శ్రీశైలం నుంచి కృష్ణమ్మ ఉరకలు  | Krishna river water towards Nagarjunasagar Ambati Rambabu | Sakshi
Sakshi News home page

శ్రీశైలం నుంచి కృష్ణమ్మ ఉరకలు 

Published Sun, Jul 24 2022 3:47 AM | Last Updated on Sun, Jul 24 2022 7:34 AM

Krishna river water towards Nagarjunasagar Ambati Rambabu - Sakshi

శ్రీశైలం డ్యామ్‌ మూడు గేట్ల ద్వారా నాగార్జునసాగర్‌కు విడుదలవుతున్న నీరు

సాక్షి, అమరావతి / శ్రీశైలం ప్రాజెక్ట్‌ :  నాగార్జునసాగర్‌ వైపు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. శనివారం సాయంత్రం 6 గంటలకు 1,15,389 క్యూసెక్కులు చేరుతుండటంతో సాగర్‌లో నీటి నిల్వ 539.3 అడుగుల్లో 186.87 టీఎంసీలకు చేరుకుంది.  శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకోవడం.. ఎగువ నుంచి వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతుండటంతో శనివారం ఉదయం 11 గంటలకు జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డిలు మూడు గేట్లను పది మీటర్ల మేర ఎత్తి 80 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు.

గతేడాది కంటే ఈ ఏడాది ఐదు రోజుల ముందే శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తేయడం గమనార్హం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వరుసగా నాలుగో ఏటా శ్రీశైలం గేట్లు ఎత్తడం గమనార్హం. గత పుష్కర కాలంలో వరుసగా నాలుగేళ్లు శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తేయడం ఇదే ప్రథమం. శనివారం సాయంత్రానికి ఎగువ నుంచి శ్రీశైలానికి వచ్చే వరద ప్రవాహం తగ్గడంతో ఒక గేటును మూసి వేసి.. రెండు గేట్లను పది మీటర్ల మేర ఎత్తి 53,580 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.

శనివారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 1,21,893 క్యూసెక్కులు చేరుతుండగా.. కుడి గట్టు కేంద్రంలో ఏపీ జెన్‌కో విద్యుదుత్పత్తి చేస్తూ 26,273 క్యూసెక్కులు, ఎడమగట్టు కేంద్రంలో తెలంగాణ జెన్‌కో విద్యుదుత్పత్తి చేస్తూ 31,784 క్యూసెక్కులను.. మొత్తంగా 1,11,637 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా 17 వేలు, హంద్రీ–నీవా ద్వారా 1,013 వెరసి 18,013 క్యూసెక్కులు ఏపీ తరలిస్తుండగా.. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 800 క్యూసెక్కులను తెలంగాణ తరలిస్తోంది. ప్రస్తుతం శ్రీశైలంలో 882.20 అడుగుల్లో 201.19 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 

నారాయణపూర్‌ డ్యామ్‌ గేట్లు మూత  
పశ్చిమ కనుమల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఎగువన కృష్ణా ప్రధాన పాయపై ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్‌ డ్యామ్‌లు.. ప్రధాన ఉప నది తుంగభద్రపై ఉన్న తుంగభద్ర డ్యామ్‌లోకి చేరుతున్న వరద తగ్గిపోయింది. దాంతో శనివారం సాయంత్రం ఆల్మట్టి, నారాయణపూర్‌ డ్యామ్‌ల గేట్లు మూసేశారు. తుంగభద్ర డ్యామ్‌ నుంచి 23,844 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం శ్రీశైలానికి వచ్చే వరద ప్రవాహం మరింతగా తగ్గనుంది. 882 అడుగుల్లో నీటిని స్థిరంగా నిల్వ చేస్తూ.. అదనంగా ఉన్న జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు.  

సాగర్‌ దిగువన కృష్ణమ్మ పరవళ్లు  
సాగర్‌కు దిగువన కురిసిన వర్షాల వల్ల మూసీ నుంచి కృష్ణాలోకి చేరుతున్న 6,150 క్యూసెక్కులు పులిచింతల్లోకి వెళుతున్నాయి. దాంతో పులిచింతల్లో నీటి నిల్వ 38.18 టీఎంసీలకు చేరింది.  పులిచింతలకు దిగువన పరీవాహక ప్రాంతంలో కురిసిన వర్షాల వల్ల మున్నేరు, కట్టలేరు వంటి వాగులు, వంకల ద్వారా కృష్ణా నదిలోకి 23,464 క్యూసెక్కుల నీరు చేరుతోంది. ఆ ప్రవాహం ప్రకాశం బ్యారేజ్‌కు చేరుతుండటంతో కృష్ణా డెల్టాకు 6,706 క్యూసెక్కులు వదులుతూ, మిగులుగా ఉన్న 16,758 క్యూసెక్కులను గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు.  

పోలవరం జాప్యం పాపం చంద్రబాబుదే   
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యానికి చంద్రబాబే కారణమని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాçఫర్‌ డ్యామ్‌ నిర్మాణం చేపట్టకుండానే పోలవరం ప్రాజెక్ట్‌కు డయాఫ్రమ్‌ వాల్‌ కట్టిన ఘనత మేధావినని చెప్పుకునే చంద్రబాబుదేనన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన పోలవరం తప్పిదాలను సరిచేస్తున్నామని తెలిపారు.
మాట్లాడుతున్న మంత్రి అంబటి రాంబాబు, చిత్రంలో ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి  

పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలం తదితర ప్రాంతాల్లోని గ్రామాలు మునిగిపోతున్నాయని తెలంగాణలో కొందరు అనవసర ఆందోళనకు తెరలేపారని, ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. చంద్రబాబు వరద ప్రాంతాల్లో పర్యటన.. ఎన్నికల ప్రచారాన్ని తలపిస్తోందని ఎద్దేవా చేశారు. ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డిలు మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక వరుసగా నాలుగుసార్లు శ్రీశైలం డ్యామ్‌ గేట్లు తెరవడం సంతోషంగా ఉందన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement