సాక్షి, విజయవాడ: అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్ కేసులో చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు విచారణ ముగిసింది. మంగళవారం ఆరు గంటలపాటు విచారించిన ఏపీ సీఐడీ.. విచారణలో సహకరించకపోవడంతో మళ్లీ నోటీసులు జారీ చేసింది. రేపు కూడా విచారణకు రావాలంటూ ఆయన్ని అధికారులు నోటీసుల్లో కోరారు.
ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ కేసుకు సంబంధించి ఇవాళ నారా లోకేష్‌ను ఏపీ సీఐడీ అధికారులు 50 దాకా ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. అయితే ఇంటరాగేషన్‌లో లోకేష్ కీలక అంశాలకు సమాధానం ఇవ్వలేదు. చాలా ప్రశ్నలకు ఆయన నీళ్లు నమిలినట్లు సీఐడీ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఆరు గంటలపాటు సాగిన విచారణలో.. చాలా ప్రశ్నలకు లోకేష్ తెలియదనే సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. అంతేకాదు.. చాలా ప్రశ్నలకు ఆయన పదే పదే లాయర్ల దగ్గరికి వెళ్లినట్లు తెలుస్తోంది.
సీఐడీ విచారణలో.. హెరిటేజ్ బోర్డు మీటింగ్ నిర్ణయాలపై లోకేష్‌ను అధికారులు ప్రశ్నించగా.. తనకు తెలియదనే ఆయన సమాధానం ఇచ్చారు. దీంతో.. లోకేష్ హాజరై స్వయంగా సంతకాలు పెట్టిన డాక్యుమెంట్లు సీఐడీ అధికారులు చూపించడంతో ఆయన ఖంగుతిన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. హెరిటేజ్ భూములు ఆ ప్రాంతంలోనే ఎందుకు కొన్నారని సీఐడీ ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానం ఇచ్చారని, కీలక అంశాలపై దాటవేత ధోరణిని ప్రదర్శించారు కాబట్టే.. మరోసారి ఆయన్ని విచారించాల్సిన అవసరం ఉందని ఏపీ సీఐడీ వర్గాలు చెబుతున్నాయి.
హెరిటేజ్ సంస్థకు లబ్ధి చేకూరేలా ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్ మార్చారన్నది నారా లోకేష్‌పై ఉన్న ప్రధాన అభియోగం. లోకేశ్ పాత్రకు సంబంధించి కీలకమైన 129 ఆధారాలను ఏపీ సీఐడీ సిట్ బృందం గుర్తించి, జప్తు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కేసులో చంద్రబాబు నాయుడు ఏ1గా, మాజీ మంత్రి నారాయణ ఏ2గా, హెరిటేజ్ సంస్థ ఏ6గా, నారా లోకేష్‌ను ఏ14గా చేర్చింది ఏపీ సీఐడీ.
ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం లోకేష్ పిటిషన్ వేయగా.. ఏపీ హైకోర్టు దానిని కొట్టేసింది. విచారణకు సహకరించాలని లోకేష్‌కు సూచిస్తూనే.. మరోవైపు 41ఏ ప్రకారం నోటీసులు ఇవ్వాలని సీఐడీ పోలీసులకు తెలిపింది. దీంతో.. ఢిల్లీకి వెళ్లి మరీ లోకేష్‌ను నోటీసులు ఇచ్చి వచ్చారు. ఈ క్రమంలో కోర్టు నుంచి స్వల్ప ఊరట పొందిన లోకేష్‌ను ఇవాళ ఏపీ సీఐడీ విచారణ చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment