సాక్షి,అమరావతి: రానున్న 3-4 రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆగ్నేయ, నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురువనున్నట్లు విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు. 17 వరకు కోస్తా, రాయలసీమలో భారీవర్షాలు పడతాయని చెప్పారు.
ఆదివారం కోస్తాలో పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని, తీరం వెంబడి 40 నుండి 55 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించారు. అల్లూరి సీతారామ రాజు, ఏలూరు, చిత్తూరు, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో రానున్న మూడు గంటల వ్యవధిలో ఒకటి, రెండు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
భారీ వర్షాల కారణంగా 24 గంటలు విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తంగా ఉందని ఆర్పీ సిసోడియా తెలిపారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్,హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఏలూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి, పల్నాడు, శ్రీసత్యసాయి జిల్లాల కలెక్టర్లకు ముందస్తు చర్యలకు ఆదేశాలు జారీ చేశామని, మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని ఆర్పీ సిసోడియా విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment