివిధ జిల్లాల్లోని రైతులు, అధికారులనుద్దేశించి సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఆ వివరాలివీ..
రైతు బాగుంటేనే..
ఏప్రిల్‌లో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. రైతు బాగుంటేనే రైతు కూలీ బాగుంటాడు. వారిద్దరూ బాగుంటేనే రాష్ట్రంలో వ్యవసాయంపై ఆధారపడ్డ దాదాపు 62 శాతం జనాభా బాగా బతికే అవకాశం కల్పించినట్లు అవుతుంది. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ (ఎఫ్‌అండ్‌ఏ) సర్వే ప్రకారం భూమి మీద ఉన్న దాదాపు 780 కోట్ల మంది ప్రజల్లో 60 శాతం మంది వ్యవసాయం, అనుబంధ విభాగాలపై ఆధారపడి ఉన్నట్లు తేలింది. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని అందుకే చెబుతున్నాం.
ప్రతి అడుగులో రైతన్నల సంక్షేమం..
రైతు పక్షపాత ప్రభుత్వంగా ఈ 22 నెలల్లో ప్రతి అడుగులో రైతుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేశాం. రాష్ట్రంలో 18.70 లక్షల పంపుసెట్లు ఉండగా వ్యవసాయానికి పగటి పూటే 9 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం ద్వారా రైతులకు పెట్టుబడి వ్యయం తగ్గాలని ఏటా దాదాపు రూ.8,800 కోట్ల చొప్పున రెండేళ్లలో దాదాపు రూ.17,600 కోట్లు ఖర్చు చేశాం. ఫీడర్ల నాణ్యత కోసం అదనంగా మరో రూ.1,700 కోట్లు ఖర్చు చేశామని ఒక రైతు బిడ్డగా, మీ బిడ్డగా సగర్వంగా చెబుతున్నా.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులు, అధికారులతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్
ఇంకో నాలుగు అడుగులు..
నాన్న వైఎస్సార్ రైతుల కోసం కొన్ని అడుగులు వేస్తే ఇప్పుడు ఆయన కంటే మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తున్నా. వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ ద్వారా రైతులకు పెట్టుబడి సాయం చేస్తున్నాం. రాష్ట్రంలో అర హెక్టారు (1.25 ఎకరాలు) ఉన్న రైతులు 60 శాతం, ఒక హెక్టారు (2.5 ఎకరాలు) ఉన్న రైతులు దాదాపు 70 శాతం మంది ఉన్నారు. రైతులకు ఏటా మనం ఇస్తున్న రూ.13,500 పెట్టుబడి సాయం వారికి దాదాపు 80 శాతం వరకు ఉపయోగపడుతోంది. రైతులకు ఏటా మూడు విడతల్లో ఆ సాయం అందిస్తున్నాం. ఇప్పటికే రెండేళ్లు ఇచ్చాం. మూడో ఏడాది కూడా ఇవ్వబోతున్నాం. వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ పథకం ద్వారా ఈ రెండేళ్లలో 51.59 లక్షల మంది రైతులకు ఏటా రూ.13,500 చొప్పున మొత్తం రూ.13,101 కోట్లు ఖర్చు చేశామని రైతు బిడ్డగా, మీ బిడ్డగా సంతోషంగా తెలియజేస్తున్నా.
ఆర్బీకేలు..
విత్తనం మొదలు పంట అమ్ముకునే వరకు రైతు ఎక్కడా ఇబ్బంది పడకుండా రాష్ట్రవ్యాప్తంగా 10,601 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. అవి ప్రతి విషయంలో రైతులకు అండగా నిలుస్తున్నాయి. రైతుల చేయి పట్టుకుని నడిపిసున్నాయి. ఆ విధంగా గ్రామ స్థాయిలోనే సేవలు అందిస్తున్నాం.
ఉచిత బీమా..
కేవలం ఒక్క రూపాయి కడితే చాలు రైతులకు బీమా సదుపాయం కల్పిస్తున్నాం. అన్ని ఆర్బీకేలలో ఈ–క్రాప్ డేటాలో నమోదు చేసుకునే సదుపాయం ఉంది. వైఎస్సార్ ఉచిత పంటల బీమా కింద 15.67 లక్షల మంది రైతులకు 22 నెలల వ్యవధిలో రూ.1,968 కోట్లకు పైగా బీమా పరిహారం చెల్లించాం. ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే అదే సీజన్‌లో ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తున్నాం. ఆ మేరకు దాదాపు రూ.1,056 కోట్లు ఇవ్వగలిగామని మీ బిడ్డగా చెబుతున్నా.
సున్నా వడ్డీ..
సున్నా వడ్డీకి సున్నా చుట్టి గత సర్కారు వదిలేసిన బకాయిలు దాదాపు రూ.850 కోట్లు (బ్యాంకులు అప్‌లోడ్ చేసినవి) మన ప్రభుత్వం చెల్లించింది. ఇది కాకుండా వైఎస్‌ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల కింద 2019 – 20 ఖరీఫ్‌కు సంబంధించి రూ.289 కోట్లు ఇచ్చా. అదే ఏడాది రబీకి సంబంధించి ఇవాళ రూ.128.47 కోట్లు ఇస్తున్నాం.
ప్రత్యేక నిధితో సహాయం..
ఇవి కాకుండా రైతులకు అండగా నిలిచేందుకు ప్రకృతి వైపరీత్యాల సహాయనిధికి రూ.2 వేల కోట్లు, ధరల స్థిరీకరణ నిధికి రూ.3 వేల కోట్లు కేటాయించడమే కాకుండా కనీస మద్దతు ధర లేని పంటలకు కూడా గిట్టుబాటు ధరలు కల్పిస్తూ రూ.4,761 కోట్లు ఖర్చు చేసి పలు పంటలు కొనుగోలు చేశాం. ధాన్యం కొనుగోలు కోసం రూ.18,344 కోట్లు ఖర్చు చేశాం.
పాడి రైతులకు అండ..
పాడి ద్వారా రైతులు బాగు పడాలని చర్యలు తీసుకున్నాం. లీటరు పాలు, మినరల్ వాటర్ ధరల మధ్య తేడా లేదని రైతులు చెప్పారు. అందుకే పాడి రైతులు, అక్క చెల్లెమ్మలను ఆదుకునేందుకు ఏపీ–అమూల్ పాలవెల్లువ ద్వారా నాలుగు జిల్లాలలోని దాదాపు 600 గ్రామాలలో పాల సేకరణ చేపట్టాం. ఒక్కో లీటరుపై పాడి రైతులకు దాదాపు రూ.7 ఎక్కువ గిట్టుబాటు అవుతోంది. జగనన్న జీవక్రాంతి పథకంలో దాదాపు 1.20 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు చేయూతలో పాడి గేదెలు అందచేస్తున్నాం.
ఆ కుటుంబాలను ఆదుకున్నాం..
ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూ.1.50కే సరఫరా చేస్తున్నాం. ఇందుకోసం ఏటా దాదాపు రూ.780 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఒకవేళ ఎవరైనా రైతు చనిపోతే ఆ కుటుంబం ఎలా బతుకుతుందనే ఆలోచన చేయకుండా గత సర్కారు దాదాపు 434 కుటుంబాలను వదిలేస్తే మన ప్రభుత్వం వచ్చాక ఆయా కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేసింది. ఇంకా మన ప్రభుత్వం వచ్చాక ఆత్మహత్య చేసుకున్న 82 మంది రైతుల కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేశాం.
వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్, మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి వై.మధుసూధన్‌రెడ్డి, ఎస్సెల్బీసీ కన్వీనర్ వి.బ్రహ్మానందరెడ్డి, ప్రభుత్వ సలహాదారు (వ్యవసాయం) అంబటి కృష్ణారెడ్డితో పాటు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అన్ని జిల్లాల నుంచి అధికారులు, పెద్ద సంఖ్యలో రైతుల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.
ఏటా రూ.46 వేలు సంతోషంగా ఇస్తున్నాం..
రైతులకు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం ద్వారా వారికి చాలా లాభం కలుగుతుంది. ఉదాహరణకు ఒక రైతు 7.5 హెచ్‌పీ మోటారు వినియోగిçస్తుంటే గంటకు 5 యూనిట్ల విద్యుత్ కావాలి. అలా రోజుకు 9 గంటల విద్యుత్ సరఫరా ప్రకారం చూస్తే రోజుకు 45 యూనిట్ల విద్యుత్ వినియోగం ఉంటుంది. అంటే నెలకు ఆ రైతు వినియోగించే విద్యుత్ 1,350 యూనిట్లు. ఇవాళ మార్కెట్‌లో మనం సేకరిస్తున్న యూనిట్ విద్యుత్ సగటు ధర రూ.5.20 చొప్పున లెక్క వేస్తే నెలకు దాదాపు రూ.7,020 అవుతుంది. ఏటా సగటున 200 రోజులు రైతులు విద్యుత్ వినియోగిస్తారని లెక్కిస్తే ఆ మొత్తం వ్యయం దాదాపు రూ.46 వేలు అవుతుంది. ఆ మొత్తాన్ని కూడా రైతుల కోసం సంతోషంగా వ్యయం చేస్తున్నాం.
ప్రతి రైతుకు మంచి జరగాలి..
రైతులు అప్పులపాలు కాకుండా వారికి సున్నా వడ్డీ రుణాలు అందాలి. ప్రతి ఒక్క రైతు ఈ–క్రాప్‌లో నమోదు చేసుకోవాలి. ఏ పంట, ఏ రైతు, ఎన్ని ఎకరాల్లో వేశారన్న పూర్తి సమాచారం ఉంటుంది. పంట రుణాలు, సున్నా వడ్డీ, బీమా, చివరకు గిట్టుబాటు ధర కోసం కూడా ఈ–క్రాప్ డేటా అవసరం. కాబట్టి ప్రతి రైతు తప్పనిసరిగా ఈ–క్రాప్‌లో వివరాలు నమోదు చేయించుకోవాలి. ఆర్బీకేకు వెళ్లి దరఖాస్తు చేసుకుంటే వారే నమోదు చేస్తారు. వచ్చే నెలలో రైతు భరోసా, ఖరీఫ్ 2020కి సంబంధించి బీమా పరిహారం విడుదల ఉంటుంది. ఆ డబ్బు రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో ప్రతి రైతుకు మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నా.
మనసా వాచా కర్మణా..
మేనిఫెస్టోలో నవరత్నాల తొలి వాగ్దానాలన్నీ రైతులకు సంబంధించినవే. అందులో చెప్పిన ప్రతిదీ మనసా వాచా కర్మణా ఈ రెండేళ్లలో అమలు చేశానని ఒక రైతుబిడ్డగా సగర్వంగా చెబుతున్నా. ఇవాళ దాదాపు 6.28 లక్షల మంది రైతులకు రూ.128.47 కోట్లను గత ఏడాది (2020) రబీకి సంబంధించి సున్నా వడ్డీ రాయితీని జమ చేస్తున్నాం. గత ఏడాది పంట రుణాలు తీసుకుని సకాలంలో తిరిగి చెల్లించిన రైతులందరికీ ఈ పథకంతో మేలు కలుగుతోంది. 2019 జూన్ నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ సున్నా వడ్డీ కింద 61,22,588 మంది రైతులకు రూ.1,132.54 కోట్లు ఇచ్చాం. గత ప్రభుత్వం ఎగ్గొట్టి పోయిన బకాయిలతో కలిపి రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేశామని సగర్వంగా తెలియజేస్తున్నా. ఇప్పటివరకు ఇచ్చిన మొత్తంతో పాటు ఇవాళ ఇస్తున్న మొత్తం కూడా కలిపితే వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల కింద రైతులకు దాదాపుగా రూ.1,300 కోట్లు ఇచ్చినట్లు అవుతుంది.
రైతులకు ఇచ్చిన ప్రతి మాట అమలు
రైతులకు ఇచ్చిన ప్రతి మాటను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి అమలు చేస్తున్నారు. దీంతో హరిత విప్లవం సాకారమవుతోంది. గోదావరి జిల్లాలో రెండో పంటకు సీలేరు నుంచి నీరు విడుదల చేయడంతో ఎక్కడా పంటలు ఎండిపోవడం లేదు. ఏ సీజన్‌కు సంబంధించి అదే సీజన్‌లో అన్నీ అందిస్తున్నారు. దీంతో రైతులంతా సంతోషంగా ఉన్నారు. ఇవాళ దాదాపు 6.28 లక్షల మంది రైతులకు దాదాపు రూ.129 కోట్లు సున్నా వడ్డీ రాయితీ కింద ఇస్తున్నాం. 2014 – 15 నుంచి 2018 – 19 వరకు గత ప్రభుత్వం పెట్టిపోయిన బకాయిలు దాదాపు రూ.1,180 కోట్లు సైతం ఎన్ని కష్టాలు వచ్చినా సీఎం ఇచ్చారు. సామాజిక తనిఖీ, సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాల ప్రదర్శన వల్ల పూర్తి పారదర్శకత పాటిస్తున్నాం.
– కె.కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment