ఆర్‌సీ రెడ్డి విజయగాథ | RC Reddy IAS Study Circle Ramachandra Reddy Success Story | Sakshi
Sakshi News home page

విఫలమైనా ఆయన విజేతే

Published Tue, Aug 11 2020 11:08 AM | Last Updated on Tue, Aug 11 2020 11:17 AM

RC Reddy IAS Study Circle Ramachandra Reddy Success Story - Sakshi

ఫైల్‌ ఫోటో

ఆయన సివిల్‌ సర్వీసుకు ఎంపిక కాలేదు. కష్టపడి మూడు పర్యాయాలూ ప్రయత్నించి విఫలమయ్యారు. కానీ ఆ వైఫల్యం నుంచి ఆయన పాఠం నేర్చుకున్నారు. ఏ రంగంలో విఫలమయ్యారో అదే రంగంలో విజయముద్ర వేసుకున్నారు. ఎందరో సివిల్‌ సర్వీసుకు ఎంపిక కావడానికి కారణమయ్యారు. విజయబాట వేశారు. కాదు..విజయబావుటా ఎగురవేశారు..ఆయనే ఏడు పదులు దాటిన ఆర్‌సీ రెడ్డి..స్ఫూర్తిదాయకమైన ఆయన జీవిత విశేషాలు ఒకసారి పరికిద్దామా..

రాజంపేట: వైఎస్సార్‌ జిల్లా నందలూరు మండలంలోని ఓ మారు పల్లె. పేరు ఈదరపల్లె.. ఆ ఊరికి సర్పంచ్‌గా పనిచేసిన భూమన మల్లారెడ్డి కుమారుడు రామచంద్రారెడ్డి(ఆర్‌సీ రెడ్డి). ఆ ఊరిలోనే ప్రాథమిక విద్య చదివారు. తర్వాత రాజంపేట మండలం గుండూర్లు వెళ్లి కొంతకాలం చదివారు. నందలూరులోని జిల్లా ప్రజాపరిషత్‌ స్కూలులో స్‌ఎల్‌ఎల్‌సీ (ఇప్పటి టెన్తు క్లాస్‌) ఉత్తీర్ణులయ్యారు. సైన్స్‌మీద మక్కువతో కడప వెళ్లి ఆర్ట్స్‌ కళాశాలలో బీఎస్సీ చదివారు. ప్రతి క్లాసులోనూ మంచి మార్కులే వచ్చేవి. ఆయన ఆటల్లోనూ దిట్ట. ఎస్వీ యూనివర్శిటీలో హకీ క్రీడాకారుడిగా గుర్తింపు సాధించారు. చదువుతున్నప్పటి నుంచి ఉన్నత స్థానం చేరుకోవాలని ఆర్‌సీ రెడ్డి అభిలషించేవారు.

ముఖ్యంగా ఐఏఎస్‌ కావాలని ఎక్కువగా పరితపించేవారు. ఇదే ఆకాంక్షను తన తల్లిదండ్రులు మల్లారెడ్డి..భవానమ్మల వద్ద వ్యక్తంచేశారు. వారు కూడా వెంటనే వెన్నుతట్టి ప్రోత్సహించారు. వెంటనే ఆర్‌సీ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. రావూస్‌ స్టడీ సర్కిల్‌లో చేరారు. కష్టపడి చదివారు. సివిల్‌ సర్వీసు పరీక్ష మూడు సార్లు రాశారు. ఈ మూడు ప్రయత్నాలూ విఫలమయ్యాయి. దీంతో కుంగుబాటు..నిరాశలను దరిచేరనీయకుండా తనకున్న ఆంగ్ల పరిజ్జానంతో కొద్దికాలం ఇంగ్లీషు మ్యాగ్‌జైన్‌లో జర్నలిస్టుగా పనిచేశారు. తర్వాత హైదరాబాద్‌ వచ్చేశారు. తాను ఢిల్లీలో శిక్షణ పొందిన రావూస్‌ ప్రొద్బలంలో హైదరాబాద్‌లోని అదే శిక్షణా సంస్థ శాఖకు ఎండీగా పనిచేశారు.

బలమైన సంకల్పంతో..
రావూస్‌లో చేస్తున్నా ఆయన మస్తిష్కంలో సివిల్‌ సర్వీసెస్‌ ఆలోచన నిరంతరం వెంటాడేది. పల్లె నేపథ్యంలో తనలాగే వచ్చిన వారికి తర్ఫీదునిస్తే కొందరయినా సివిల్స్‌కు ఎంపికవుతారని భావించేవారు. మట్టిలో మాణిక్యాలను తవ్వి తీయాలని బలమైన సంకల్పం తీసుకున్నారు. తనకున్న అనుభవసారంతో సివిల్‌ సర్వీస్‌కు వెళ్లే అభ్యర్థులకు కోచింగ్‌ ఇవ్వాలనుకున్నారు. 1985లో సాహసంతో ఓ ముందడుగు వేశారు. హైదరాబాద్‌లో స్వయంగా ఐఏఎస్‌ స్టడీ సర్కిల్‌ పేరుతో చిన్నగా సివిల్‌ సర్వీసెస్‌ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తనతోపాటు మంచి ఫ్యాకల్టీని ఎంపిక చేసుకున్నారు. నెమ్మది నెమ్మదిగా ఆసంస్థకు పేరు వచ్చింది. ఏటా సివిల్‌ సర్వీస్‌ ఫలితాల్లో కొందరు విజేతలవడం ప్రారంభమైంది. దీంతో ఆర్‌సీ రెడ్డికి విశేష ఖ్యాతి లభించింది.

ఆయన వద్ద కోచింగ్‌ తీసుకుని సివిల్‌ సర్వీసుకు ఎంపికైన ప్రముఖుల్లో ఏకెఖాన్, తేజ్‌దీప్‌ ప్రతిహస్త, ద్వారకతిరుమలరావు, రాజేందర్‌రెడ్డి తోపాటు ఇప్పుడు రాష్ట్రంలో సీనియర్‌ ఐఏఎస్‌లుగా ఉన్న కృష్ణబాబు, ధనుంజయరెడ్డి లాంటి వారున్నారు. 2001లో ఇండియా టాపర్‌ సత్యప్రకాశ్‌(రాజంపేట) ఆర్‌సీరెడ్డి మార్గదర్శకంలోనే శిక్షణ పొందడం విశేషం. ఇలా సివిల్‌ సర్వీసుకు ఎంపికైన వారిని తయారు చేసే ఆర్‌సీరెడ్డి తమ ప్రాంతానికి చెందిన వారేనని ఇక్కడి వారు ఆనందపడుతుంటారు. నందలూరుకు చెందిన ఇద్దరు ఇప్పటివరకూ సివిల్‌ సర్వీసుకు ఎంపికయ్యారంటే ఆయన ప్రేరణే.

గడచిన మూడు దశాబ్ధాలలో ఈ సంస్థలో తర్ఫీదు పొంది 135 మంది ఐఏఎస్, 23 మంది ఐఎఫ్‌ఎస్, 142 ఐపీఎస్, 643 మంది సెంట్రల్‌ సర్వీసెస్‌లకు ఎంపికైనట్లు సంస్థ వర్గాలు చెప్పాయి. తాజాగా విడుదలైన సివిల్స్‌ ఫలితాల్లో 14మంది విజేతలుగా నిలిచారు. ఆర్సీ రెడ్డికి ఇద్దరు కుమార్తెలు. అమెరికాలో ఉంటున్నారు. భార్య విద్యావేత్తగా పనిచేసి రిటైరయ్యారు. ఆర్‌సీ రెడ్డి తమకు స్ఫూర్తి అని రాజంపేట పరిసర ప్రాంత యువకులు చెబుతుంటారు. ఆయన ఇక్కడి కార్యక్రమాలకు హాజరై అందరినీ పలకరించి వెళ్తుంటారు. 

సానపడితే వజ్రాలే.. 
పల్లెటూళ్ల నుంచి వచ్చారని తక్కువ అంచనా వేయకూడదు. మట్టిలోనే మాణిక్యాలు ఉంటాయి. వారిని గుర్తించి సానబడితే వజ్రాలవుతారు. ఐక్యూ గుర్తించి, సరైన మార్గంలో తర్ఫీదు ఇస్తే వారు తప్పకుండా సివిల్స్‌ లాంటి రంగాల్లో విజేతలుగా నిలుస్తారు. ఆరంభంలోనే మెరుగైన రీతిలో సాధన పెట్టాలి. అప్పుడే మంచి ఫలితాలు ఆవిష్కృతమవుతాయి. నేను సివిల్స్‌కు ఎంపిక కాలేకపోయినా ఇదే భావనతో సివిల్స్‌.. గ్రూప్‌వన్‌ సర్వీసులకు కొంతమందిని అందించగలుగుతున్నాను. ఇది పూర్వజన్మసుకృతంగా భావిస్తుంటాను. 
– భూమన రామచంద్రారెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement