కృష్ణా, సాక్షి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కసరత్తును కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రానికి వచ్చిన ఈసీ బృందం.. అధికార యంత్రాంగంతో శుక్రవారం ఉదయం భేటీ అయ్యింది. ఓటర్ల జాబితా అంశంతో పాటు ఎన్నికల సన్నాహాకాలపైనా ఇందులో చర్చించనుంది.
సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ధర్మేంద్ర శర్మ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ఈసీ బృందం గురువారం రాత్రి రాష్ట్రానికి చేరుకుంది. విజయవాడ నోవాటెల్ హోటల్ ఇవాళ, రేపు అధికారులతో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సమీక్ష నిర్వహించనుంది. సాయంత్రం ఆరు గంటల వరకు ఈ సమీక్ష కొనసాగనుంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2024తో పాటు, రాబోయే శాసనసభ, లోక్‌సభ ఎన్నికల సన్నద్ధత తదితర అంశాలపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో భేటీ అవుతుంది. ఈ క్రమంలో..
ఈసీ బృందానికి ఇవాళ ఎన్నికల సన్నద్దతపై కలెక్టర్లు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఒక్కొక్క జిల్లా కలెక్టర్ ఎన్నికల సన్నద్దతపై 15 నిమిషాల పాటు ఈసీ బృందానికి వివరించనున్నారు. ఆపై జిల్లాల వారీగా ఓటర్ల జాబితా, ఎన్నికల నిర్వహణ సన్నద్ధత పరిస్థితిపై నివేదికలు సమర్పించనున్నారు. ఇవాళ 18 జిల్లాల కలెక్టర్లు,ఎస్పీలు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఉంటుంది.
మిగిలిన ఎనిమిది జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు రేపు(శనివారం) పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎస్ జవహర్ రెడ్డి, రాష్ట్ర ఎన్నికల ప్రధానాదికారి ముకేష్ కుమార్ మీనా పాల్గొన్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం బృందంలో సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్‌కుమార్ వ్యాస్, డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ఆర్‌కే గుప్తా, హిర్దేశ్‌కుమార్, అజయ్‌బాదో తదితరులు ఈ సమీక్షకు హాజరయ్యారు.
రెండురోజుల పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో జరిగే సమీక్ష సమావేశాలకు విజయవాడ నోవోటెల్‌లో పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డిల్లీరావు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్ మీనాతో కలిసి గురువారం ఆయన నోవోటెల్ హోటల్‌ను పరిశీలించారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గడువు జూన్ 16తో ముగియనుంది.
Comments
Please login to add a commentAdd a comment