Andhra Pradesh: బాలికల ఓటు చదువుకే | Girl Students studying idea increased with AP Govt Schemes | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: బాలికల ఓటు చదువుకే

Published Mon, Feb 6 2023 3:39 AM | Last Updated on Mon, Feb 6 2023 7:57 AM

Girl Students studying idea increased with AP Govt Schemes - Sakshi

అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, స్వేచ్ఛ, ఇంగ్లిష్‌ మీడియం, నాడు–నేడు, డిజిటల్‌ తరగతులు, బైజూస్‌ కంటెంట్, సీబీఎస్‌ఈ, కరిక్యులమ్‌లో మార్పులు, విద్యా దీవెన, వసతి దీవెన తదితర పథకాలు, కార్యక్రమాలు రాష్ట్రంలోని బాలికల్లో చదువుకోవాలన్న ఆలోచనను రెట్టింపు చేస్తున్నాయి. ఫలితంగా అమ్మాయిలందరూ బడిబాట పడుతున్నారు. పాఠశాలల స్థాయిలోనే ఆగిపోకుండా కళాశాలలో సైతం అడుగు పెడుతున్నారు. మంచి ఉద్యో­గమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. ప్రతి బాలిక కనీసం పదో తరగతి వరకు అయినా చదవాలన్న తపన, తాపత్రయంతో ప్రభుత్వం ‘కళ్యాణమస్తు’ కార్యక్రమానికి పదో తరగతి అర్హత పెట్టింది. ఇలా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అడుగడుగునా అండగా నిలవడంతో తల్లిదండ్రులు సైతం బాలికల చదువుకు ఊకొడుతున్నారు. ఫలితంగా ఏడాదికేడాది పాఠశాలలు, కళాశాలల్లో వీరి చేరికలు పెరుగుతున్నాయి.

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మూడున్నరేళ్లుగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రతి దశలోనూ అండగా నిలవడంతో విద్యా రంగంలో అమ్మాయిలు దూసు­కెళ్తున్నారు. ఒకప్పుడు చదువుల్లో వెనుకబడిన ఆడపిల్లలు నేడు అన్ని అడ్డంకులను అధిగమించి పోటాపోటీగా దూసుకుపోతున్నారు. తల్లిదండ్రులు కూడా బాలికల చదువులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. గతంలో యుక్త వయసు రాక ముందే ఆడ పిల్లల పెళ్లిళ్లపై దృష్టి సారించే తల్లిదండ్రులు.. నేడు ఆ ఆలోచనను వాయిదా వేసి, వారి చదు­వులపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు.

పాఠశాల స్థాయి నుంచి ఉన్నత చదువుల వరకు స్కూళ్లు, కాలేజీల్లో ఆడపిల్లల చేరికలు భారీగా పెరుగుతుండడమే ఇందుకు నిదర్శనం. ఇటీవల ప్రథమ్‌ స్వచ్ఛంద సంస్థ విడుదల చేసిన ఏన్యువల్‌ స్టాటస్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రిపోర్టు (అసర్‌), ఆలిండియా సర్వే ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ (ఐష్‌) నివేదికల్లోని గణాంకాలు ఈ విషయాలను వెల్లడిస్తున్నాయి. బాలికల చేరికల్లో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో మరింత అధికమని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి.

రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న అనేక విద్యాభివృద్ధి పథకాలు, కార్యక్రమాలతో తల్లిదండ్రులు ఆడపిల్లలను బడులకు పంపిస్తు­న్నారు. పాఠశాల స్థాయి అనంతరం.. ఇంటర్మీ­డి­యెట్‌ చదవులకు వీలుగా బాలికల కోసం ప్రతి మండలానికి రెండు జూనియర్‌ కాలేజీలను అందుబాటులోకి తెస్తోంది. ఉన్నత కోర్సుల్లో చేరే వారికి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంటుతోపాటు వసతి దీవెన కింద ఏటా రూ.20 వేల వరకు అందిస్తోంది. విద్యకు సంబంధించిన భారమంతా పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుండటంతో ఆడపిల్లల చేరికలు బాగా పెరిగాయి. 

ఏటా పెరుగుదల
రాష్ట్రంలో 2020–21లో టెన్త్‌లో 3,19,193 మంది బాలికలు ఉండగా, 2021–22లో వారిలో 2,37,530 (75 శాతం) మంది ఇంటర్‌లో చేరారు. అంతకు ముందు ఏడాది.. అంటే 2019–20లో టెన్త్‌లో 3,20,227 మంది ఉండగా, అందులో 2,24,943 (70 శాతం) మంది 2020–21లో ఇంటర్‌లో చేరినట్లు యూడైస్‌ గణాంకాలు వివరిస్తున్నాయి. ఏటేటా బాలికల చేరికల శాతం పెరుగుతోందనేందుకు ఈ గణాంకాలే తార్కాణం.

ఉత్తీర్ణతలోనూ బాలికలే పైచేయి సాధిస్తున్నారు. 2022 ఇంటర్‌ ఫలితాల్లో 68 శాతం మంది బాలికలు ఉత్తీర్ణులవ్వగా బాలురు 32 శాతమే ఉత్తీర్ణులయ్యారు. జాతీయ స్థాయితో పోల్చితే రాష్ట్రంలో బాలికల చేరికలు మరింత మెరుగ్గా ఉన్నాయి. జాతీయ స్థాయిలో బాలికల జీఈఆర్‌ పెరుగుదల 2.28 శాతం మాత్రమే ఉండగా రాష్ట్రంలో 11.03 శాతానికి పెరిగిందని ఐష్‌ గణాంకాలు చెబుతున్నాయి.

దేశ వ్యాప్తంగా తగ్గిన డ్రాపవుట్లు
గతంలో దేశ వ్యాప్తంగా చాలా కాలంగా 7 లేదా 8వ తరగతి తర్వాత ఆడపిల్లల డ్రాపవుట్లు చాలా ఎక్కువగా ఉండేవి. ఇటీవలి కాలంలో క్రమేణా ఆ పరిస్థితి మారుతోంది. 14–16 వయసు బాలికలు బడికి వెళ్లకుండా ఇంటిలోనే ఉండిపోయే వారి శాతం 2018 నాటికి 13.5 శాతం వరకు ఉన్నట్లు అసర్‌ గత నివేదికలు పేర్కొన్నాయి. అయితే ప్రస్తుతం ఆ శాతం 7.9 శాతానికి తగ్గినట్లు 2022 నివేదిక పేర్కొంది. 11 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న బాలికల్లో బడులకు వెళ్లని వారి శాతం 4.1 శాతం నుంచి 2 శాతానికి తగ్గినట్లు వెల్లడించింది. 

ఇంటర్‌లో పెరిగిన చేరికలు 
గతంలో టెన్త్‌ తర్వాత బాలికల చదువు ముందుకు సాగడానికి చాలా సమస్యలు ఉండేవి. అయితే కాలేజీల అందుబాటు, వివిధ వనరుల కల్పనతో భద్రతాపరమైన చర్యలు పెరగడం, తల్లిదండ్రులు కూడా పిల్లలను కాలేజీల్లో చేరేలా ప్రోత్సహిస్తుండడంతో హయ్యర్‌ సెకండరీ, ఇంటర్మీడియెట్‌ స్థాయిల్లోనూ బాలికల చేరికలు బాగా పెరిగాయి.

కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో విడుదల చేసే దేశ వ్యాప్త గణాంకాల ప్రకారం 2021–22లో పదో తరగతిలో 89,66,648 మంది బాలికలు ఉండగా.. ఇందులో ఇంటర్‌లో 73,36,609 (82 శాతం) మంది చేరారు. 2020–21 గణాంకాల ప్రకారం టెన్త్‌లో 91,64,940 మంది ఉండగా, వారిలో ఇంటర్‌లో 65,80,132 (72 శాతం) మంది చేరారు. అంటే పది శాతం మేర బాలికల చేరికలు పెరిగినట్లు యునిఫైడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ ప్లస్‌ – యూడైస్‌+ (యూడీఐఎస్‌+) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.


ఉన్నత విద్యలోనూ బాలికల పెరుగుదల 
► ఇంటర్మీడియెట్‌ అనంతరం ఉన్నత చదువుల్లోనూ బాలికల చేరికలు గణనీయంగా పెరుగుతున్నట్లు ఐష్‌ పేర్కొంది. 2020–21 నివేదిక ప్రకారం దేశ వ్యాప్తంగా ఉన్నత చదువుల్లో చేరికలు 2019–20లో 3.85 కోట్లు ఉండగా, 2020–21లో అది 4.13 కోట్లకు చేరినట్లు తెలిపింది. అంటే 28.80 లక్షల మంది పెరిగారు. 

► 2018–19లో 2.7 శాతం ఉండగా, 2019–20లో 3 శాతం మేర, 2020–21లో 7.4 శాతం మేర పెరిగాయని ఆ నివేదిక తెలిపింది. వీరిలో బాలికల చేరికలు 2019–20లో 1.89 కోట్లు కాగా, 2020–21లో 1.96 కోట్లుగా ఉంది. 2021–22, 2022–23 అధికారిక గణాంకాలు ఖరారైతే ఈ సంఖ్య మరింతగా పెరుగుతుంది.

► ఏపీ విషయానికి వస్తే యూడైస్‌ గణాంకాల ప్రకారం 2018–19లో టెన్త్‌ బాలికల్లో 70 శాతం మంది ఇంటర్‌ ఫస్టియర్లో చేరారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక 2019–20లో అమ్మ ఒడి తదితర కార్యక్రమాలతో 78 శాతం మంది ఇంటర్‌లో చేరారు.

► 2020–21లో కరోనా వంటి ప్రతికూల పరిస్థితుల్లో చేరికలు 70 శాతంగా ఉన్నా, మళ్లీ 2021–22 నాటికి బాలికల చేరికల శాతం 75 శాతానికి చేరుకుంది. ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఇంటర్‌లో బాలికల చేరికలు 2021–22లో ఏపీలో 75 శాతంగా ఉండగా బీహార్‌లో 56 శాతం, కర్ణాటకలో 73 శాతం, తెలంగాణలో 74 శాతంగా ఉన్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement