AP: మెరుగైన పెన్షన్‌..?.. ముఖ్యమంత్రి మదిలో ఆలోచన.. | CM Jagan Govt proposals prepared for better pension system for CPS employees | Sakshi
Sakshi News home page

AP: మెరుగైన పెన్షన్‌..?.. ముఖ్యమంత్రి మదిలో ఆలోచన..

Published Tue, Jun 6 2023 3:16 AM | Last Updated on Tue, Jun 6 2023 2:57 PM

CM Jagan Govt proposals prepared for better pension system for CPS employees - Sakshi

ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చిస్తున్న మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేశ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

సాక్షి, అమరావతి: పదవీ విరమణ పొందిన ఉద్యోగుల జీవితాలకు ఆర్థిక భద్రత, భరోసా కల్పిం­చాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా సీపీఎస్‌ ఉద్యోగులకు మెరుగైన పెన్షన్‌ విధానం ప్రతిపాదనలు సిద్ధమైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. సీపీఎస్‌ ఫండ్‌ గణాంకాల ప్రకారం చూస్తే ఉద్యోగి ఆఖరి నెల మూల వేతనంలో గరిష్టంగా 20 శాతం మాత్రమే పెన్షన్‌గా వస్తుందని శాస్త్రీయ లెక్కలు వెల్లడిస్తున్నాయి.

అది కూడా స్థిరంగా ఉండి పెన్షనర్‌ జీవితకాలంలో పెరగదు. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని 33 శాతం పెన్షన్‌ గ్యారంటీ కల్పిస్తామని గతంలో ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే ద్రవ్యోల్బణం పెరుగుదల వల్ల జీవన వ్యయం అధికమై పెన్షనర్లు ఇబ్బందులు పడతారని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం దృష్టికి తెచ్చాయి.

ఈ నేపథ్యంలో పదవీ విరమణ చేసిన తర్వాత ఉద్యోగులకు ఆర్థిక భద్రత, భరోసా కల్పించాలన్న ముఖ్యమంత్రి జగన్‌ సూచన మేరకు ఓపీఎస్‌ విధానంలో మాదిరిగానే మెరుగైన గ్యారంటీ పెన్షన్‌ విధానంలో ధరల పెరుగుదల నుంచి పెన్షనర్లకు ఉపశమనం కల్పించేందుకు ఏటా 3 శాతం పెంచేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది.

అయితే ఈ ప్రతిపాదనలపై చర్చ జరిగినప్పుడు ఏటా 3 శాతం పెంపు కేవలం కంటితుడుపులా ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడినట్లు సమాచారం. పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత, భరోసా కల్పించాలన్న ఆలోచనకు అనుగుణంగా లేదని పేర్కొంటూ ఉద్యోగులు ఆశిస్తున్నట్లుగా ఓపీఎస్‌కు దాదాపు సమానంగా పెన్షన్‌ విధానం ఉండాలని ముఖ్యమంత్రి జగన్‌ కీలక సూచన చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

ఏటా పెరుగుదల 3 శాతం కాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఆర్నెళ్లకు ఒకసారి పెంచే డీఏ పాయింట్ల ఆధారంగా రాష్ట్రంలో ఉద్యోగులకు కరువుభత్యం(డీఏ), పెన్షనర్లకు కరువుభృతి(డీఆర్‌) పెంచుతున్న మాదిరే ఈ పెన్షన్‌ విధానంలోనూ పెన్షనర్లకు డీఆర్‌ పెంచడం శాస్త్రీయంగా ఉంటుందని సీఎం సూచించినట్లు సమాచారం.

ఈ విధానాన్ని అమలు చేస్తే ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత చేకూరి ధరల పెరుగుదల నుంచి వారికి ఉపశమనం కలుగుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడినట్లు తెలిసింది. ఓపీఎస్‌కు దాదాపు సమానమైన పెన్షన్‌ అందుకొనే విధానం ఉండాలని, మనం తెస్తున్న పెన్షన్‌ విధానం సీపీఎస్‌ ఉద్యోగులను సంతృప్తిపరచాలని ముఖ్యమంత్రి గట్టిగా చెప్పినట్లు సమాచారం.

గ్యారంటీ పెన్షన్‌ను 33 శాతం నుంచి ఓపీఎస్‌ మాదిరిగా 50 శాతానికి పెంచాలని కూడా ముఖ్యమంత్రి భావించారు, అలా చేస్తేనే సీపీఎస్‌ ఉద్యోగుల ఆకాంక్ష నెరవేరుతుందని, ఓపీఎస్‌కు దాదాపు సమానమైన విధానం రూపకల్పన చేసినట్లవుతుందని సూచించారు. 

పీఆర్సీ మినహా అన్ని ప్రయోజనాలు  
ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశాల మేరకు అధికారులు ప్రతిపాదనలు మళ్లీ సవరించి పాత పెన్షన్‌ విధానం(ఓపీఎస్‌)లో మాదిరే ఉద్యోగులకు ఆఖరి నెల మూలవేతనంలో 50 శాతం పెన్షన్‌గా నిర్ధారించడంతో పాటు ఓపీఎస్‌ విధానంలో పెన్షనర్లకు పెంచినట్లే డీఆర్‌ కూడా పెంచేలా మెరుగైన పెన్షన్‌ విధానాన్ని రూపొందించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

మంత్రివర్గం ఆమోదం తెలిపితే ముఖ్యమంత్రి జగన్‌ ఆలోచనలకు అనుగుణంగా సీపీఎస్‌ ఉద్యోగులకు ఓపీఎస్‌తో దాదాపు సమానమైన మెరుగైన పెన్షన్‌ విధానం అమల్లోకి వస్తుంది. పీఆర్సీ  ప్రయోజనాలు మినహా ఓపీఎస్‌లోని మిగతా ప్రయోజనాలన్నీ ముఖ్యమంత్రి జగన్‌ సూచించిన తాజా పెన్షన్‌ విధానంలో ఉంటాయి.

ప్రజల సరాసరి జీవితకాలం పెరిగిన నేపథ్యంలో ఏటా కనీసం 5 శాతం డీఆర్‌ పెరుగుతుందనుకున్నా 20 ఏళ్లలో పెన్షన్‌ రెట్టింపవుతుంది. సీపీఎస్‌లో చెల్లిస్తున్న మాదిరే 10 శాతం ఉద్యోగులు చెల్లిస్తే చాలు. ఉద్యోగులు నష్టపోకుండా ఇది మెరుగైన విధానం అవుతుంది.

ఓపీఎస్‌ వల్ల ప్రతికూలతలు ఇవీ..
► సీపీఎస్‌ను రద్దుచేసి ఓపీఎస్‌ తీసుకురావడానికి ఆర్థిక పరిస్థితి సహకరించదు. 
► ఓపీఎస్‌ను మళ్లీ అమల్లోకి తెస్తే భవిష్యత్తు తరాలపై దాని ప్రభావం తీవ్రంగా పడుతుంది. ఇవ్వాల్సిన పెన్షన్లు మొత్తం ఉద్యోగుల జీతాలను కూడా దాటేసి మోయలేని స్థాయికి చేరుకుంటుంది.
► 2040 నాటికి బడ్జెట్‌ నుంచి పెన్షన్ల కోసం చేయాల్సిన వ్యయం రూ.60,706 కోట్లకు చేరుకుంటుంది. ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల కోసం ఏడాదిలో బడ్జెట్‌ నుంచి చేసే ఖర్చు రూ.1,85,172 కోట్లకు చేరుతుంది. అంటే రాష్ట్ర సొంత రాబడిలో ప్రతినెలా తప్పనిసరిగా చేయాల్సిన వ్యయం 181 శాతానికి చేరుకుంటుంది. మరో పదేళ్ల తర్వాత అంటే 2050 నాటికి ఇది 197 శాతానికి చేరుకుంటుంది. 
► ఏదో ఒక దశలో ఈ మోయలేని భారాన్ని తట్టుకోలేక 2003 మాదిరిగానే మళ్లీ ఓపీఎస్‌ను రద్దు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు మళ్లీ చాలీచాలని పెన్షన్‌ విధానాన్ని తీసుకురావాల్సి వస్తుంది. అలా జరిగితే ఈ రోజుల్లో ఉన్న వడ్డీరేట్లుకూడా అప్పుడు ఉండవు. దీనివల్ల తగ్గిన వడ్డీరేట్లకు అనుగుణంగా సీపీఎస్‌ పెన్షన్‌ ఫండ్‌ నుంచి వచ్చే పెన్షన్లు కూడా తగ్గుతాయి. ఇది ఉద్యోగులకు, ప్రజలకు ఏమాత్రం మంచిది కాదు.

ఇప్పుడున్న సీపీఎస్‌తోనూ భరోసా లేదు:
► ఓపీఎస్‌ బదులుగా ఇప్పుడున్న సీపీఎస్‌తోనూ భరోసా లేదన్నది వాస్తవం.
► దశాబ్దానికీ, దశాబ్దానికీ తగ్గిపోతున్న బ్యాంకుల వడ్డీరేట్లు నేపథ్యంలో ఇప్పుడు అందుతున్న సీపీఎస్‌కూడా భవిష్యత్తులో మరింత తగ్గే పరిస్థితులున్నాయన్నది వాస్తవం. 
► 1980ల్లో 12–13 శాతం ఉన్న వడ్డీ రేట్లు ఇవాళ 5 – 6 శాతం కూడా దాటని పరిస్థితి.
► ఇది ఇలాగే కొనసాగితే ఇప్పుడు వస్తున్న పింఛన్‌లో 20 శాతం కూడా రాని పరిస్థితి.
► అంతేకాకుండా ఈ డబ్బు వివిధ ఫండ్స్‌లో, స్టాక్‌మార్కెట్లలో పెట్టుబడులు రూపేణా ఉండడం వల్ల అవి ఒడిదుడుకులకు గురైనప్పుడల్లాం ఉద్యోగులకు అందే సీపీఎస్‌పైనా ప్రతికూల ప్రభావం పడుతుంది.
► రిటైర్డ్‌ ఉద్యోగికి కచ్చితంగా నెలకు ఇంత అందుతుందని చెప్పే పరిస్థితులు లేవు. 

మిగతా రాష్ట్రాలకూ అనుసరణీయం
కొన్ని రాష్ట్రాలు రాజకీయ కారణాలతో ఓపీఎస్‌కు వెళుతున్నట్లు ప్రకటించినా వాస్తవంగా అది ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. రాష్ట్రాల సొంత రాబడిలో పెన్షన్ల వ్యయం భారీగా పెరిగితే అప్పుడు మళ్లీ సీపీఎస్‌కు తిరిగి రావాల్సిన పరిస్థితులు ఏర్పడటం ఖాయమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల సంక్షేమం, ఆర్థిక భద్రత పట్ల చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి జగన్‌ ఆలోచనలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న ఈ మెరుగైన పెన్షన్‌ విధానమే మిగతా రాష్ట్రాలకూ అనుసరణీయం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement