టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై ఫిర్యాదు
యర్రగొండపాలెం/టెక్కలి/మంత్రాలయం/ పామూరు: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌పై స్థానిక పోలీస్ స్టేషన్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు సోమవారం ఎస్‌ఐ చౌడయ్య ఆయనకు మెమోలు అందజేశారు. మంత్రి లోకేశ్‌పై ట్వీట్ చేసిన కేసు ఒకటి కాగా, మరో మూడు కేసులు ఎన్నికల సమయంలో రిటర్నింగ్ అధికారి పెట్టిన కేసులుగా ఎస్‌ఐ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తమ గళం వినిపిస్తూనే ఉంటామని, ఇలాంటి కేసులకు బెదిరేది లేదన్నారు.
ఎమ్మెల్సీ దువ్వాడపై ఫిర్యాదు
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై చర్యలు తీసుకోవాలంటూ జనసేన టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జి కణితి కిరణ్ కుమార్ సోమవారం టెక్కలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై దువ్వాడ శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు చేశారని దీనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
సోషల్ మీడియా యాక్టివిస్టుపై కేసు
సోషల్ మీడియా యాక్టివిస్టులపై టీడీపీ కూటమి అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. ఎక్కడికక్కడ కేసులు పెడుతూనే ఉంది. సోమవారం రాత్రి మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం పోలీస్‌స్టేషన్‌లో టీడీపీ నాయకుల ఫిర్యాదు మేరకు వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు బగ్గు జయరామ్‌పై కేసు నమోదు చేసినట్టు సీఐ చెప్పారు.
మరో సోషల్ మీడియా యాక్టివిస్టుకు రిమాండ్
సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తదితరులపై పోస్టులు పెట్టిన వ్యక్తికి సోమవారం కనిగిరి జేఎఫ్‌సీఎం 14 రోజుల రిమాండ్ విధించినట్టు ఎస్‌ఐ కిషోర్‌బాబు తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం రాజోలు మల్కిపురానికి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టు నానిబాబుపై పామూరుకు చెందిన మోషే ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నానిబాబును ఆదివారం అరెస్ట్ చేసినట్టు ఎస్‌ఐ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment