సారా.. నారా అండతో దోపిడీకి C/O సీఎం రమేష్‌ | CM Ramesh List of Irregularities: Andhra pradesh | Sakshi
Sakshi News home page

సారా.. నారా అండతో దోపిడీకి C/O సీఎం రమేష్‌

Published Wed, Apr 24 2024 1:13 AM | Last Updated on Wed, Apr 24 2024 1:14 AM

CM Ramesh List of Irregularities: Andhra pradesh - Sakshi

దోచుకో.. పంచుకో.. సూత్రం సారా వ్యాపారంలో ఆరితేరిపోయిన సీఎం రమేష్ను చంద్రబాబు నాయుడుకు దగ్గర చేసింది. సారా వ్యాపారంతో మొదలైన ఆర్జన ఇరిగేషన్‌ కాంట్రాక్టుల వరకు వెళ్లింది. టీడీపీ ప్రభుత్వం ఉన్నంతకాలం ఈ అక్రమార్జనపరుడికి ఎదురే లేకుండా పోయింది. రిత్విక్‌ కన్‌స్ట్రక్షన్స్‌ పేరుతో హంద్రీ –నీవా, వెలిగొండ, తెలుగుగంగ,గుంతకల్లు బ్రాంచి కెనాల్, వంశధార.. ఒకటేమిటి.. అధికారంలో బాబు అండతో సీఎం రమేష్‌ అక్రమాల్లో చెలరేగిపోయారు.

బాబు– సీఎం రమేష్లది ఆర్థిక రాజకీయ బంధం. ఈ బంధం ఫెవికాల్‌ అంతదృఢంగా పెనవేసుకుపోయింది. బాబుతో ముడిపడిన ఆర్థిక బంధం రెండు టర్మ్‌ల్లో సీఎం రమేష్ను రాజ్యసభ సభ్యుడిని చేసింది. రాజకీయ చక్రం బాగా తిప్పుతారని సదరు బాబు సూచనతో బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఇతనికి ఈసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగాలనిపించింది. స్థానికంగా అంత సీన్‌ లేనందున తన అక్రమాల నేపథ్యం తెలియని కోస్తాంధ్ర వైపు దృష్టి సారించారు. 

సాక్షి ప్రతినిధి, కడప : స్వయం కృషితో కష్టపడి ఉన్నత స్థాయికి చేరేవారు కొందరైతే, రాజకీయ అండ దొరకబుచ్చుకుని చెలరేగిపోయే వారు ఇంకొందరు. ఇందులో రెండో కోవకు చెందిన నేత చింతకుంట మునెయ్యగారి (సీఎం) రమేష్‌ నాయుడు. ఉరఫ్‌ సీఎం రమేష్. చిత్తూరు జిల్లా సారా వ్యాపారంలో చంద్రబాబుతో ఏర్పడ్డ సాన్నిహిత్యం ఉన్నత స్థాయికి ఎదిగేలా చేసింది. అదీ ఏ స్థాయిలో అంటే సొంత తమ్ముడు నారా రామ్మూర్తినాయుడినే బాబు పక్కన పెట్టే స్థాయిలో సంబంధాలు పెనువేసుకున్నాయని పరిశీలకుల అభిప్రాయం.

విభజిత ఏపీలో సీఎం రమేష్నాయుడు కాంట్రాక్టు సంస్థ దినదినాభివృద్ధి చెందింది. చంద్రబాబు ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని అనేక అక్రమ కార్యకలాపాలను శరవేగంగా నడిపారు.  ఎంతలా అంటే 2019 ఎన్నికల నోటిఫికేషన్‌కు కేవలం ఒక్క రోజు ముందే ఈయన కాంట్రాక్టు సంస్థకే ఇరిగేషన్‌ పనులు దక్కేలా చక్రం తిప్పారు. ఒక్కమాటలో చెప్పాలంటే టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్నాళ్లూ సీఎం రమేష్‌ ఆర్థిక సామ్రాజ్యం విస్తరించింది. 

ఎవరీ సీఎం రమేష్నాయుడు? 
వైఎస్సార్‌ జిల్లా యర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామానికి చెందిన చింతకుంట మునెయ్యగారి (సీఎం) సుబ్బానాయుడు మాజీ మంత్రి ఎంవీ మైసూరారెడ్డి అనుచరుడు. సారా వ్యాపారంలో రాణించారు. కడప జిల్లాలో పలుపాంత్రాల్లో ఈ వ్యాపారాన్ని విస్తరించారు. ఆయనకు నలుగురు కుమారులు. మునిస్వామినాయుడు, గోవర్ధన్‌నాయుడు, సత్యనారాయణనాయుడు, గోపాల్‌నాయుడు. తండ్రి సుబ్బానాయుడు వారసత్వంగా కుమారులు పలువ్యాపారాలను విస్తరించారు. ఈ క్రమంలో మునిస్వామినాయుడు సారా వ్యాపారాన్ని కొనసాగించారు.

అప్పట్లో కడప జిల్లాలో వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న సారా కాంట్రాక్టును చిత్తూరు జిల్లాకు విస్తరించారు. ఈ జిల్లాలో సారా కాంట్రాక్టు కార్యకలాపాలను మునిస్వామినాయుడు కుమారుడు సీఎం రమేష్నాయుడు కొనసాగించారని ఈ వ్యవహారం మొత్తం తెలిసిన పలువురు వివరిస్తున్నారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లాలో అప్పటికే క్రియాశీలకంగా ఉన్న చంద్రబాబుతో సాన్నిహిత్యం కోసం తొలుత తమ్ముడు నారా రామ్మూర్తినాయుడితో సీఎం రమేష్‌ దోస్తీ చేశారు. క్రమంగా వీరి సాన్నిహిత్యం పెరిగి, తుదకు నారా రామ్మూర్తినాయుడినే చంద్రబాబు నుంచి దూరం పెట్టేలా చేసింది. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన యువతిని సీఎం రమేష్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

దాంతో వెలమ సామాజిక వర్గానికి చెందిన సీఎం రమేష్‌ బాబుకు మరింత దగ్గరైనట్లు సమాచారం. అనంతరం 1994 ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఆయనకు చంద్రగిరి, కుప్పం నియోజకవర్గాల సమన్వయ బాధ్యతలు అప్పగించినట్లు పలువురు చెబుతున్నారు. 1995లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో సీఎం రమేష్‌ సారా వ్యాపార సామ్రాజ్యం వేగంగా విస్తరించినట్లు సమాచారం. అప్పటి సాన్నిహిత్యమే అంచెలంచెలుగా ఎదిగి టీడీపీ నుంచి రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యే స్థాయికి చేరుకుందని విశ్లేషకులు వివరిస్తున్నారు. 

టీడీపీ హయాంలో రూ.3,658 కోట్ల పనులు  
రాష్ట్ర విభజన అనంతరం టీడీపీ అధికార పగ్గాలు చేపట్టింది. రిత్విక్‌ కన్‌స్ట్రక్షన్స్‌కు ఇదో వరంగా పరిణమించింది. అప్పటి వరకూ వివిధ రాష్ట్రాల్లో కాంట్రాక్టు పనులు చేస్తూ ఆర్థిక లోటుపాట్లతో ఇబ్బందులు పడుతున్న ఆ సంస్థకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆదరించి అండగా నిలిచింది. ఈ క్రమంలో ఈ సంస్థకు కాంట్రాక్టు పనుల వరద పారిందని పలువురు వివరిస్తున్నారు.

అందులో ప్రధానంగా కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ రూ.522 కోట్లు, హంద్రీ–నీవా సుజల స్రవంతి ఫేజ్‌–2 రూ.1000 కోట్లు, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ విస్తరణ పనులు రూ.195 కోట్లు, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ 34వ ప్యాకేజీ రూ.234 కోట్లు, జీఎన్‌ఎస్‌ఎస్‌ ప్రాజెక్టులో రూ.350 కోట్లు, వెలిగొండ టన్నెల్‌ రూ.270 కోట్లు, తెలుగుగంగ లైనింగ్‌ పనులు రూ.289 కోట్లు, గుంతకల్లు బ్రాంచ్‌ కెనాల్‌ రూ.172 కోట్లు,  వంశధార ప్రాజెక్టు పనులు రూ.120 కోట్లు, ఆర్టీపీపీ 6వ ప్లాంటు నిర్మాణ పనులు రూ.400 కోట్లు, గండికోట ప్రాజెక్టు పునరావాస నిర్మాణం పనులు రూ.106 కోట్ల పనులు దక్కినట్లు పలు కాంట్రాక్టు సంస్థలు వెల్లడిస్తున్నాయి.

అప్పటి టీడీపీ ప్రభుత్వంలో దాదాపు రూ.3,658 కోట్ల పైబడిన కాంట్రాక్టులను ఆ సంస్థ కొనసాగిస్తున్నట్లు పలువురు కాంట్రాక్టర్ల విశ్వసనీయ సమాచారం. అదే విషయాన్ని ప్రొద్దుటూరు నియోజకవర్గ  అప్పటి టీడీపీ ఇన్‌చార్జి మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి (ప్రస్తుత టీడీపీ అభ్యర్థి) సైతం పలుమార్లు స్పష్టం చేశారు. ఎంపీ రమేష్‌నాయుడుకు చెందిన రిత్విక్‌ కన్‌స్ట్రక్షన్స్‌ దోపిడీకి పాల్పడుతోందని ఆరోపించారు.  

ఆర్టీపీపీలో  అడ్డగోలు
టీడీపీ ఎంపీ హోదాలో రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రమేష్‌ దందా నిర్వహిస్తే, సోదరుడు సీఎం సురేష్నాయుడు స్థానికంగా ఆర్టీపీపీ (రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌) కేంద్రంగా దోపిడీ చేశారు. ఇనుము (స్క్రాప్‌), సిమెంటు, కంకర యథేచ్ఛగా తరలించారు. తన దారికి అడ్డు లేకుండా మరో రహదారి (అనధికారిక గేట్‌) ఏర్పాటు చేసి మరీ తరలించారు. మూడేళ్ల పాటు జెన్‌కో డైరెక్టర్లు చోద్యం చూడటం మినహా కట్టడి చేయలేని దుస్థితి.

ఆర్టీపీపీలో అధికారికంగా రెండుగేట్లు ఉన్నాయి. వాటి పరిధిలో స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్సు(ఎస్పీఎఫ్‌) బందోబస్తు ఉంటుంది. ప్రతిదీ అక్కడ రికార్డు అవుతుంది. ఈ క్రమంలో అనధికారికంగా మూడో గేటు వెలసింది. అందుకు అప్పటి సీఈ, ఓ డైరెక్టర్‌ స్థాయిలో సహకరించారు. 6వ యూనిట్‌ నిర్మాణ పనుల నేపథ్యంలో వాహనాల రాకపోకలకు మూడో గేట్‌ ఏర్పాటు చేసినట్లు యంత్రాంగం సమర్థించుకుంది. ఆ గేటులో ఎలాంటి సిబ్బంది లేకపోవటంతో అవినీతి అక్రమాలకు నిలయంగా మారింది. యథేచ్ఛగా ఈదారి గుండా వాహనాలు ఆర్టీపీపీలోకి వెళ్లడం, బయటికి రావడంతో అందులో ఉన్న కోట్లాది రూపాయల స్క్రాప్, కంకర, సిమెంటు బయటకు వెళ్లింది. విజిలెన్సు విభాగం యాజమాన్యానికి అప్పట్లో ఈ విషయమై నివేదించినా ఫలితం లేకపోయింది. 

చంద్రబాబు అండ 
చిత్తూరు జిల్లాలో సారా వ్యాపారంతో అరంగేట్రం చేసిన సీఎం రమేష్‌ కుటుంబానికి అప్పటి నుంచే చంద్రబాబునాయుడు అండగా నిలిచి ఆదరించారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో గుడిమల్లం దేవాలయ భూములు 303 ఎకరాలు వేలానికి వచ్చాయి. అప్పటి రాజకీయ  సంబంధాల కారణంగా సీఎం రమేష్‌ కుటుంబం తక్కువ ధరలకు ఆ భూములను వేలంలో దక్కించుకున్నట్లు సమాచారం. ఆ భూముల ఆధారంగా 90వ దశకం చివర్లో అప్పటి రాజకీయ పలుకుబడితో బ్యాంకులో దాదాపు రూ.400 కోట్ల  రుణం తీసుకున్నట్లు తెలుస్తోంది. తర్వాత రిత్విక్‌ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ కార్యకలాపాలు చురుగ్గా సాగినట్లు వాటి కార్యకలాపాలే చెబుతున్నాయి. 

వ్యక్తిపై దాడి కేసు
అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న సీఎం రమేష్నాయుడుపై 2019 ఏప్రిల్‌ 11న వైఎస్సార్‌ కడప జిల్లా యర్రగుంట్ల పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. 2019 ఎన్నికల సమయంలో యర్రగుంట్లలోని ఓ ఎన్నికల బూత్‌లోకి నిబంధనలకు విరుద్ధంగా ఒకరికంటే ఎక్కువ మంది వెళ్లడంతోపాటు ఓ వ్యక్తిపై దాడి చేసి గాయపరిచారు. బాధితుడు పడిగపాటి వెంకటసుధాకర్‌ తండ్రి బాల సుబ్బిరెడ్డి ఇచి్చన లిఖితపూర్వక ఫిర్యాదు మేరకు సీఎం రమేష్పై 100/2019 ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయగా, ఐపీసీ సెక్షన్‌ 323, 324/ఆర్‌/డబ్లు 34 కింద కేసు
నమోదు చేశారు. 

ప్రభుత్వ నిధులతో భూములకు ప్రొటెక్షన్‌ వాల్‌  
అపోట్లదుర్తి గ్రామంలో నీరు–చెట్టు పథకం కింద ఫ్లడ్‌ ప్రొటెక్షన్‌ బ్యాంక్స్‌ ఏర్పాటు చేసేందుకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్‌ జీఓ జారీ చేసింది. జీఓ ఆర్‌టీ నంబర్‌ 74 ను 2019 జనవరి, 29న జారీ చేశారు. ఆ మేరకు నీరు–చెట్టు పథకం కింద ఫ్లడ్‌ ప్రొటెక్షన్‌ బ్యాంక్స్‌ నిర్మించేందుకు ఫిబ్రవరి 1న ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ టెండర్లను ఆ శాఖ ఎస్‌ఈ ఆహా్వనించారు. అంటే విషయం గ్రహించేలోపు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యేలా వ్యవహరించారు. ఎన్నికల కోడ్‌కు ముందే టెండర్లకు పిలిచిన నేపథ్యంలో ఫిబ్రవరి 19న టెండర్లు ఫైనల్‌ చేశారు. పలు కాంట్రాక్టు సంస్థలు పోటీపడ్డా ఆయా సంస్థలను డిస్‌క్వాలిఫై చేసి రిత్విక్‌ సంస్థకు మాత్రమే టెండర్‌ను 4 శాతం ఎక్సెస్‌ రేట్లకు ఖరారు చేశారు. అవే పనులను రూ.3.08 కోట్లతో రమేష్నాయుడు కుటుంబ సభ్యుల స్వా«దీనంలో ఉన్న ప్రభుత్వ భూమి చుట్టూ నిరి్మంచడం విశేషం.  

అఇకోస్తాంధ్రలోనే ఎందుకంటే.. 
సీఎం రమేష్నాయుడు ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నా, రాయలసీమలో అందునా కడప జిల్లాలో రాజకీయంగా గ్రామానికి ఎక్కువ, మండలానికి తక్కువ స్థాయి. అదే విషయాన్ని మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అనేక పర్యాయాలు చెప్పుకొచ్చారు. అలాంటి స్థాయిలేని నాయకుడికి అనధికారికంగా జిల్లా బాధ్యతలు అప్పగించి ప్రజాధనం దోపీడీకి పాల్పడుతున్నారని అప్పట్లో తీవ్రంగా ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రజాబలం లేని కడప నుంచి పోటీ చేయలేక, కోస్తాంధ్రలోని అనకాపల్లి బీజేపీ అభ్యర్థిగా తెరపైకి వచ్చారు. ఎన్నికల్లో ఖర్చు చేయగల సామర్థ్యం, పైగా టీడీపీ అధినేత చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యం వల్లే అక్కడ పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని పరిశీలకులు భావిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement