నిజాలు దాచి దర్యాప్తా? | Mp Avinash Reddy Sensational Comments On Cbi Over Ys Bhaskar Reddy Arrest | Sakshi
Sakshi News home page

ఫ్యాక్ట్‌ టార్గెట్‌ ఇన్వెస్టిగేషన్‌ కావాలి..మీడియాతో కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి

Published Mon, Apr 17 2023 1:41 AM | Last Updated on Mon, Apr 17 2023 2:43 PM

Mp Avinash Reddy Sensational Comments On Cbi Over Ys Bhaskar Reddy Arrest  - Sakshi

సాక్షి, పులివెందుల: ‘అత్యున్నత స్థాయి విచారణ సంస్థ దిగజారి ప్రవర్తిస్తోంది. కీలక అంశాలను మ­రు­గు పరుస్తూ, సిల్లీ అంశాల ఆధారంగా విచారణ చేస్తోంది. పర్సన్‌ టార్గెట్‌ ఇన్వెస్టిగేషన్‌ కాదు.. ఫ్యాక్ట్‌ టార్గెట్‌ ఇన్వెస్టిగేషన్‌ చేయాలని సీబీఐ డైరెక్టర్, డీఐజీ, కొత్తగా నియమితులైన ఇన్వెస్టి­గేషన్‌ ఆఫీసర్‌ను కలిసి అభ్యర్థించినా ఆ దిశగా కనీస విచారణ చేపట్టలేదు’ అని కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్‌ అవినాశ్‌రెడ్డి అన్నారు. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు ఆదివారం పులివెందులలో ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డిని అరెస్ట్‌ చేసిన నేపథ్యంలో ఎంపీ మీడియాతో మాట్లాడారు.

తన తండ్రిని ఊహించని విధంగా అరెస్టు చేశారని, మాటలు రానంత బాధగా ఉందన్నారు. వ్యతిరేక శక్తులు, వ్యతిరేక మీడియాతో పోరాటం చేయడంలో నిజాయితీ నిరూపించుకోవడం సవాల్‌గా నిలుస్తోందని చెప్పారు. సీబీఐ కీలక అంశాలను డౌన్‌ప్లే చేసి, సిల్లీ అంశాల ఆధారంగా ఎందుకు విచారణ కొనసాగిస్తోందో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మునుపటి అధికారి చేసిన రోల్‌ కంటిన్యూ చేయడం మినహా విచారణలో ప్ర«ధాన కోణం వెలుగు చూడడం లేదన్నారు. ఇలా అవినాశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడిన కొద్ది గంటలకే సోమవారం మరోమారు విచారణకు హాజరు కావాలంటూ సీబీఐ నోటీసులు ఇవ్వడం గమనార్హం. అవినాష్‌రెడ్డి విలేకరులతో మాట్లాడిన అంశాలు ఇంకా ఇలా ఉన్నాయి.  

డెత్‌ నోట్‌ దాచి పెట్టింది అల్లుడే.. 

♦వైఎస్‌ వివేకానందరెడ్డిది హత్య అని తెలిసీ, డెత్‌ నోట్‌ చదివి వినిపించిన పీఏ కృష్ణారెడ్డితో దానిని ఎవరికీ చూపించకుండా దాచి పెట్టమని అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఆదేశించారు. ఆ మేరకు కృష్ణారెడ్డి ఆయన చెప్పినట్లే చేశారు. వాస్తవాలు చెప్పకుండా ఘటనా స్థలం వద్దకు నన్ను వెళ్లమని నర్రెడ్డి శివప్రకాష్‌రెడ్డి ఫోన్‌లో కోరారు.

♦నేను అక్కడికి వెళ్లి చూశాక ముందుగా పోలీసులకు సమాచారం ఇచ్చాను. హత్య విషయం నా కంటే గంట ముందుగా వివేకా అల్లుడికి తెలుసు. పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిన ఆయన విషయాన్ని దాచారు. వివేకా హత్య విషయాన్ని ముందుగా పోలీసులకు తెలిపింది నేనే. సీఐ శంకరయ్యకు స్వయంగా మూడు సార్లు ఫోన్‌ చేశాను. 35 నిమిషాల తర్వాత సీఐ వచ్చారు. పోలీసులకు సమాచారం ఇచ్చిన నన్నే దోషిగా చూపిస్తున్నారు. 

♦ఆ రోజు జమ్మలమడుగుకు వెళ్తున్న నాకు ఫోన్‌ రావడంతో కృష్ణాలయం సమీపం నుంచి వెనుతిరిగి వచ్చాను. నేనొక్కడినే కాకుండా, నాతో పాటు నాలుగు వాహనాలు ఉన్నాయి. మీరు చెబుతున్న గూగుల్‌ టేకౌట్‌ ద్వారా పరిశీలించుకోండి. వాస్తవమో కాదో తెలుస్తుంది. 

డాక్యుమెంట్లు చోరీకి గురయ్యాయి..

♦ఏ–4 దస్తగిరి అప్రూవర్‌గా ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో వివేకా హత్య అనంతరం స్టాంప్డ్‌ డాక్యుమెంట్లు తీసుకున్న తర్వాతే ఇంట్లో నుంచి బయటికి వచ్చినట్లు చెప్పాడు. దీనిని బట్టి డాక్యుమెంట్లు దొంగిలించారని స్పష్టం అవుతోంది. అలాంటప్పుడు దొంగతనానికి చెందిన సెక్షన్లు సీబీఐ ఎందుకు పెట్టలేదు?

♦తన ఐడియా ప్రకారమే డెత్‌నోట్‌లో డ్రైవర్‌ ప్రసాద్‌ పేరు రాయించానని దస్తగిరి చెబుతున్నాడు. దస్తగిరి చంపి, సంబంధం లేని వారిపై ఆరోపణలు చేస్తున్నాడు. ఆ మేరకు ఉన్న ఐపీసీ సెక్షన్లు ఎందుకు పెట్టలేదు? మరోవైపు వాచ్‌మెన్‌ రంగన్న స్టేట్‌మెంట్‌లో హత్యలో పాల్గొన్న నలుగురి పేర్లతో సహా చెబుతారు. అయినా నిందితుల్లో ఒకరిని సాక్షిగా పరిగణనలోకి తీసుకుంటారు. ఇవన్నీ చూస్తే కలిసికట్టుగా పద్ధతి ప్రకారం విచారణ సాగుతోందని అర్థమవుతోంది. 

♦ఏప్రిల్‌ 3న రిజిస్టర్‌ పోస్టు ద్వారా సీబీఐ డైరెక్టర్, డీఐజీ, ప్రస్తుత ఐఓకు పలు వివరాలు ఆధారాలతో పంపించాను. 5వ తేదీ మనిషి ద్వారా కూడా వారికి చేర్చాను. ఏమాత్రం మార్పు లేదు. బెంగళూరు సెటిల్‌మెంట్‌లో రూ.8 కోట్లు రావాల్సి ఉండగా, ఆ డబ్బులో సగం ఇవ్వాలని డిమాండ్‌ చేసిన తర్వాత జరిగిన  ఘర్షణలో చంపినట్లు దస్తగిరి చెబుతాడు. 

♦వాస్తవంలో అవి ఫేక్‌ డాక్యుమెంట్లు అని తేలిపోయింది. అసలే రాని, లేని డబ్బు కోసం గొడవ జరుగుతుందా? ఇలాంటి ప్రశ్నలను ఎందుకు సీబీఐ ఛేదించడం లేదు? డాక్యుమెంట్లు తీసుకెళ్లామని దస్తగిరి చెబుతున్నాడు.. ఆ డాక్యుమెంట్లను ఎందుకు రికవరీ చేయలేదు? అందులో ఏముంది? అన్న విషయాలను పరిగణనలోకి తీసుకోకపోవడం ఆశ్చర్యకరం. 

సునీతక్క వర్షన్‌ సడన్‌గా మారింది

♦ 2019 మార్చి 15న హత్య జరిగితే, టీడీపీ నేతల ఆరోపణల నేపథ్యంలో వైఎస్‌ కుటుంబం ఔన్నత్యాన్ని సునీతక్క స్పష్టంగా వివరించింది. సీఎంగా వైఎస్‌ జగనన్నను, ఎంపీగా నన్ను చేసుకోవాలని కొద్ది నెలలుగా వైఎస్‌ వివేకానందరెడ్డి తపన పడ్డారని ఆమె స్పష్టంగా తెలిపింది. ఒక సంవత్సరం వరకూ బాగా మాట్లాడేది. ఎర్రగంగిరెడ్డి వైఖరిపై నా అభిప్రాయం కూడా కోరింది. చెప్పాను. సడన్‌గా వైఖరి మార్చుకొని ఢిల్లీకి వెళ్లి ప్రెస్‌మీట్‌ పెట్టి ఆరోపణలు చేసింది. కారణమేంటో సునీతక్కే చెప్పాలి.

♦హత్యలో స్వయంగా పాల్గొన్నానని చెప్పిన దస్తగిరి ముందస్తు బెయిల్‌ కోసం సీబీఐ నో అబ్జక్షన్‌ చెబుతోంది. రెండేళ్లుగా కోర్టులో ఎవరు బెయిల్‌ పిటిషన్‌ వేసినా ఇంప్లీడ్‌ అయ్యే సునీతమ్మ, దస్తగిరి ముందస్తు బెయిల్‌కు మాత్రం అభ్యంతరం చెప్పరు. ఆ తర్వాత అప్రూవర్‌ అనే అబద్ధాల కట్టడం వెలుగులోకి వచ్చింది.

♦అప్రూవర్‌గా మారితే కేసు విచారణ పూర్తయ్యే వరకు లోపల ఉండాల్సి వస్తుంది కాబట్టి ముందస్తు బెయిల్‌కు అభ్యంతరం చెప్పడం లేదు. అటు సీబీఐ, ఇటు సునీతమ్మ కలిసికట్టుగా ప్రణాళిక బద్ధంగా కేసును పక్కదాది పట్టిస్తున్నారని స్పష్టంగా అర్థం అవుతోంది.

మేము ఏ తప్పూ చేయలేదు

♦మా నాన్న 40 ఏళ్లుగా మీ అందరికీ తెలుసు. మా మనస్తత్వాలు తెలుసు. నా నిజాయితే నన్ను గెలిపిస్తోంది. వివేకం సార్‌ హత్యలో ప్రత్యక్షంగా, పరోక్షంగా మేము ఇసుమంతైనా తప్పు చేయలేదు. ఎల్లో మీడియా విష ప్రచారాలను నమ్మొద్దు. 

♦2009 నుంచి నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను. తొలుత లింగాల మండలం ఇన్‌ఛార్జిగా పని చేశా. పదేళ్లుగా నేనేంటో అందరికీ తెలుసు. ఈ 3650 రోజుల్లో 1500 రోజులు ఉదయ్‌కుమార్‌రెడ్డి నాతో కలిసి ఉంటాడు. కానీ ఆ రోజు ఉదయమే వచ్చినట్లు చెబుతున్నారు. ఇంకో విషయం.. థర్డ్‌ పర్సన్‌ ఫోన్‌ కోసం నేను వెయిట్‌ చేసినట్లు మరో విషయాన్ని చెబుతున్నారు. అదే వాస్తవమైతే నేనే అక్కడికి ఎవర్నో పంపించి ఫోన్‌ చేయించుకునే వాడిని కదా.. చాలా సిల్లీ థింగ్స్‌ ఆధారంగా విచారణ చేస్తున్నారు.  

♦విచారణలో సీబీఐ కీలక విషయాలను వదిలేసింది. అప్రూవర్‌ అనే అబద్దాల కట్టడం కోర్టులో నిలిచే అవకాశమే లేదు. మాకు పదవులపై వ్యామోహం లేదు. న్యాయస్థానాలపై నమ్మకం ఉంది. వ్యవస్థలపై గౌరవం ఉంది. న్యాయం కోసం పోరాటం చేస్తాం. వ్యక్తి టార్గెట్‌గా చేస్తున్న విచారణలో తుదకు న్యాయమే గెలుస్తుంది.

కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి సీబీఐ నోటీసులు 

సాక్షి ప్రతినిధి కడప : కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా ఆదివారం ఉదయం వైఎస్‌ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్‌ అవినాష్‌రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఇప్పటికే సీబీఐ అధికారులు పలుమార్లు ఆయన్ను విచారించిన విషయం తెలిసిందే. తాజాగా సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాదులోని సీబీఐ కార్యాలయంలో మరోసారి విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement