
కడప: పేదలకు ప్రభుత్వం అందించే పథకాలను అవహేళన చేసినవారే, వాటిని మరింతగా పెంచి పేదలకు అందిస్తామని పోటీ పడడం విడ్డూరంగా వుందని సి. ఆర్. మీడియా అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు అన్నారు. కడప జిల్లాలో వై.ఎస్. ఆర్ ఇంటలెక్ట్యువల్ ఫోరం ఆధ్వర్యంలో “సు పరిపాలన దిశగా ఆంధ్రప్రదేశ్ రూపాంతరం” అంశంపై బుధవారం జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదల కోసం పనిచేసే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పేదలు బాసటగా నిలవాలని ఆయన అన్నారు. పేదలకు పెత్తందార్లకు మధ్య జరిగే ఈ సంఘర్షణలో పేదల ప్రభుత్వానిదే పై చేయి కావాలని ఆయన ఆకాంక్షించారు.
ప్రజలకు అవసరమైన సేవలు సత్వరమే వారి ఇంటివద్దనే అందించే వాలంటీర్ల వ్యవస్థను కేరళ వంటి ఎన్నో రాష్ట్రాలు అనుసరించేందుకు అధ్యయనం చేస్తున్నాయని ఆయన అన్నారు. పాఠశాలలు నాడు- నేడు పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు. రైతుభరోసా కేంద్రాలను దేశ, విదేశీ సంస్థలు ప్రశంసిస్తున్నాయని ఆయన అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు వరద నియంత్రణలో కూడ పత్రికలు పక్షపాతధోరణిలో వ్వహరిస్తుండడం శోచనీయమన్నారు.
వరదల్లో 20 మంది పైనే మరణించిన రాష్ట్రం కంటే మనరాష్ట్రంలో అల్లకల్లోల పరిస్థితులు ఏమున్నాయని ఆయన ప్రశ్నించారు. పత్రికల్లో వచ్చిన వార్తలలోని వాస్తవాలను ఒకటికి రెండుసార్లు చదివి నిర్ధారించుకోవాలని ఆయన సూచించారు. పోలవరం వంటి ప్రాజెక్టులను కట్టేందుకు వై.ఎస్.రాజశేఖర రెడ్డి ప్రాధాన్యం ఇస్తే, చంద్రబాబు చెక్ డాంలు, ఇంకుడు గుంతలు కట్టేందుకు ప్రాధాన్యం ఇచ్చేవారన్నారు. సమావేశానికి వై.ఎస్.ఆర్ ఇంటలెక్ట్యువల్ ఫోరం రాయలసీమ కన్వీనర్, చిన్నపరెడ్డి అధ్యక్షత వహించారు. ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు శాంతమూర్తి, మహిళా విభాగం కన్వీనర్ రత్న కుమారి, యోగి వేమన యూనివర్సిటీ ప్రొఫెసర్ డా. వై. ఈశ్వర రెడ్డి, అధికార భాషా సంఘం సభ్యులు తవ్వా వెంకటయ్య, గౌతం సుబ్బారెడ్డి, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు రాఘవ రెడ్డి, డ్వాక్రా సంఘాల రిసోర్స్ పర్సన్లు శ్రీమతి చైతల్య, శ్రీదేవి, వై.ఎస్. ఆర్. వైద్య విభాగం అధ్యక్షులు వెంగళరెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.