పాడికి భరోసాపై కాలకూట విషం | Financial security for dairy farmers with Jagananna Pala Velluva | Sakshi
Sakshi News home page

పాడికి భరోసాపై కాలకూట విషం

Published Sat, Mar 2 2024 2:56 AM | Last Updated on Sat, Mar 2 2024 2:56 AM

Financial security for dairy farmers with Jagananna Pala Velluva - Sakshi

పాడి రైతు చిరునవ్వులు చిందిస్తుంటే ఈనాడులో విషపురాతలు

‘జగనన్న పాల వెల్లువ’తో పాడి రైతులకు ఆర్థిక భధ్రత

ప్రైవేటు డెయిరీలకు మిన్నగా లీటరుకు రూ.10–20 మేర అదనంగా లబ్ధి

మూడేళ్లలోనే రోజుకు 3.75 లక్షల లీటర్లు సేకరిస్తున్న అమూల్‌ 

మూతపడిన చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ కోసం అమూల్‌తో ఒప్పందం

ఒంగోలు డెయిరీ పునరుద్ధరణకు చర్చలు

ఈ రెండు చోట్ల రూ.785 కోట్ల పెట్టుబడులు పెడుతున్న అమూల్‌

డెయిరీలో కొంత భాగమే లీజుకు.. ఆస్తులపై ఎలాంటి హక్కులుండవు

సాక్షి, అమరావతి: సంక్షోభంలో చిక్కుకుని మూతపడ్డ సహకార పాల డెయిరీలను పున­రుద్ధ­రించారు.. ప్రైవేటు డెయిరీల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు సహకార రంగంలో అగ్ర­గామిగా ఉన్న అమూల్‌తో ఒప్పందం చేసుకుని పాడి రైతులకు గిట్టు­బాటు ధర కల్పించారు. లీటర్‌కు రూ.4 చొ­ప్పు­­న అదనపు లబ్ధి చేకూరుస్తామని ఎన్నికల్లో ఇచ్చి­న హామీకి మిన్నగా లీటర్‌కు రూ.10 నుంచి రూ.20 వరకూ అదనపు లబ్ధి చేకూరుస్తున్నారు.

ఇప్పుడు పాడి రైతు చిరునవ్వులు చిందిస్తుంటే ఈనాడు రామోజీకి నచ్చడం లేదు. తన హయాంలో పాడి రైతును దగా చేసిన చంద్రబాబుకు బాకా ఊదడమే లక్ష్యంగా విషపు రాతలతో తెగబడు­తున్నారు. తన బురద రాతలతో పాడి రైతుకు భరో­సా­పై ఓర్వ­లేనితనంతో కాలకూట విషం కక్కు­తున్నారు. ‘పాడి కష్టం..అమూల్‌ పాలు’ అంటూ కాకిలెక్కలతో ఈనాడు తన ఆక్రోశాన్ని వెళ్లగక్కింది. 

ఈనాడు ఆరోపణ: ఏళ్లు గడుస్తున్నా..పెరగని పాలసేకరణ
వాస్తవం: రాష్ట్రంలోని ప్రైవేటు డెయిరీలన్నీ కలిపి రోజుకు 22 లక్షల లీటర్ల పాలు సేకరిస్తుంటే..­అమూల్‌ సంస్థ కేవలం 3.45 లక్షల లీటర్లు మాత్ర­మే సేకరిస్తోందని ఆరోపించారు. దశాబ్దాల చరిత్ర ఉన్న రాష్ట్రంలోని ప్రైవేట్‌ డెయిరీలు రోజుకు 4 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నాయి. నిం­డా మూడేళ్లు కూడా నిండని అమూల్‌ సంస్థ రోజుకు 3.75 లక్షల లీటర్ల పాలు సేకరిస్తోంది.

నేడు 4778 గ్రామాల్లో 4.15 లక్షల మంది మహిళా పాడి రైతులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. 1,09,763 మంది రోజూ పాలు పోస్తున్నారు. 2023 జూలైలో రోజుకు 1.74 లక్షల లీటర్లు పాలు సేకరణ చేయగా.. 2024 జనవరి నాటికి 3.75 లక్షల లీటర్ల పాలసేకరణకు చేరుకుంది. 4 లక్షల లీటర్ల పాల సేకరణకు ప్రైవేటు డెయిరీలకు రెండు దశాబ్దాలకు­పైగా పడితే అమూల్‌ కేవలం మూడేళ్లలో 4 లక్షల లీటర్లకు చేరువలో ఉంది.

ఆరోపణ: నమ్మించి నట్టేట ముంచారు
వాస్తవం: మధ్యవర్తులు లేకుండా మహిళా పాడి రైతులకు నేరుగా ప్రతి పదిరోజులకోసారి పాల బిల్లులను చెల్లిస్తున్నారు. ప్రత్యేక ప్రోత్సాహకం కింద ప్రతి లీటర్‌కు పాల నాణ్యత మేరకు రూపాయి నుంచి రూ.2.75 చొప్పున అందిస్తున్నారు. 180 రోజులకు తక్కువకాకుండా పాలు పోసే మహిళా పాడి రైతులకు మూడేళ్లలో రాయిల్టీ ఇన్సెంటివ్‌ కింద ఇప్పటి వరకు రూ.4.93 కోట్లు చెల్లించారు.

ఆరోపణ: ప్రైవేటు డెయిరీ కంటే తక్కువ ధర?
వాస్తవం: జగనన్న పాల వెల్లువ ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుంచి పాల సేకరణ ధరలు ఏడు సార్లు పెంచారు. ఫలితంగా గేదె పాలు లీటరుకు రూ.18.29(రూ.71.47 నుంచి రూ.89.76) ఆవు పాలకు రూ.9.49(రూ.34.20 నుంచి రూ.43.69)కు పెంచారు. 13 శాతం కొవ్వు, 9 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌తో లీటరుకు గరిష్టంగా రూ.104 చొప్పున పాడిరైతులకు ఇస్తున్నారు. ఈ ధర రాష్ట్రంలో ఏ ఒక్క ప్రైవేటు డెయిరీ చెల్లించడం లేదు.

ప్రైవేటు డెయిరీలు పాల ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ ధర, ఉత్పత్తి ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ ధర చెల్లిస్తుంటే, జగనన్న పాల వెల్లువలో సీజన్‌తో సంబంధం లేకుండా గిట్టుబాటు ధర అందిస్తున్నారు. అమూల్‌ ధరలు పెంచడంతో ప్రైవేటు డెయిరీలు కూడా తమ పాలసేకరణ ధరలను పెంచాల్సి వచ్చింది. ఫలితంగా ప్రైవేటు డెయిరీల నుంచి పాలు పోసే రైతులకు ఈ ప్రాజెక్టు ఫలితంగా రూ.4818.05 కోట్ల అదనపు లబ్ధి చేకూరింది.

ఆరోపణ: పాడి రైతులకు చేయూత ఏదీ?
వాస్తవం: పాడి రైతులకు 20 శాతం సీపీతో అత్యంత నాణ్యమైన పశువుల దాణా సరఫరా చేస్తున్నారు. ఈ కారణంగానే గరిష్ట ధర పొందుతున్నారు. ఇంతవరకు 1065 టన్నుల దాణా పంపిణీ చేశారు. క్రమం తప్పకుండా పాలుపోసే వారికి నిర్వహణ ఖర్చులు, దాణా, పశువైద్య సాయం, నీరు, విద్యుత్‌ సరఫరా వంటి వాటి కోసం వర్కింగ్‌ క్యాపిటల్‌ రుణాలు కూడా అందిస్తున్నారు.

పాల సేకరణకు 317 మండలాల్లో 6684 గ్రామాలను గుర్తించారు. ఇప్పటికే 137 చోట్ల బీఏంసీయూ భవనాలు నిర్మించారు. గ్రామ స్థాయిలో పాల సేకరణ, పరీక్ష, శీతలీకరణ కార్యకలాపాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.126 కోట్లు విడుదల చేసింది.

ఆరోపణ: గలీజు ఒప్పందాలు..అప్పు తీర్చి అప్పగించారు..
వాస్తవం: చంద్రబాబు ప్రభుత్వంలోనే ప్రైవేటు డెయిరీలు మూతపడ్డాయి. అలాగే యూహె­చ్‌­టీ, పౌడర్‌ ప్లాంట్లు, ఎంసీసీలతో పాటు 141 బీఎంసీయూలను మూసేశారు. మూతపడిన డెయిరీలను పునరుద్దరించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. లిక్విడేషన్‌లో ఉన్న చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ కోసం అమూల్‌తో ఒప్పందం చేసుకుంది. డెయిరీలోని కొంత భాగాన్ని మాత్రమే అమూల్‌కు లీజుకు ఇచ్చారు.

వాటి ఆ­స్తులు, భూములపై అమూల్‌కు ఎలాంటి హక్కు­లు కల్పించలేదు. ఈ ప్రాజెక్టు కోసం అమూల్‌ రూ.385 కోట్లు పెట్టుబడులు పెడుతోంది. చిత్తూరు డెయిరీకి రూ.182 కోట్లు అప్పులు తీర్చి అప్పగించారంటూ చేసిన ఆరోపణలో వాస్తవం లేదు. ఈ బకాయిలన్నీ గత ప్రభుత్వ హయాం నుంచి ఉన్నవే. వాటిని క్లియర్‌ చేసిందే తప్ప అమూల్‌కు లీజుకు ఇచ్చేందుకు చెల్లించలేదు.

ఒంగోలు డెయిరీని మళ్లీ వినియోగంలోకి తీసుకురావాలన్న సంకల్పంతో అమూల్‌­కు లీజుకు ఇచ్చేలా చర్చలు జరుగుతున్నాయి. రూ.400 కోట్లకు పైగా పెట్టుబడులు అమూల్‌ పెట్టేందుకు ముందుకొచ్చింది. అలాంటపుడు రూ.60 వేల కోట్ల విలువైన ఆస్తులు ధారాదత్తం చేస్తున్నారని పస లేని రాతలు రాస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement