సాక్షి, అమరావతి: మారుమూల గిరిజన ప్రాంతాలకు సమర్థవంతమైన టెలికాం సేవలందించడంతో పాటు సంక్షేమాభివృద్ధి పథకాలు ప్రతి ఇంటికి పారదర్శకంగా అందాలన్న తపన, తాపత్రయంతో అడుగులు వేగంగా వేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఇందులో భాగంగా దాదాపు రూ.400 కోట్లతో 400 సెల్ టవర్లను నిర్మించామని తెలిపారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వాటిని వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 400 సెల్ టవర్ల ద్వారా 2.42 లక్షల మందికి ప్రయోజనం చేకూరిందన్నారు.
ప్రధానంగా అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, ప్రకాశం, ఏలూరు, శ్రీకాకుళం, కాకినాడ జిల్లాల్లోని మారు మూల ప్రాంతాల వారు ఫోన్లలో మాట్లాడే వీలు కలుగుతోందన్నారు. ప్రస్తుతం ప్రారంభించిన టవర్ల ద్వారా 944 గ్రామాలకు కనెక్టివిటీ ఏర్పడుతుందని చెప్పారు. మొత్తంగా రూ.3,119 కోట్లతో 2,900 టవర్లను ఏర్పాటు చేసేలా కార్యాచరణ రూపొందించామని తెలిపారు. తద్వారా 5,549 ఆవాసాలను కనెక్టివిటీలోకి తీసుకొచ్చేందుకు మార్గం ఏర్పడుతుందని తెలిపారు. దీన్ని సఫలీకృతం చేసేందుకు కేంద్రంతో మాట్లాడి.. ఇందులో భాగస్వామ్యం అయ్యేలా ఒప్పించామన్నారు.
సెల్ టవర్ల ఏర్పాటుకు అవసరమైన భూములను 2,900 లొకేషన్లలో ఇప్పటికే ఇచ్చామని స్పష్టం చేశారు. ‘ఎటువంటి ఇబ్బంది లేకుండా సెల్ టవర్ల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చాం. పవర్ కనెక్షన్‌కు చర్యలు తీసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేయాల్సినవన్నీ రెట్టించిన వేగంతో చేశాం. టవర్ల నిర్మాణ కార్యక్రమం ఇప్పటికే మొదలైంది. దేవుడు ఆశీర్వదిస్తే ఇదే మాదిరిగా ప్రతి 3 నెలలకొకసారి...400 నుంచి 500 టవర్ల నిర్మాణం పూర్తి చేసి అన్నింటినీ అందుబాటులోకి తీసుకొస్తాం. మరో ఏడాది కాలంలో అన్ని టవర్ల నిర్మాణం పూర్తి చేస్తాం’ అని తెలిపారు.
మారుమూల ఆవాసాల్లో టీవీలు, ఫోన్లు
సెల్ టవర్ల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో.. కనెక్టివిటీ లేని ఆవాసాలను సమాజంతో కనెక్ట్ చేసే కార్యక్రమం జరుగుతోందని.. టీవీలు, ఫోన్లు పనిచేస్తాయని సీఎం వైఎస్ జగన్ అన్నారు. మనం ఇచ్చే పథకాలకు సంబంధించి వివరాలన్నింటినీ వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేసే కార్యక్రమం వేగవంతంగా జరుగుతుందని చెప్పారు. మనం బటన్ నొక్కిన వెంటనే వాళ్లకు డబ్బులు ట్రాన్స్‌ఫర్ కావడం కూడా అంతే వేగంగా జరుగుతుందన్నారు.
వెంటనే వాళ్లు చూసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇవన్నీ వేగవంతంగా, ఎఫెక్టివ్‌గా, పారదర్శకంగా జరగడం కోసమే ఈ కనెక్టివిటీ చాలా అవసరంగా భావించి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకే వ్యవస్థ, విలేజ్ క్లినిక్‌లు, నాడు–నేడుతో బాగు పడుతున్న ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు.. ఇవన్నీ గ్రామ రూపురేఖలను మార్చే దిశగా పడుతున్న అడుగులని, ఈ నేపథ్యంలో కనెక్టివిటీ అన్నది అత్యంత ఉపయోగకరమైన అంశం అవుతుందన్నారు.
ఈ కార్యక్రమం నిర్వహించిన సీఎం క్యాంపు కార్యాలయంలో ఐటీ, పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్, కమ్యూనికేషన్స్ (ఐటీ శాఖ) డైరెక్టర్ సి చంద్రశేఖర్ రెడ్డి, భారతీ ఎయిర్‌టెల్, రిలయెన్స్ సంస్థల ప్రతినిధులు.. డుంబ్రిగుడ మండలం ఈదులపాలెంలో పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, పాడేరు నియోజకవర్గ సమన్వయకర్త మత్స్యరాస విశ్వేశ్వరరాజు, కలెక్టర్ సుమిత్‌కుమార్, ఎస్పీ తుహిన్‌సిన్హా, సబ్‌కలెక్టర్ «ధాత్రిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
గతంలో ఫోన్ చేయాలంటే కొండ ఎక్కాల్సి వచ్చేది
సార్.. మేం గతంలో చాలా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. గతంలో ఫోన్ చేయాలంటే కొండల పైకి ఎక్కాల్సి వచ్చేది. ఇప్పుడు మా గ్రామంలోనే సెల్ టవర్ ఏర్పాటు చేశారు. సిగ్నల్ బాగా వస్తోంది. మా గ్రామస్తులందరూ సంతోషంగా ఉన్నారు. మాకు గతంలో సచివాలయం అంటే, కలెక్టర్ అంటే, వలంటీర్ అంటే తెలీదు. ఇప్పుడు అందరి గురించి తెలిసింది. జగనన్న మా బాధలు గమనించి మాకు సాయం చేస్తున్నారు. గతంలో రోడ్లు లేవు. ఇప్పుడు చక్కటి రోడ్లు వేశారు.
మీరు (సీఎం) ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలు మాకు అందుతున్నాయి. మీరు మా వెంట ఉన్నామన్న భరోసా ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. మీ పథకాల ద్వారా లబ్ధి పొంది మా కాళ్లపై మేం నిలబడ్డాం. మేమంతా కూడా మళ్లీ మీరే రావాలని కోరుకుంటున్నాం. గతంలో మీరు పాడేరు వచ్చినప్పుడు దగ్గర నుంచి చూడలేకపోయాను. ఇప్పుడు నేరుగా మీతో మాట్లాడే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. – చిట్టెమ్మ, గిరిజన మహిళ, పాడేరు మండలం, ఏఎస్‌ఆర్ జిల్లా
ఐదు కిలోమీటర్లు వెళ్లాల్సిన బాధ తప్పింది
అన్నా.. మా గిరిజన గ్రామాలకు ఇన్నాళ్లూ ఫోన్ సిగ్నల్ లేదు. 5 కిలోమీటర్లు వెళ్లి ఫోన్ చేయాల్సి వచ్చేది. ఏదైనా ప్రమాదం జరిగినా అంబులెన్స్ వాళ్లకు చెప్పడానికి కూడా ఫోన్ సిగ్నల్ ఉండేది కాదు. మా బంధువుల కష్టసుఖాలు తెలిసేవి కాదు. కానీ ఇప్పుడు నేరుగా వారితో మాట్లాడుతున్నాం. మా పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు. నేరుగా టీచర్స్‌తో మాట్లాడుతున్నాం. ఇదివరకు గవర్నమెంట్ స్కీమ్స్ గురించి తెలిసేది కాదు.
ఇప్పుడు నేరుగా జగనన్నకు చెబుదాం నెంబర్ 1902కు కాల్ చేసి మాట్లాడగానే మా సమస్య పరిష్కారం అవుతోంది. ఆరోగ్యశ్రీ యాప్, దిశ యాప్ విలువ తెలిసింది. మా సచివాలయంలో ఇదివరకు సిగ్నల్ లేక ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు మీ చొరవ వల్ల ఇంటి నుంచే అన్నీ తెలుసుకుంటున్నాం. ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా ఊళ్లోనే అన్ని సేవలు అందుతున్నాయి. మీ వల్ల అందరం చాలా సంతోషంగా ఉంటున్నాం. – చలపతిరావు, గిరిజనుడు, పార్వతీపురం మన్యం జిల్లా
Comments
Please login to add a commentAdd a comment