సాక్షి, అమరావతి: వలంటీర్లపై నిత్యం తప్పుడు ప్రచారం చేయడం ద్వారా రాష్ట్రంలో పేద ప్రజలందరికీ మేలు చేసే ఈ వలంటీర్ల వ్యవస్థనే రాష్ట్రంలో లేకుండా చేసేందుకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ వ్యతిరేకులందరూ ఒక్కటై కుట్రలు మొదలుపెట్టారు. వలంటీర్ల వ్యవస్థ మీద దుష్ప్రచారానికి రామోజీరావు స్క్రిప్టు, చంద్రబాబు ప్రొడక్షన్, పవన్ కళ్యాణ్ యాక్షన్ సమకూరుస్తున్నారు. ప్రభుత్వం అందజేసే అన్ని సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఇప్పుడు ఎలాంటి పైరవీలు, లంచాలు, అవినీతి లేకుండా వలంటీర్ల ద్వారా నేరుగా ప్రజలకు అందుతున్నాయి.
ఈ ప్రభుత్వం నాలుగేళ్ల కాలంలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా దాదాపు 8.06 కోట్ల మంది లబ్ధిదారుల (ఒకే లబ్ధిదారునికి ఐదారు పథకాలు అంది ఉండొచ్చు)కు మొత్తం రూ.2.25 లక్షల కోట్లు నేరుగా ప్రభుత్వం అందజేసింది. ఇళ్ల పట్టాల పంపిణీ.. చిన్నపిల్లలు, గర్భిణిలు, బాలింతలకు పౌష్టికాహారం అందజేసే వైఎస్సార్ సంపూర్ణ పోషణ వంటి పథకాల ద్వారా మరో 3.08 కోట్ల మంది లబ్ధిదారులకు ఇంకో రూ.1.91 లక్షల కోట్లు లబ్ధి కలిగించింది. ఇందులో ఎక్కడా అవినీతి ఆరోపణలే లేవు.
దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై, ప్రత్యేకించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేవలం రెండున్నరేళ్ల వ్యవధిలోనే ఈ వ్యవస్థకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పట్ల రాష్ట్రంలో పేద, మధ్యతరగతి ప్రజల్లో మరింత ఆదరణ పెరిగింది. పాలనపరంగా.. రాష్ట్రంలో, దేశంలో జగన్‌మోహన్‌రెడ్డి ఇమేజీ భారీగా పెంచింది.
మరో 10 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు వలంటీర్ల వ్యవస్థపై పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేయడం ద్వారా ప్రభుత్వ ఇమేజీ తగ్గించాలని యత్నాలు మొదలయ్యాయని రాజకీయ, అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో రాజకీయంగా ఎదగడమే ఇష్టం లేని ‘ఈనాడు’.. ఆయన అధికారంలో ఉన్నప్పుడూ, లేనప్పుడూ ఆయన్ను టార్గెట్ చేసుకొని ఎన్నో కథనాలు వండివార్చింది.
ఇప్పుడు జగన్‌కు పాలనపరంగా భారీ ఇమేజీని తీసుకొచ్చిన వలంటీర్ల వ్యవస్థ పైనా ‘ఈనాడు’ రకరకాల కథనాలు రాస్తూ వలంటీర్ల వ్యవస్థను ఓ మాఫియాగా చూపుతోంది. ఇందుకు చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు తానా తందానా అంటూ వంత పాడుతున్నారు. 2019 ఆగస్టులో వలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు సమయంలోనే దీన్ని అడ్డుకోవడానికి కొందరు హైకోర్టుకు వెళ్లారు.
అప్పట్లో హైకోర్టు ఆ కేసును కొట్టివేయడంతో నాలుగేళ్లగా రాష్ట్రంలో ప్రజలందరూ వలంటీర్ల సేవలు పొందుతున్నారు. అయితే ఇప్పుడు ఎన్నికలకు ముందు మరోసారి కోర్టుకెళ్లడం ద్వారా ఆ వ్యవస్థను రద్దు చేయించాలనే కుట్ర కొనసాగుతూనే ఉందని మరోమారు స్పష్టమైందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
వలంటీర్లు అంటే ఆ ఊరి వాళ్లే..
వలంటీర్లు అంటే వేరే ఎక్కడి వారో కాదు. ఏ ఊరి వాళ్లనే ఆ ఊరిలో ప్రభుత్వం నిబంధనల ప్రకారం వలంటీర్లుగా నియమించింది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీల సరాసరి జనాభా సంఖ్య 2,000కు లోపుగానే ఉంటుంది. అలాంటి ఊళ్లోని పురుషులు/మహిళలను 50 ఇళ్లకు ఒకరు చొప్పున వలంటీర్‌గా నియమించారు.
ఇలాంటి వారిని పట్టుకుని మోసాలకు పాల్పడుతున్నారంటూ ‘ఈనాడు’ చేసే తప్పుడు ప్రచారం వినడానికే వింతగా ఉందని అధికార, రాజకీయ వర్గాల వారు ఎద్దేవా చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఆ ఊళ్లోనే పెరిగిన వారు, వలంటీర్లు అయ్యాక కొత్తగా ఆ ఊళ్లోని మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు, అసభ్య ప్రవర్తన, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని చెప్పడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వలంటీర్లను ‘ఈనాడు’.. హత్యలు, హత్యాయత్నాలు చేసేవారిగా చిత్రీకరించినా, చంద్రబాబు.. వాళ్లను అవినీతికి పాల్పడే వారుగా పేర్కొన్నా, అమ్మాయిల కిడ్నాప్‌లకు సహకరించే సంఘ విద్రోహశక్తులంటూ పవన్‌కళ్యాణ్ మాట్లాడినా.. వీరందరి అంతిమ లక్ష్యం ఇంత మంచి వలంటీర్ల వ్యవస్థను రద్దు చేయించాలన్నదే అని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. పట్టణాలలో సైతం ఏ వార్డు పరిధిలోని వాళ్లనే ఆ వార్డు పరధిలో వలంటీర్లగా నియమిస్తున్నామని అధికారులు వివరించారు.
సగానికి పైగా మహిళలు..
గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 50 ఇళ్లకు.. పట్టణ ప్రాంతాల్లో ప్రతి 70–100 ఇళ్లకు ఒకరు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 2.61 లక్షల మంది వలంటీర్ల క్లస్టర్‌గా వర్గీకరించారు. ప్రస్తుతం 2,54,038 మంది వలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్నారు. వీరిలో 56 శాతం మంది మహిళలే. అందులో బీసీలు 12,5032 మంది, ఎస్సీలు 68,622 మంది, ఎస్టీలు 18,295 మంది.. మొత్తం 80 శాతానికి పైగా ఈ వర్గాల వారే ఉన్నారని గ్రామ, వార్డు సచివాలయ శాఖ గణాంకాలు పేర్కొంటున్నాయి.
వలంటీర్లలో దాదాపు లక్ష మంది డిగ్రీ, ఆపైన ఉన్నత విద్య చదువుకున్న వారే. కేవలం పదవ తరగతి చదివిన వారు పది శాతం లోపే ఉన్నారని అధికారులు తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో కొంత మేర చదువుకొని, స్థిర ఉద్యోగం వచ్చే దాక ఊళ్లో తమ వాళ్లందరి మధ్య వలంటీరుగా పని చేస్తున్న వారిని ఆ ఊరిలో సంఘ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడే వారిగా పేర్కొనడాన్ని ప్రతి ఒక్కరూ తప్పుపడుతున్నారు.
పింఛన్ పంపిణీ విప్లవాత్మక సంస్కరణ
ప్రతి నెలా ఒకటవ తేదీన ఠంచన్‌గా రాష్ట్రంలోని దాదాపు 64 లక్షల మంది అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల ఇంటికి వలంటీర్లు వెళ్లి పింఛను పంపిణీ చేస్తున్న కార్యక్రమం పాలనా సంస్కరణలోనే అద్భుతంగా దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందింది.
ఒకప్పుడు.. రాష్ట్రంలో అవ్వాతాతలు పింఛను డబ్బులు తీసుకోవడానికి నడవలేని స్థితిలో కూడా ప్రతి నెలా తమ ఊళ్లో కచ్చితంగా ఎక్కడ పింఛను డబ్బులు ఇస్తారో కూడా తెలియక అన్ని ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు అలాంటి సమస్య ఏ ఊళ్లోనూ లేదు. ఏ అవ్వాతాతకు చిన్న కష్టం కూడా తెలియకుండా వలంటీరే వారి ఇంటికి వెళ్లి డబ్బులు అందజేస్తున్నారు. కరోనా సమయంలో, వరద సమయంలో బాధితులకు వేగంగా సాయం అందించారనే విషయం ఎవరికి తెలియదు?
దుష్ప్రచారం అనక ఇంకేమనాలి?
సాధారణంగా వందలో ఒకరి గురించి మాట్లాడాలన్నా.. ఆ ఒక్కడేగా అంటుంటాం. అలాంటిది ఏ పది వేల మంది వలంటీర్లలో ఎక్కడో ఒక వలంటీర్ తప్పిదాలకు పాల్పడితే.. దాని గురించే పదే పదే ప్రచారం చేస్తూ ఈ వ్యవస్థలో పని చేస్తున్న 2.54 లక్షల మంది వలంటీర్లను సంఘ విద్రోహ శక్తులుగా, అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిగా ఈనాడు, చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు పేర్కొనడం ఎంత వరకు సమంజసం? ఇలా పనిగట్టుకుని ప్రచారం చేయడాన్ని దుష్ప్రచారం అనక ఇంకేమనాలి?
Comments
Please login to add a commentAdd a comment