చంద్రబాబూ.. ఈ ప్రశ్నలకు సమాధానం ఏది? | KSR Comments On Chandrababu Naidu Immoral Rule In Andhra Pradesh, More Details Inside | Sakshi
Sakshi News home page

చంద్రబాబూ.. ఈ ప్రశ్నలకు సమాధానం ఏది?

Published Sat, Aug 24 2024 3:14 PM | Last Updated on Sat, Aug 24 2024 5:50 PM

Ksr Comments On Chandrababus Immoral Rule In Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది అనైతిక ప్రభుత్వం అని, అన్యాయ పాలన చేస్తున్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన ఉదాహరణలు గమనించదగిన అంశాలే. గత రెండున్నర నెలల తన పాలనపై వస్తున్న విమర్శలకు చంద్రబాబు సూటిగా జవాబు ఇవ్వలేకపోతున్నారు. మరో వైపు ఎంత సేపు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతున్నారు.

ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా? లేదా? అన్న అనుమానం కలిగేలా పరిస్థితి ఏర్పడడం అత్యంత శోచనీయం. చంద్రబాబు పాలన ఏ ఏ రకాలుగా అనైతికంగా ఉందన్నది పరిశీలిస్తే పలు విషయాలు బోధపడతాయి. తాను ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల గురించి  కాని, ఎన్నికల ప్రణాళికలోని ఇతర వాగ్దానాల గురించి కాని ప్రస్తావించలేని నిస్సహాయ స్థితిలో చంద్రబాబు, ఆయన పార్టనర్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ ఉన్నారు. తమ వాగ్దానాలు తమనే భయపెడుతున్నాయని చంద్రబాబు అంటున్నారు. అదేమంటే గత ప్రభుత్వం చేసిన పాలన అని ప్రచారం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు ఇప్పుడు కొత్తగా ఆరోపణలు చేయడం లేదు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏవైతే విమర్శలు చేశారో, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అవే అభియోగాలు కొనసాగిస్తున్నారు. దానిని బట్టే చంద్రబాబు అనైతిక పాలన సాగిస్తున్నారన్న విషయం అర్ధం అవుతుంది. ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.14లక్షల కోట్ల అప్పు చేసిందని ఆరోపించేవారు. అది పచ్చి అబద్దం. అంత అప్పు నిజంగా ఉంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఏమి చేయాలి. దానికి తగ్గటుగా చేయగలిగిన హామీలనే ఇవ్వాలి. అలాకాకుండా టీడీపీ, జనసేనలు ఆకాశమే  హద్దుగా ఎన్నికల వరాలు కురిపించాయి. అదేమని అడిగితే, తాము సంపద సృష్టిస్తామని, తద్వారా హామీలు నెరవేర్చుతామని బడాయి కబుర్లు చెప్పేవారు. ఎలాగైతేనేం అధికారంలోకి వచ్చారు. అది ఈవిఎమ్‌ల మహిమా? లేక ప్రజలు నిజంగా ఈ వాగ్దానాలకు ఆకర్షితులయ్యారా అన్నది వేరే సంగతి.. పవర్ చేతికి రాగానే చంద్రబాబు, పవన్‌లు స్వరం మార్చేశారు.

హామీలు అమలు చేయాలని ఉంది కాని, డబ్బులు లేవని చెప్పడం ఆరంభించారు. అలాంటప్పుడు చంద్రబాబుది అనైతిక పాలన కాక ఏమవుతుంది? జగన్ చేసిన ఆరోపణ వాస్తవికంగానే ఉందని అనుకోవల్సిందే కదా! టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీలో హింస, రాజకీయ ప్రత్యర్ధులపై దమనకాండ, హత్యలు గతంలో ఎన్నడూ చూడనివి. ఈ హింసాకాండను చంద్రబాబు నేరుగా ఇంతవరకు ఖండించలేదు. తన కుమారుడి రెడ్‌బుక్ రాజ్యాంగం గురించి ఆయనే మాట్లాడలేకపోతున్నారు. పైగా పోలీసు అధికారుల సమావేశంలో మాత్రం నేరం చేయాలంటే ఎవరైనా  సరే భయపడాల్సిందేనని చంద్రబాబు అన్నారట.

తెలుగుదేశం అధికార పత్రిక ఈనాడు ఈ హెడింగ్ పెట్టి ఆనందపడింది. చంద్రబాబు వాస్తవంగా అలాంటి ఉద్దేశంతో ఉంటే ఏమి చేయాలి! టీడీపీ కార్యకర్తలు ఎవరూ హింసాకాండకు దిగరాదని పిలుపు ఇవ్వాలి. టీడీపీ వాళ్లు తప్పు చేసినా చర్య తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వాలి. విశేషం ఏమిటంటే ఆయన ఈ కబుర్లు చెప్పిన ముందు రోజే తాడిపత్రిలో టీడీపీ కార్యకర్తలు దారుణమైన హింసకు తెగబడ్డారు. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానివ్వబోమంటూ నానా రచ్చ చేశారు. మాజీ ఎమ్మెల్యేనే ఆయన ఇంటికి ఆయన వెళ్లలేని పరిస్థితి ఉంటే సామాన్యుల గతి ఏమిటి? కేవలం తన అనుకూల మీడియాలో ప్రచారం చేసుకోవడానికి డైలాగులు చెబుతూ, లోపల మాత్రం హింస, దౌర్జన్యాలను ప్రోత్సహించే విధంగా వ్యవహరించడం అనైతికం కాదా! అందువల్ల జగన్ చెప్పినట్లు చంద్రబాబు పాలన అనైతికమే అవుతుంది.

గతంలో చంద్రబాబు అనపర్తి వద్ద టూర్‌కు వెళ్లారు. అక్కడి శాంతిభద్రతల రీత్యా పోలీసు అధికారులు ఆయనను వద్దని సూచించారు. కాని చంద్రబాబు వినకుండా, తాను నడిచి వెళతానని అంటూ టీడీపీ కార్యకర్తలను రెచ్చగొడుతూ వెళ్లారు. పోలీసులు ఆయన భద్రత కల్పించారు తప్ప, అడ్డుకోలేదు. కుప్పం నియోజకవర్గంలో కూడా ఒకసారి ఇలాంటి సమస్య వస్తే పోలీసుల అభిప్రాయాన్ని పట్టించుకోకుండా చంద్రబాబు వ్యవహరించారు. అప్పుడు కూడా పోలీసులు ఆయనకు రక్షణ కల్పించారు. మరి ఇప్పుడేమో మాజీ ఎమ్మెల్యే తన ఇంటికి వెళ్లడానికి వీలు లేదని టీడీపీ వారు అరాచకంగా వ్యవహరించడం, పోలీసులు ఆయనను అక్కడ నుంచి అనంతపురం తరలించడం చేశారు.

అల్లర్లు చేసేవారిని కట్టడి చేయడంలో పోలీసులు విఫలం అయ్యారు. అందువల్ల చంద్రబాబుది అనైతిక పాలనే అవుతుంది కదా! సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన పోస్టు చూడడం జరిగింది. అందులో పలు విషయాలు గుర్తు చేశారు..'ఈ ఏడాది తల్లికి వందనం ఇవ్వలేం అని మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు. ఖజానాలో డబ్బు లేదు.. అమరావతి కట్టలేం.. మంత్రి నారాయణ, ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం లేదు - మంత్రి నాదెండ్ల మనోహర్, ఆరోగ్యశ్రీ ఇవ్వలేం.. ఆయుష్మాన్ భారత్ కార్డు తెచ్చుకోండి.. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, తమ వద్ద మంత్ర దండం లేదు.. పవన్ కల్యాణ్‌, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చూస్తేనే భయం వేస్తోంది.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు .. ఇలా ఆయా నేతలు చేస్తున్న వ్యాఖ్యలు గమనిస్తే ఏపీలో సాగుతున్నది అనైతిక పాలనే అన్న భావన కలుగుతుంది.

ఇక ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు ఇస్తామన్న హామీ ఊసే లేదు. ఏపీలో ఇటీవలికాలంలో అనేక హత్యలు, అత్యాచారాలు జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. జగన్ ప్రభుత్వం చేపట్టిన ఓడరేవుల నిర్మాణం ఎలా సాగుతుందో తెలియదు. మెడికల్ కాలేజీల నిర్మాణం ఆగిపోయింది. పైగా వాటిని ప్రైవేటు పరం చేయాలని తలపెట్టారు. గతంలో కొన్ని మెడికల్ సీట్లనే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లుగా మార్చాలని జగన్ ప్రభుత్వం ఆలోచిస్తే విరుచుకుపడ్డ చంద్రబాబు, లోకేష్‌లు ఇప్పుడు ఏకంగా మెడికల్ కాలేజీలనే ప్రైవేటుపరం చేయాలని చూస్తున్నారు. వలంటీర్ల వ్యవస్థపై ఎన్నికల ప్రణాళికలో ఏమి చెప్పారు? ఇప్పుడు ఏమి చేస్తున్నారు? పదివేల రూపాయల గౌరవ వేతనం హుష కాకి అయింది. గ్రామ, వార్డు  సచివాలయ వ్యవస్థలు గందరగోళంలో పడ్డాయి. ఇళ్ల వద్దకు పౌర సేవలను జగన్ ప్రభుత్వం అందిస్తే, ఇప్పుడు మళ్లీ యధాప్రకారం ఆఫీస్‌ల చుట్టూ తిరిగే వాతావరణాన్ని చంద్రబాబు ప్రభుత్వం సృష్టించింది.

గతంలో రేషన్ సరుకులను కూడా ఇళ్లకే చేర్చితే, ఆ వాహనాలన్నిటిని తొలగించారు. భారీ ఎత్తున ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు, అదికారంలోకి వచ్చిన తర్వాత లక్షల మంది వలంటీర్లు, రేషన్ వాహనాల యజమానులు, కొన్ని శాఖలలోని చిరుద్యోగులు మొదలైనవారందరిని వీధుల పాలు చేశారన్న విమర్శను ఎదుర్కుంటున్నారు. తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్ధికి పదిహేనువేల రూపాయల చొప్పున ఇస్తామని హోరెత్తించిన కూటమి నేతలు, ఇప్పుడు ఆ ప్రస్తావనే తేకుండా గడుపుతున్నారు. పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచడం, అన్నా క్యాంటిన్లు మినహా ఒక్క హామీ అమలు చేయని ప్రభుత్వం అనైతిక ప్రభుత్వం కాక మరేమి అవుతుంది.

అన్ని హామీలు ఒక్కసారే అమలు చేయలేకపోవచ్చు. కాని ఇచ్చిన హామీలకు వ్యతిరేకంగా మాట్లాడడం అనైతికమే. కనీసం ఏ హామీ ఎప్పుడు అమలు చేస్తామో చెప్పకపోగా, వాటిని చూస్తేనే భయం వేస్తోందని, గత ప్రభుత్వ వైఫల్యం అంటూ వైఎస్సార్సీపీపై తమ తప్పులను నెట్టివేయడం చూస్తే ఇదేనా చంద్రబాబు అనుభవం అన్నప్రశ్న వస్తుంది. సెల్ఫ్ ఫైనాన్స్ ద్వారా అమరావతి నిర్మిస్తామని, సంపద సృష్టించి సూపర్ సిక్స్ అమలు చేస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాదించిన చంద్రబాబు ప్రస్తుతం అమరావతి పేరుతో ఏకంగా పదిహేనువేల కోట్ల రూపాయల అప్పు తీసుకురాబోతుండడం అనైతికమా? కాదా? మొత్తం అంత డబ్బు మళ్లీ ఒకే చోట ఖర్చు చేసి, ప్రాంతీయ అసమానలతకు బీజం వేయడం కూడా విమర్శలకు దారి తీస్తోంది.

జగన్ 2019లో తాను ఇచ్చిన హామీలకు ఒక ప్రణాళిక రూపొందించి వాటిని అమలు చేస్తే, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం అసలు వాగ్దానాలను పట్టించుకోవడం లేదు. పైగా కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు ఈ వాగ్దానాలను నెరవేర్చవలసిన అవసరం లేదని బహిరంగంగానే చెబుతున్నారు. ఈ వాగ్దానాలను అమలు చేయకపోయినా, నిత్యం వచ్చే ఆదాయం ఏమవుతోందో తెలియదు కాని, అప్పులు మాత్రం వేల కోట్లు చేస్తున్నారు. ఇవన్ని గమనిస్తే, జగన్ చెప్పినట్లు చంద్రబాబుది అనైతిక పాలనే అన్న భావన ప్రజలలో కూడా ఏర్పడుతోంది.


– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement