ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం పాయకరావుపేటలో ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా మార్గం మధ్యలో ఒక మహిళ.. ఓ చిన్నారిని ఎత్తుకుని ఏడుస్తుండటం కనిపించింది. వెంటనే కాన్వాయ్‌ని ఆపించిన సీఎం.. దిగి నడుచుకుంటూ ఆమె వద్దకు వెళ్లి ఆరా తీశారు. బుద్ధిమాంద్యం గల కుమారుడితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఆదుకోవాలని ఆమె విన్నవించింది. ఈమె కష్టం తీర్చండని సీఎం కలెక్టర్‌ను ఆదేశించిన రెండు గంటల్లోనే తక్షణ సాయంగా ఆమెకు రూ.10 వేలు అందింది. ఆ బాలుడికి వికలాంగ పింఛన్ మంజూరైంది. రూ.35 వేల విలువైన వీల్ ఛైర్ అందింది. ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.
సాక్షి ప్రతినిధి, కాకినాడ/నక్కపల్లి: రోడ్డు పక్కన కన్నీటితో కనిపించిన ఓ తల్లిని గమనించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాన్వాయ్ ఆపించి, వాహనం నుంచి కిందకు దిగి సాయం చేసిన తీరు ప్రశంసలందుకుంటోంది. గురువారం పాయకరావుపేటలో ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా మార్గం మధ్యలో రోడ్డుకు ఇరువైపులా జనం జై జగన్ అంటూ జేజేలు పలుకుతున్నారు. వారి మధ్యలో ఒక మహిళ.. ఓ చిన్నారిని ఎత్తుకుని ఏడుస్తుండటం సీఎం కంట పడింది. వెంటనే కాన్వాయ్‌ని రోడ్డుపైనే ఆపించి, ఆయన బస్సు దిగారు.
అక్కడ ఉన్న వారంతా ఏం జరిగిందా అని ఉత్కంఠగా చూస్తుండగా.. సీఎం నేరుగా నడుచుకుంటూ ఆ మహిళ వద్దకు వెళ్లారు. ఎందుకు ఏడుస్తున్నావని ఆరా తీశారు. ‘నా పేరు తనూజ. మేం నిరుపేదలం. మాది ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం మండపం గ్రామం. నా ఎనిమిదేళ్ల కుమారుడికి పుట్టుకతోనే బుద్ధిమాంద్యం. తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. మీరే ఆదుకోవాలి’ అని ఆమె కన్నీటి పర్యంతమైంది. బాలుడి పరిస్థితిని చూసి ముఖ్యమంత్రి తీవ్రంగా చలించిపోయారు.
సీఎం ఆదేశాల మేరకు పింఛన్ మంజూరు పత్రాన్ని అందిస్తున్న కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా
ఆ బాలుడికి తక్షణమే సాయం అందించాలని అక్కడే ఉన్న కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాను ఆదేశించారు. తప్పకుండా ఆదుకుంటామని తనూజకు ధైర్యం చెప్పి ముందుకు సాగారు. మధ్యాహ్నం1.30 గంటలకు సీఎం అక్కడి నుంచి వెళ్లగా, రెండు గంటల వ్యవధిలోనే.. 3.30 గంటలకు బాధిత తల్లీ, కుమారుడిని కలెక్టర్ కాకినాడకు రప్పించారు. తక్షణ సాయంగా రూ.10 వేలు తనూజకు అందజేశారు.
వచ్చే నెల నుంచి బాలుడు వికలాంగ పింఛన్ అందుకునేలా మంజూరు పత్రాన్ని అందించారు. బాలుడికి నిత్యం ఉపయోగపడేలా రూ.35 వేలు విలువ చేసే వీల్‌చైర్‌ను అందజేశారు. బాలుడి పరిస్థితి తన దృష్టికి రాగానే రెండు గంటల వ్యవధిలోనే సాయం అందించి ఆదుకున్న సీఎం జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని తనూజ భావోద్వేగానికి గురయ్యారు. సీఎం మానవత్వంతో స్పందించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment