మూడు విభాగాల్లో పొందిన సర్టిఫికెట్లతో ఏపీఎండీసీ అధికారులు
సాక్షి, అమరావతి: ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ) అంతర్జాతీయంగా మూడు విభాగాల్లో ప్రతిష్టాత్మక ఐఎస్‌వో సర్టిఫికెట్లు సాధించింది. క్వాలిటీ మేనేజ్‌మెంట్ స్టాండర్డ్స్, హెల్త్ అండ్ సేఫ్టీ, పర్యావరణ పరిరక్షణ విభాగాల్లో సర్టిఫికేషన్ పొందింది. సంస్థ అనుసరిస్తున్న విధానాలను పరిశీలించాక అంతర్జాతీయ సంస్థ ఐఎస్‌వో ఈ సర్టిఫికెట్లను ప్రకటించింది. ఐఎస్‌వో ఏజెన్సింగ్ సంస్థ చీఫ్ ఆడిటర్ మురళీ బుధవారం విజయవాడలోని ఏపీఎండీసీ కార్యాలయంలో సంస్థ వైస్ చైర్మన్ అండ్ ఎండీ వీజీ వెంకటరెడ్డికి ఈ సర్టిఫికెట్లను అందించారు.
ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ సంస్థ ఆధ్వర్యంలో వెలికితీస్తున్న అత్యంత నాణ్యత గల బైరటీస్, గ్రానైట్ ఖనిజాలు యూరప్, అమెరికా దేశాలకు ఎగుమతి అవుతున్నాయన్నారు. తనిఖీ ల్యాబ్‌లతో పాటు థర్డ్ పార్టీ ల్యాబ్‌లలో కూడా ఖనిజ నాణ్యతను పరీక్షించాకే విక్రయిస్తున్నామని, అందువల్లే ఏపీఎండీసీ ఖనిజ ఉత్పత్తులకు ప్రపంచ దేశాల్లో డిమాండ్ మరింత పెరిగిందన్నారు. కేవలం మైనింగ్ వ్యాపార కార్యకలాపాలకే పరిమితం కాకుండా పర్యావరణ పరిరక్షణకు, ప్రకృతి సమతుల్యతను కాపాడేందుకు ఏపీఎండీసీ కృషి చేస్తోందని వెంకటరెడ్డి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment