ఏఎన్‌యూ/సాక్షి, అమరావతి: నిరుద్యోగ రహిత ఆంధ్రప్రదేశ్ రూపకల్పనే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు చేపడుతున్నారని రాజ్యసభ సభ్యులు వి. విజయసాయిరెడ్డి అన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రెండ్రోజుల పాటు జరగనున్న జాబ్‌మేళాను గురువారం ఎంపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో యువకులందరికీ ఉపాధి అవకాశాలు కల్పించాలనే దృఢ నిశ్చయంతో సీఎం ముందుకు సాగుతున్నారన్నారు.
వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో గత ఏడాది నాలుగు ఉమ్మడి జిల్లాల్లో మెగా జాబ్‌మేళాలు నిర్వహించి నలభై వేల మందికి పైగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. త్వరలో ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో కలిసి మిగిలిన ఉమ్మడి జిల్లాల్లో కూడా వేర్వేరుగా మెగా జాబ్‌మేళాలు నిర్వహిస్తామని విజయసాయిరెడ్డి వివరించారు. వీటి ద్వారా అరవై నుంచి లక్ష మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించే చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
ఏపీలో సచివాలయ వ్యవస్థను ఏర్పాటుచేసి ప్రభుత్వ వ్యవస్థను సామాన్యుల చెంతకు చేర్చడంతోపాటు యువతకు సీఎం జగన్ లక్షలాది ఉద్యోగాలు కల్పించారన్నారు. జాబ్‌మేళా నిర్వహణ బృహత్తర కార్యక్రమమని తెలిపారు. ఏఎన్‌యూలో ఇంక్యుబేషన్ కేంద్రాల అభివృద్ధికి తన ఎంపీ నిధుల నుంచి రూ. 50 లక్షలు ఇస్తానని విజయసాయిరెడ్డి ప్రకటించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎవరైనా హాజరుకావొచ్చు
ఏఎన్‌యూ వీసీ ఆచార్య పి. రాజశేఖర్ మాట్లాడు తూ.. ఏఎన్‌యూలో అంతర్జాతీయ విద్య, పరిశోధనా ప్రమాణాలు ఉన్నాయన్నారు. వీటితోపాటు విద్యార్థులకు మంచి ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ జాబ్‌మేళా నిర్వహిస్తున్నామన్నారు. జాబ్‌మేళాకు రాష్ట్రవ్యాప్తంగా ఎవరైనా హాజరుకావచ్చన్నారు.
ఏఎన్‌యూ సెంటర్ ఫర్ హెచ్‌ఆర్డీ డైరెక్టర్ డాక్టర్ బి. నాగరాజు మాట్లాడుతూ.. చెన్నైకి చెందిన సిటిజన్ ఫర్ ఛేంజ్ ఇంటర్నేషనల్ సంస్థ సహకారంతో నిర్వహిస్తున్న ఈ జాబ్‌మేళాలో 75 సంస్థలు పాల్గొంటున్నాయని పది వేల మంది వరకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు. రెక్టార్ ఆచార్య వరప్రసాదమూర్తి, ఇన్‌చార్జి రిజి స్ట్రార్ ఆచార్య సునీత, వివిధ విభాగాల ప్రిన్సిపాళ్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఎల్లో మీడియా దుష్ప్రచారాల్ని తిప్పికొట్టాలి
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై కొన్ని మీడియా సంస్థలు, పత్రికలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టేందుకు వైఎస్సార్‌సీపీ న్యాయ విభాగం క్రియాశీలకంగా వ్యవహరించాలని రాష్ట్ర పార్టీ కోఆర్డీనేటర్, అనుబంధ విభాగాల ఇన్‌చార్జ్ విజయసాయిరెడ్డి కోరారు. పార్టీ పంచాయతీరాజ్, న్యాయ విభాగాల అధ్యక్షులు, జోనల్ ఇన్‌చార్‌్జలు, జిల్లా అధ్యక్షులు, రీజినల్, పార్లమెంటరీ పోలింగ్ బూత్ ఇన్‌చార్‌్జలతో తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వేర్వేరుగా ఆయన సమావేశమయ్యారు. న్యాయపరంగా ఎల్లో మీడియా తీరును సమర్ధవంతంగా తిప్పికొట్టాలని.. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment