సాక్షి, అమరావతి: జీపీఏ హోల్డర్ ఆదాయ పన్ను ఎగవేశారన్న కారణంతో అసలు యజమానికి చెందిన ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయడానికి నిరాకరించడం చట్ట విరుద్ధమని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ ఆస్తి జీపీఏ హోల్డర్‌ది కానప్పుడు రిజిస్ట్రేషన్‌కు నిరాకరించకూడదని చెప్పింది.
ఆ భూములు నిషేధిత భూముల జాబితా (సెక్షన్ 22ఏ)లో కూడా లేవని, అలాంటప్పుడు రిజిస్ట్రేషన్ చేయకపోవడం చట్ట విరుద్ధం, ఏకపక్ష నిర్ణయమని స్పష్టం చేసింది. పిటిషనర్లు సమర్పించిన డాక్యుమెంట్లను రిజిస్టర్ చేసి, విడుదల చేయాలని విశాఖపట్నం జిల్లా సబ్బవరం జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వడ్డిబోయన సుజాత ఇటీవల తీర్పు వెలువరించారు.
విశాఖ జిల్లా పెదగంట్యాడకు చెందిన జానపరెడ్డి వెంకట భారతి అనకాపల్లి జిల్లా రేబాకలో తనకున్న 2.50 ఎకరాలకు మర్రిపాలేనికి చెందిన నెట్టిమి ఉదయ భాస్కర్‌కు జీపీఏ ఇచ్చారు. ఈ భూమిలో 5,402 చదరపు గజాలు నీలంశెట్టి మల్లమ్మకు, 3,418 చదరపు గజాలు కోడూరు రూపకు 2014 సెప్టెంబర్‌లో జీపీఏ హోల్డర్ ద్వారా భారతి విక్రయించారు. అయితే సబ్బవరం జాయింట్ సబ్ రిజిస్ట్రార్ వారి డాక్యుమెంట్లను విడుదల చేయలేదు. దీంతో 2015 జూలైలో మల్లమ్మ, రూప జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఆ స్థలాల రిజిస్ట్రేషన్ నిలిపివేశామని, ఆదాయ పన్ను శాఖ ఆమోదం లభించిన తరువాతే రిజిస్ట్రేషన్ చేస్తామని సబ్ రిజిస్ట్రార్ వారికి లేఖల ద్వారా తెలిపారు. దీనిని సవాలు చేస్తూ రూప, మల్లమ్మ 2015లో హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ వి.సుజాత విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది ఎం.శివకుమార్ వాదనలు వినిపిస్తూ.. ఆదాయ పన్ను శాఖ జప్తు చేసిన ఉదయ భాస్కరరావు ఆస్తులు తాము కొన్న భూములు కూడా ఉన్నాయని తెలిపారు.
2014 సెప్టెంబరు 11న తాము రిజిస్ట్రేషన్ కోసం డాక్యుమెంట్లు సమర్పించగా, అధికారులు ఆ నెల 29న జప్తు ఉత్తర్వులు జారీ చేశారని వివరించారు. ఆదాయ పన్ను శాఖ జప్తు ఉత్తర్వుల కాల పరిమితి 2 సంవత్సరాలేనని, వాటిని అడ్డంపెట్టుకుని సబ్ రిజిస్ట్రార్ తమ డాక్యుమెంట్లను రిజిస్టర్ చేయకుండా అట్టిపెట్టుకోవడం చెల్లదన్నారు. ఆదాయ పన్ను శాఖ తరఫున సీనియర్ న్యాయవాది కె.రాజిరెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్లు కొన్న భూములు నిషేధిత జాబితాలో లేవని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.
Comments
Please login to add a commentAdd a comment