వివరాలు వెల్లడిస్తున్న మంత్రి బొత్స
సాక్షి, అమరావతి: బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన టీచర్ అభ్యర్థుల ఉత్కంఠకు తెరదించుతూ డీఎస్సీ 2024 నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. డీఎస్సీ అర్హతలు, భర్తీ ప్రక్రియకు సంబంధించిన జీవోలు 11,12లతో పాటు వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెస్తూ సోమవారం వెలగపూడిలోని సచివాలయంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. వెనువెంటనే ఆన్‌లైన్‌లో దరఖాస్తులు, ఫీజు చెల్లింపు ప్రక్రియను ప్రారంభించారు. 2022 తర్వాత బీఈడీ, డీఈడీ పూర్తిచేసిన అభ్యర్థులకు కూడా మేలు జరిగేలా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహణకు నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే.
డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా 6,100 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. డీఎస్సీ దరఖాస్తు ఫీజు రూ.750గా నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రభుత్వ యాజమాన్యాల కింద ఉన్న జిల్లా, మండల పరిషత్, మున్సిపల్, ఏపీ మోడల్ స్కూల్స్, ఏపీ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ(గురుకులం), ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ (ఆశ్రమ్), ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ, మహాత్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సొసైటీల కింద పని చేస్తున్న విద్యాసంస్థల్లోని ఖాళీలన్నిటినీ భర్తీ చేయనున్నట్టు మంత్రి బొత్స తెలిపారు.
ఈ ఏడాది ఏప్రిల్ నాటికి ఖాళీ అయ్యే ఉపాధ్యాయ పోస్టులను సైతం డీఎస్సీ 2024 ద్వారా భర్తీ చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. అంతేకాకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంతో ఏ ఏడాది ఖాళీలను ఆ ఏడాదే భర్తీ చేస్తామని తెలిపారు.
2018 నిబంధనలే అమలు
డీఎస్సీ 2024లో ఎలాంటి కొత్త నిబంధనలు లేవని, 2018 డీఎస్సీ నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధివిధానాలు, అర్హతలనే ఖరారు చేశామని మంత్రి బొత్స తెలిపారు. ఇందులో ఎలాంటి మార్పు లేదనే విషయాన్ని గుర్తించాలని కోరారు. జనరల్ అభ్యర్థులకు ఈ ఏడాది జూలై 1 నాటికి 44 సంవత్సరాలు లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్లు్యఎస్ అభ్యర్థులకు 49 ఏళ్లు, దివ్యాంగులకు 54 ఏళ్లు గరిష్ట వయోపరిమితి విధించారు. డీఎస్సీ ఎంపికలో టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్‌కు 80 శాతం, ఏపీ టెట్/సీటెట్‌కు 20 శాతం మార్కులు వెయిటేజీ ఉంటుందన్నారు.
ఆన్‌లైన్‌లో జరిగే టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్టీ)కు రాష్ట్రవ్యాప్తంగా 122 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. నోటిఫికేషన్ వెలువడిన రోజు నుంచి ఫిబ్రవరి 21 వరకు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించవచ్చని, ఈనెల 22 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించామని వివరించారు. మార్చి 15 నుంచి 30వతేదీ వరకు రెండు సెషన్స్‌లో టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ నిర్వహిస్తామన్నారు.
మొదటి సెషన్ ఉదయం 9.30 నుంచి 12 వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో జరుగుతుంది. పండుగలు, ప్రభుత్వ సెలవు దినాలు, ఏపీపీఎస్సీ పరీక్షలు జరిగే తేదీలను మినహాయించి షెడ్యూల్ ఖరారు చేశామన్నారు. డీఎస్సీ 2024కు సంబంధించి ఫిర్యాదుల స్వీకరణ, సందేహాల నివృత్తికి పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌లో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను అందుబాటులోకి తెచ్చామని మంత్రి తెలిపారు.
అర్హతలు, నియామకాలపై జీవోలు
డీఎస్సీ 2024 విద్యార్హతలు, నియామకాలకు సంబంధించి వేర్వేరుగా జీఓలు విడుదల చేసినట్లు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ తెలిపారు. జీవో నం.11లో ఉపాధ్యాయ నియామక వివరాలు, జీవో నం.12లో అభ్యర్థుల అర్హతలకు సంబంధించిన వివరాలను పొందుపరిచామన్నారు. మార్చి 5వ తేదీ నుంచి అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ సూచించారు. రాష్ట్రంలో రోజుకు సగటున 40 వేల మంది అభ్యర్థులు ఆన్‌లైన్‌లో పరీక్షలు రాసేందుకు వీలుగా సదుపాయాలు ఉన్నట్లు తెలిపారు.
ఇప్పటికే 122 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, అందిన దరఖాస్తుల ఆధారంగా మిగతా కేంద్రాల సంఖ్యను నిర్ణయిస్తామని వెల్లడించారు. కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ (9505619127, 9705655349) ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పనిచేస్తుందని, అవసరమైన వారు ఈ సేవలు వినియోగించుకోవచ్చని సూచించారు. సమావేశంలో ఇంటర్ బోర్డు కమిషనర్ సౌరభ్ గౌర్, పాఠశాలల మౌలిక సదుపాయాల విభాగం కమిషనర్ కె.భాస్కర్, సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు, మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్ శోభిత, ఇతర విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment