సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, సంభవిస్తున్న వరదల వల్ల ప్రజలకు ఎలాంటి సమస్య తలెత్తకుండా విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల సీఎండీలు ఐ.పృథ్వితేజ్, జె.పద్మాజనార్దనరెడ్డి, కె.సంతోషరావు ‘సాక్షి’ తో మాట్లాడారు. వర్షాకాలంలో విద్యుత్‌తో సంబంధమున్న ఏ వస్తువునైనా.. ఒకటికి రెండు సార్లు పరిశీలించిన తర్వాతే తాకాలని ప్రజలకు సూచించారు.
ఆక్వా రైతులు ఏరియేటర్స్‌ను పట్టుకోద్దని, గృహ వినియోగదారులు సర్విస్ వైర్లను, వాటితో వేలాడే ఇనుప తీగలను, కరెంట్ స్తంభాలను, ఇనుప స్తంభాలను, లైన్ల మీద పడిన చెట్టు కొమ్మలను పట్టుకునే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. పొలాల్లో తెగిపడిన, తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలని.. ముఖ్యంగా 11 కేవీ, 33 కేవీ విద్యుత్ తీగల కింద, 132/220 కేవీ సరఫరా టవర్ల దగ్గరలో నిల్చోవద్దని సూచించారు.
విద్యుత్‌కు సంబంధించిన సమస్య ఉంటే.. వెంటనే సిబ్బందిని సంప్రదించాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు తమ సిబ్బందికి వాకీ టాకీ సెట్‌లు అందిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే టోల్ ఫ్రీ నంబర్–1912 అందుబాటులో ఉందన్నారు. దానికి అదనంగా పర్యవేక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలతో పాటు స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతినడం తదితర సమస్యల పరిష్కారం కోసం పర్యవేక్షణ కేంద్రాల నంబర్లను సంప్రదించాలని సూచించారు.
ప్రజల రక్షణకు, విద్యుత్ పునరుద్ధరణ పనులకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక అధికారులను, సహాయక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అవసరమైన స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, వైర్లు తదితర విద్యుత్ సామగ్రిని.. జేసీబీలు, ట్రీ కట్టర్లు, జనరేటర్లు, రవాణా వాహనాలు, కారి్మకులను సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. జిల్లా/సర్కిల్ వారీగా పర్యవేక్షణ కేంద్రాల ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment