CM Jagan: పేదల ఇళ్ల నిర్మాణానికి రూ.16,927 కోట్లు  | Purchase of land required for providing house sites | Sakshi
Sakshi News home page

పేదల ఇళ్ల నిర్మాణానికి రూ.16,927 కోట్లు 

Published Tue, Jan 23 2024 5:37 AM | Last Updated on Tue, Jan 23 2024 7:45 AM

Purchase of land required for providing house sites - Sakshi

31 లక్షల పేద అక్కచెల్లెమ్మలకు స్వగృహయోగం రాష్ట్రవ్యాప్తంగా 17,005 జగనన్న కాలనీలు.. 31.19 లక్షల మంది అక్కచెల్లెమ్మల పేరిట  ఉచితంగా ఇళ్ల స్థలాలు.. వారు ఇళ్లు  కట్టుకోవడానికి ఒక్కొక్కరికి రూ.2.70 లక్షలు సాయం.. నిరుపేదల సొంతింటి కలను  సాకారం చేస్తూ ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం ద్వారా ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేస్తున్న మేలు ఇది. – సాక్షి, అమరావతి 

ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి కావాల్సిన భూమి కొనుగోలుకు భారీ ఎత్తున ప్రభుత్వం వ్యయం చేసింది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చాక 2019 నుంచి ఇప్పటివరకు వారి ఇళ్ల నిర్మాణానికి ఏకంగా రూ.16,927.16 కోట్లు ఖర్చు చేసింది. ఈ వ్యయాలు కాకుండా కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి మరింత ఖర్చు పెట్టనుంది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా పేదింటి అక్కచెల్లెమ్మలను లక్షాధికారులను చేస్తూ కనిష్టంగా 1.50 లక్షల కోట్ల నుంచి గరిష్టంగా రూ.3 లక్షల కోట్ల సంపదను వారి చేతుల్లో ప్రభుత్వం పెడుతోంది. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇప్పటివరకు పేదలకు ఇంత పెద్ద ఎత్తున స్థలాలు, ఇళ్లు ఇచ్చిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. 

ఆర్థిక సాయంతోపాటు నిర్మాణ సామగ్రిపై సబ్సిడీ 
2019లో అధికారంలోకి వచ్చాక నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద ఇళ్ల నిర్మాణాల కోసమే ఇప్పటివరకు ఏకంగా రూ.16,927.16 కోట్లు ఖర్చు చేశారు. ఈ నిధులతో లబ్దిదారులకు చకచకా ఇంటి బిల్లులను చెల్లించారు. అంతేకాకుండా 4.70 లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా సిమెంట్, 33 వేల టన్నులకుపైగా స్టీల్, ఇతర నిర్మాణ సామగ్రిని సబ్సిడీపై సరఫరా చేశారు.

ఉచితంగా స్థలం ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణం కోసం యూనిట్‌కు రూ.1.80 లక్షలు ప్రభుత్వం ఇస్తోంది. పావలా వడ్డీకి రూ.35 వేలు చొప్పున బ్యాంక్‌ రుణాన్ని సమకూరుస్తోంది. బ్యాంక్‌లు 9 నుంచి 11 శాతం వడ్డీకి రుణాలు ఇస్తుండగా లబ్దిదారులు పావలా వడ్డీనే కడుతున్నారు. మిగిలిన వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తోంది. అంతేకాకుండా రూ.15 వేల విలువ చేసే ఇసుకను ఉచితంగా అందిస్తోంది. స్టీల్, సిమెంట్, ఇలా 12 రకాల నిర్మాణ సామగ్రిని సబ్సిడీపై సరఫరా చేయడం ద్వారా మరో రూ.40 వేలు చొప్పున మేలు చేస్తోంది.

రూ.20 లక్షల విలువైన ఆస్తి
ఇంటి స్థలం, ఇల్లు రూపంలో రూ.20 లక్షలు, అంత­కంటే విలువైన స్థిరాస్తిని అక్కచెల్లెమ్మల పేరిట ప్ర­భుత్వం అందిస్తోంది. తద్వారా పేదింటి మహిళల­ను లక్షాధికారులుగా మారుస్తోంది. ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన స్థలాల విలువ.. ప్రాంతాన్ని బట్టి రూ.2.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ మార్కె­ట్‌లో పలుకుతోంది. ఇంటి నిర్మా­ణం కూడా పూర్తయితే ఆ ఆస్తి విలువ కనీసం రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షలు, అంతకు పైమాటే.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement