తండ్రి కోసం తల్లడిల్లిపోతున్న చిన్నారులు
భర్త ఆచూకీ తెలియక ఆందోళనలో నందిని
వరదలో చిక్కుకొని కనిపించకుండాపోయిన శేఖర్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ‘నాన్న ఎక్కడికి వెళ్లాడమ్మా? ఎప్పుడు వస్తాడమ్మా? చెప్పమ్మా?’ అంటూ చిన్నారులు తల్లడిల్లిపోతుండగా.. భర్త ఏమయ్యాడో.. ఎక్కడ ఉన్నాడో.. పిల్లలకు ఏం జవాబు చెప్పాలో తెలియని స్థితిలో విజయవాడ ఊరి్మళానగర్‌కు చెందిన పాయల నందిని ఆందోళన చెందుతోంది. వరద వచ్చినప్పటి నుంచి భర్త ఆచూకీ తెలియక కన్నీరుమున్నీరవుతోంది. ఊర్మిళానగర్‌లోని రెడ్డి కాలనీకి చెందిన పాయల శేఖర్, నందిని దంపతులకు పిల్లలు మధుప్రియ(4), చైత్రిక (2) ఉన్నారు. శేఖర్ తాపీమేస్త్రీగా పనిచేస్తుంటాడు. ఆదివారం ఉదయం బుడమేరు వరద పెరుగుతుందని తెలియడంతో శేఖర్ తన భార్య, ఇద్దరు పిల్లలను సమీపంలోని తన చెల్లెలి ఇంటికి తీసుకెళ్లి వదిలిపెట్టాడు.
తన వద్ద పనిచేసే వారి సాయంతో ఇంట్లోని వస్తువులను బయటకు చేర్చాడు. వరద ప్రవాహం పెరుగుతుండటంతో వెంటనే భవానీపురం పోలీస్ కాలనీలో తాను పనిచేసే ప్రాంతానికి వెళ్లాడు. మంగళవారం తెల్లవారుజాము వరకు అక్కడే ఉన్నాడు. మంగళవారం ఉదయం పది గంటల సమయంలో చెల్లెలికి ఫోన్ చేసి.. ‘వరద ఎక్కువగా ఉంది. నాకు కొంచెం భయంగా ఉంది. వరద తగ్గాక వస్తా’ అని చెప్పాడు. చెల్లెలి భర్తకు ఫోన్ చేసి.. తన కాలికి గాజు పెంకులు గుచ్చుకున్నాయని వాపోయాడు.
ఆ తర్వాత శేఖర్ ఫోన్ స్విచాఫ్ అయ్యింది. అప్పటి నుంచి శేఖర్ ఆచూకీ తెలియకపోవడంతో అతని భార్య నందిని, పిల్లలు రోదిస్తున్నారు. ‘వారం రోజులు గడిచిపోయింది. నగరంలోని అన్ని ప్రాంతాలూ తిరిగాం. ప్రభుత్వాసుపత్రి మార్చురీకి రోజూ వెళ్తున్నాం. ఎక్కడ గుర్తు తెలియని శవం ఉందని చెబితే అక్కడి వెళ్లి చూసి వస్తున్నాం. మా అన్న అసలు ఉన్నాడో.. లేడో అని ఆందోళనగా ఉంది’ అంటూ శేఖర్ చెల్లెలు భారతి కన్నీరుమున్నీరయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment