సాక్షి, అమరావతి: గురువులు కన్నా గూగుల్ మేలని తాను అనలేదని, తాను అలా అన్నట్టు వచ్చిన వార్తలను ఖండిస్తున్నానని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. ఒంగోలులో ఉపాధ్యాయ దినోత్సవ సభలో తాను మాట్లాడింది ఒకటైతే.. మీడియా దానిని వక్రీకరించి ఉపాధ్యాయ లోకానికి తప్పుడు సంకేతాలు పంపి తనపై వ్యక్తిగత దాడికి దిగే ప్రయత్నం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
తాను ఉపాధ్యాయుడిగా ఉండాలని గర్వపడతానని అదే సభలో మాట్లాడింది వినిపించలేదా.. అని ప్రశ్నించారు. మారుతున్న కాలానికనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని, ఇంటర్నెట్ సౌలభ్యంతో సమాచారం అంతా దొరుకుతున్న ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ నిత్య విద్యార్థులే అనే ఉద్దేశంలో తాను మాట్లాడినట్టు తెలిపారు. టెక్నాలజీ పెరిగిపోయి మారిన కాలానికి అనువుగా సమాచారాన్ని గూగుల్ తల్లిని అడిగి తెలుసుకున్నానన్నారు.
గూగుల్‌ను సృష్టించింది కూడా గురువులే కదా.. అని ఆయన ప్రశ్నించారు. తాను గురువులను కించపరిచేలా మాట్లాడలేదని, తన తల్లిదండ్రులు ఇద్దరూ ఉపాధ్యాయులని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వం పైన, తనపైన.. మరీ ముఖ్యంగా వ్యక్తిగతంగా తనపై ఎల్లో మీడియా బురద జల్లుతోందని, దీనిని నమ్మొద్దని ఉపాధ్యాయులను కోరారు. అనని మాటలను వక్రీకరించి పత్రికల్లో ప్రచురించుకునే సంస్కృతి మంచిది కాదని మంత్రి సురేష్ హితవు పలికారు.
చదవండి: ఐటీ నోటీసులు: అరెస్టు.. పదేళ్ల జైలు!
Comments
Please login to add a commentAdd a comment