లబ్బీపేట (విజయవాడతూర్పు): వైద్య రంగంలో రాష్ట్రప్రభుత్వం అవలంభిస్తున్న విప్లవాత్మక విధానాలతో సత్ఫలితాలొస్తున్నాయని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ స్పష్టం చేశారు. వైద్య సేవలనే కాకుండా, వైద్య విద్యను సైతం అందరికీ చేరువ చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విజ్ఞాన విశ్వ విద్యాలయం 26వ స్నాతకోత్సవాలు మంగళవారం ఘనంగా జరిగాయి.
విజయవాడ నగరంలోని ఓ ప్రైవేటు హాలులో జరిగిన వేడుకల్లో యూనివర్సిటీ చాన్సలర్ హోదాలో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యఅతిథిగా బెంగళూరుకు చెందిన నిమ్‌హాన్స్ డైరెక్టర్ డాక్టర్ ప్రతిమా మూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెకు యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. అంతేకాకుండా 60 మంది విద్యార్థులకు మెడల్స్ అందజేశారు.
గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్య సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనకు కృషి చేస్తున్నదని తెలిపారు. సమాజంలో వైద్య రంగానికి ప్రత్యేక గుర్తింపు ఉందని, నిరుపేదలకు ఉపయోగపడేలా సేవాభావంతో వైద్యం చేయాలన్నారు.
ఆరోగ్యశ్రీ సేవలకు అందలం
రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలను ప్రభుత్వం మరింత విస్తరించిందన్నారు. ఆ పథకంలో చికిత్సల పరిమితిని రూ.25 లక్షలకు పెంచడంతో పాటు, 3,257 వైద్య ప్రక్రియలతో సహా, అన్ని రకాల క్యాన్సర్ వ్యాధులకు ఎలాంటి వ్యయ పరిమితి లేకుండా ఉచితంగా చికిత్స అందించడం శుభపరిణామమన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో 53,126 మంది వైద్య సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. రాష్ట్రంలో గతంలో ఉన్న 11 వైద్య కళాశాలలకు అదనంగా 17 కొత్త మెడికల్ కళాశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.
ఇప్పటికే ఐదు మెడికల్ కళాశాలల్లో కోర్సులు ప్రారంభమైనట్లు తెలిపారు. రాష్ట్రంలో 10,132 విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, 1,142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 177 కమ్యునిటీ హెల్త్ సెంటర్లు, 53 ఏరియా ఆస్పత్రులు, 12 జిల్లా ఆస్పత్రులు, 11 టీచింగ్ ఆస్పత్రులు, 15 స్పెషాలిటీ ఆస్పత్రులు, 542 యూపీహెచ్‌సీలు రోగుల ఆరోగ్యానికి భద్రత ఇస్తున్నట్లు చెప్పారు. ముఖ్యఅతిథి నిమ్‌హాన్స్ డైరెక్టర్ డాక్టర్ ప్రతిమామూర్తి మాట్లాడుతూ ఆరోగ్యకరమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
వైద్యులు నిత్య విద్యార్థిగా ఉండాలని సూచించారు. యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ కె.బాబ్జి, రిజిస్ట్రార్ డాక్టర్ వి.రాధికారెడ్డి, అకడమిక్ జాయింట్ రిజిస్ట్రార్ అజయ, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ సుమిత శంకర్, జాయింట్ రిజిస్ట్రార్ (ఎగ్జామినేషన్స్) పి.ప్రవీణ్‌కుమార్, యూనివర్సిటీ సభ్యులు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి, సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కంచర్ల సుధాకర్, పూర్వ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి.శ్యామ్‌ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment