రాజ్యాంగ స్ఫూర్తితో చరిత్రాత్మక పాలన   | Governor Justice Abdul Nazir on Republic Day | Sakshi
Sakshi News home page

రాజ్యాంగ స్ఫూర్తితో చరిత్రాత్మక పాలన  

Published Sat, Jan 27 2024 4:28 AM | Last Updated on Sat, Jan 27 2024 2:46 PM

Governor Justice Abdul Nazir on Republic Day - Sakshi

మా ప్రభుత్వం మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లా భావిస్తూ 99.5 శాతం హామీలను అమలు చేసింది. కులమతాలు, ప్రాంతాలు, రాజకీయ వివక్ష లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలను అందిస్తూ మన రాష్ట్రాన్ని దేశంలో ప్రత్యేకంగా నిలిపింది. విజయవాడ నడిబొడ్డున 206 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటుతో మా ప్రభుత్వం సామాజిక న్యాయ సాధనను పునరుద్ఘాటించింది. సామాజిక సాధికారత నినాదం కాదు.. మార్గదర్శక విధానమని నిరూపించింది.   – గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌

సాక్షి, అమరావతి:  రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తితో సంక్షేమ ప్రగతి దిశగా పయణిస్తోందని గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ పేర్కొన్నారు. గత 56 నెలలుగా లౌకిక, ప్రజాస్వామిక, గణతంత్ర విలువలను ప్రతిబింబిస్తూ పాలన సాగిస్తోందన్నారు. అణగారిన వర్గాల్లో ఆనందాన్ని నింపడమే లక్ష్యంగా మారుమూల ప్రాంతాలకూ అభివృద్ధి ఫలాలను చేరవేస్తున్నట్లు చెప్పారు. సచివాలయాల వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే పౌర సేవలను చేర్చి గ్రామ స్వరాజ్య భావనకు జీవం పోశామన్నారు. ఇప్పటివరకు డీబీటీ ద్వారా రూ.2,52,943.48 కోట్లు, నాన్‌–డీబీటీ ద్వారా మరో రూ.1,68,151.08 కోట్లు కలిపి మొత్తం రూ.4,21,094.56 కోట్ల మేర ప్రజలకు ప్రయోజనం చేకూర్చినట్లు తెలిపారు.

సంక్షేమంతో పాటు సామాజిక విప్లవాన్ని తెస్తూ నామినేటెడ్‌ పనులు, పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ,  బీసీ మైనార్టీలతో పాటు మహిళలకు ప్రత్యేకంగా 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం చట్టం చేసిందన్నారు. విద్య, వైద్య రంగాల్లో చరిత్రాత్మక మార్పులు తెచ్చిందని చెప్పారు. పుష్కలమైన వనరులు, అపార అవకాశాలతో ఏపీ పారిశ్రామికవేత్తలకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారిందన్నారు.

యువత నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా నిరుద్యోగం రేటు వేగంగా తగ్గిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు జీవనాధారమైన పోలవరం ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యంగా పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. శుక్రవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు గవర్నర్‌ నజీర్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.    

గ్రామ స్వరాజ్యం సాకారం.. 
రాష్ట్రంలో 15,004 గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా గొప్ప పాలన సంస్కరణలు తెచ్చాం. 540కిపైగా ప్రభుత్వ సేవలు ప్రజల ఇంటి వద్దే అందుతున్నాయి. సొంత ఊరిలోనే యువతకు 1.35 లక్షలకుపైగా శాశ్వత ఉద్యోగాలు, 2.66 లక్షల మందికి వలంటీర్లుగా పని చేసే అవకాశం దక్కింది. 9,260 ఎండీయూలతో ఇంటి వద్దకే రేషన్‌ పంపిణీ జరుగుతుండగా వలంటీర్ల ద్వారా ప్రతి నెలా 1వ తేదీనే లబ్ధిదారులకు ఇంటి వద్దే పింఛన్లు అందిస్తున్నాం.

రూ.3 వేలు చొప్పున సామాజిక పింఛన్లు అందిస్తూ ఏపీ దేశానికే రోల్‌మోడల్‌గా నిలుస్తోంది. ప్రతి నెలా 66.34 లక్షల మంది లబ్దిదారులకు రూ.1,968 కోట్లు అందిస్తోంది. గత 56 నెలల్లో సామాజిక భద్రతా పింఛన్ల కోసమే రూ. 84,731 కోట్లు ఖర్చు చేసింది. జగనన్న సురక్ష ద్వారా కోటి సర్టిఫికెట్లను పౌరులకు ఉచితంగా అందచేసింది.  

ప్రపంచ స్థాయి విద్య.. 
మన విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దుతోంది. జగనన్న అమ్మ ఒడి కింద ఏడాదికి రూ.15 వేల చొప్పున 44 లక్షల మంది తల్లులకు రూ.26,067 కోట్లు అందించాం. ఆంగ్ల మాధ్యమం, డిజిటల్‌ బోధనా పద్ధతులను ప్రవేశపెడుతూ నాడు–నేడు ద్వారా రూ.17,805 కోట్లతో 56,703 ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరించాం. రూ.2,400 విలువైన జగనన్న విద్యాకానుక కిట్లను ఉచితంగా అందిస్తున్నాం. దీని కోసం ఇప్పటి వరకు రూ.3367 కోట్లు ఖర్చు చేశాం. విద్యార్థులకు రోజుకో మెనూతో పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం రూ.4,417 కోట్లు వ్యయం చేసింది.

జగనన్న విద్యాదీవెన కింద 26,98,728 మంది లబ్దిదారులకు రూ.11,901 కోట్ల పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించగా వసతి దీవెన కింద 25,17,245 మంది లబ్ధిదారులకు రూ.4,276 కోట్ల మేర ప్రయోజనం చేకూరింది. జగనన్న విదేశీ విద్యా దీవెన కింద ప్రపంచ అగ్రశ్రేణి విద్యాసంస్థల్లో మన విద్యార్థులు ఉచితంగా చదువుకునేందుకు రూ.107.08 కోట్లు వెచ్చించింది.

పేద విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్య అందించేందుకు ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం, సీబీఎస్‌ఈ సిలబస్‌తో పాటు ఇంటర్నేషనల్‌ బాకలారియేట్‌ (ఐబీ) వైపు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 8వ తరగతి నుంచి విద్యార్థులకు బైజూస్‌ కంటెంట్‌తో ట్యాబ్‌ల పంపిణీకి రూ.1,306 కోట్లు ఖర్చు చేసింది. 62 వేలకు ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెల్స్, 45 వేల స్మార్ట్‌ టీవీలను సమకూర్చింది. ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పెంపొందించేందుకు టోఫెల్‌కు సన్నద్ధం చేస్తూ శిక్షణ అందిస్తోంది.   

ఉన్నత విద్యలో సమున్నతం.. 
అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఆన్‌లైన్‌ విద్యా వేదిక ఎడెక్స్‌తో ఆక్స్‌ఫర్డ్, ఎంఐటీ, కేంబ్రిడ్జ్, స్టాన్‌ఫోర్డ్‌ వర్సిటీల్లో లభించే 2 వేల వర్టికల్స్‌ను మన విద్యార్థులకు అందించేలా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. డిగ్రీలో నాలుగేళ్ల ఆనర్స్‌ కోర్సులతో పాటు జాబ్‌ ఓరియెంటెడ్‌ మాడ్యూల్స్, 30 శాతం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులను కరిక్యులమ్‌లో ప్రవేశపెట్టింది. పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా ఒకే ఏడాది ఇంటర్న్‌షిప్‌లలో 3 లక్షల కంటే ఎక్కువ సర్టిఫికేషన్లు సాధించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. 18 విశ్వవిద్యాలయాలలో ఖాళీగా ఉన్న 3,295 పోస్టులను భర్తీ చేస్తోంది.  

ప్రజారోగ్యానికి పెద్ద పీట.. 
రాష్ట్ర ప్రభుత్వం ఉచిత వైద్యాన్ని రూ.25 లక్షలకు పెంచడంతో పాటు క్యాన్సర్‌ లాంటి క్లిష్టమైన వ్యాధులకు పరిమితి లేని వైద్యాన్ని అందిస్తోంది. ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్‌ను 1,059 నుంచి 3,257కి పెంచింది. ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ కింద రూ.12,150 కోట్లు ఖర్చు చేయగా 4.25 కోట్ల మందికిపైగా వైద్య సేవలు పొందారు. వీరికి విశ్రాంతి సమయంలో వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా పథకం కింద రూ.1,366 కోట్లు్ల అందించింది. వైద్య రంగంలో ఖాళీలు లేకుండా 53,126 మంది వైద్య సిబ్బందిని నియమించింది. రూ.1,208 కోట్లతో 1,704 వాహనాలు (108, 014లు), రూ.71 కోట్లతో 500 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లు, డబ్ల్యూహెచ్‌ఓ/జీఎంపీ ప్రమాణాలతో 562 ఔషధాలను ప్రతి పీహెచ్‌సీలో అందుబాటులో ఉంచింది.

నాడు–నేడు ద్వారా రూ.16,852 కోట్లతో వివిధ స్థాయిల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో, బోధనాస్పత్రుల్లో వైద్యసేవలను మెరుగుపర్చింది. 17 కొత్త మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేస్తుండగా ఇప్పటి వరకు 5 నూతన కళాశాలల్లో ఎంబీబీఎస్‌ తరగతులను ప్రారంభించింది. రూ.700 కోట్లతో ‘వైఎస్సార్‌ సుజలధార’ ప్రాజెక్టు ద్వారా ఉద్దానం కిడ్నీ బాధితుల కష్టాలను తీర్చింది. 5 గిరిజన ప్రాంతాల్లో మల్టిస్పెషాలిటీ ఆస్పత్రులు, తిరుపతి (చిల్డ్రన్స్‌ హార్ట్‌ సెంటర్‌), కడప (మానసిక ఆరోగ్య కేంద్రం, క్యాన్సర్‌ ఆసుపత్రి, సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌) పలాసలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటు చేసింది.

జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా 1.96 కోట్ల మందికి ఇంటి వద్దే నాణ్యమైన వైద్యాన్ని అందించింది. హృద్రోగ బాధితులకు సేవలందించేందుకు విశాఖపట్నం, గుంటూరు, కర్నూలులో 3 మెడికల్‌ హబ్‌లను ఏర్పాటు చేస్తోంది.  గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం, కడప, కాకినాడ, అనంతపురంలో 6 క్యాన్సర్‌ కేర్‌ సెంటర్లు నెలకొల్పుతోంది. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ ద్వారా వైద్యులను గ్రామాలకే పంపిస్తుండగా ప్రివెంటివ్‌ హెల్త్‌కేర్‌లో కొత్త అధ్యాయంగా జగనన్న ఆరోగ్య సురక్షను చేపట్టింది. గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలలో రక్తహీనత నివారణకు రూ.6,688 కోట్లతో 35.70 లక్షల మంది లబ్దిదారులకు వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్‌ కిట్లను అందిస్తోంది.   

సులభతర వాణిజ్యంలో అగ్రస్థానం
దేశంలోనే అత్యధిక జీఎస్‌డీపీ వృద్ధి రేటుతో ఆంధ్రప్రదేశ్‌ ప్రగతి పథంలో దూసుకెళ్తోంది. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో వరుసగా మూడో ఏడాది అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు రూ.30 వేల కోట్లతో 3.94 లక్షల కొత్త ఎంఎస్‌ఎంఈ యూనిట్లు స్థాపించింది. రీస్టార్ట్‌ ప్యాకేజీ కింద రూ.2,087 కోట్ల మేర ప్రోత్సాహకాలను అందించింది. రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం, కాకినాడ గేట్‌వే వద్ద రూ.16 వేల కోట్లతో 110 మిలియన్‌ టన్నుల కార్గో హ్యాండ్లింగ్‌ సామర్థ్యంతో 4 కొత్త ఓడరేవులను నిర్మిస్తోంది. పది ఫిషింగ్‌ హార్బర్‌లు, ఆరు ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్ల నిర్మాణం శరవేగంగా సాగుతోంది.

రూ.3,200 కోట్లతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం జరుగుతుండగా గన్నవరం, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతి, కర్నూలు, కడప ఎయిర్‌పోర్టులను విస్తరిస్తోంది. వీటి ద్వారా సుమారు 2 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దక్కుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో గత 56 నెలల్లో 311కి పైగా భారీ, మెగా పరిశ్రమలు స్థాపించగా 1.30 లక్షల మందికి పైగా ఉపాధిని కల్పిస్తున్నాయి. విశాఖలో జరిగిన జీఐఎస్‌ సదస్సులో రూ.13.11లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయి. 

వ్యవసాయానికి ‘భరోసా’ 
సొంత భూమిని సాగుచేసుకుంటున్న రైతులకే కాకుండా దేశంలో ఎక్కడా లేనివిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులు, ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ (అటవీ), ఎండోమెంట్‌ భూముల సాగుదారులకు సైతం వైఎస్సార్‌ రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభు­త్వం రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది. ఇప్పటి వరకు 53.53 లక్షల మం­ది రైతుల ఖాతాల్లో రూ.33,300 కోట్లు జమ చేమ చేసింది. 10,778 ఆర్బీకేల ద్వారా గ్రామంలోనే విత్తనం నుంచి పంట ఉత్పత్తుల అమ్మకం వరకు అన్ని వ్యవసాయ సేవలను అందిస్తోంది. ఉచిత పంటల బీమా కింద 54.75 లక్షల మంది రైతులకు రూ.7802 కోట్లు అందించగా ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద 22.85 లక్షల మందికి రూ.1977 కోట్లు అందించింది.

వైఎస్సార్‌ సు­న్నా వడ్డీ రుణాల కింద 73.88 లక్షల మంది రైతులకు రూ.1835 కోట్లు వడ్డీ రాయితీ జమ చేసింది. మరో 25ఏళ్ల పాటు పగటిపూట నాణ్యమైన ఉచిత వ్యవసాయ విద్యత్‌ అందించేందుకు సెకీతో ఒప్పందం చేసు­కుంది. ఉచిత విద్యుత్‌తో 39.77­లక్షల మంది రైతులు రూ.43,066 కోట్లు లబ్ధి పొందారు. ఆక్వా రంగంలో ఏపీ దేశంలో అగ్రస్థానంలో ఉంది. చేపల ఉత్పత్తిలో ఏపీ వాటా ఏకంగా 30 శాతం ఉంది. నాణ్యమైన ఆక్వా ఉత్పత్తులను అందించేందుకు రూ.50.30 కోట్లతో 35 ఇంటిగ్రేటెడ్‌ ఆక్వా ల్యాబ్‌లను నిర్మించింది.

10 ఎకరాల కంటే తక్కువ ఉన్న ఆక్వా రైతులకు యూనిట్‌కు కేవలం రూ.1.50 చొప్పున విద్యుత్‌ను సరఫరా చేస్తూ 3,250 కోట్లు సబ్సిడీ భారాన్ని భరించింది. రూ.1,052 కోట్లతో యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ధాన్యం కొనుగోలులో దళారీ వ్యవస్థను రూపుమాపి ఇప్పటి వరకు 36.60లక్షల మంది రైతుల నుంచి రూ. 63,827 కోట్ల విలువైన 3.34 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి సంపూర్ణ మద్దతు ధర అందించింది. మూతపడిన సహకార డెయిరీలను పునరుజ్జీవం పోస్తూ అమూల్‌ సహకారంతో జగనన్న పాలవెల్లువను కొత్త పుంతలు తొక్కిస్తోంది.   

మహిళకు సాధికారత.. 
ఎన్నికల హామీలో భాగంగా స్వయం సహాయక సంఘాల రుణ బకాయిలను  ప్రభుత్వం తిరిగి చెల్లించింది. నాలుగు దశల్లో 78.94 లక్షల మంది మహిళలకు మొత్తం రూ.25,571 కోట్లను జమ చేసింది. సున్నా వడ్డీ కింద రూ.4969 కోట్లు అందించింది.  వైఎస్సార్‌ చేయూత కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మహిళలకు రూ.14,129 కోట్ల సాయా­న్ని అందించింది. కాపు నేస్తం కింద రూ.2,029 కోట్లు, ఈబీసీ నేస్తం కింద ఆర్థికంగా వెనుకబడిన వారికి రూ.1257 కోట్లు పంపిణీ చేసింది. మహిళల భద్రత కోసం దిశ యాప్, సచివాలయాల్లో మహిళా పోలీసు కానిస్టేబుళ్లను నియమించింది.

నిరుపేదల కలను నెరవేరుస్తూ 31.19 లక్షల మందికి మహిళల పేరిట ఉచిత ఇంటి స్థలాలు పంపిణీ చేయడంతోపాటు 22 లక్షల గృహాలను నిర్మిస్తోంది. సుమారు రూ.మూడు లక్షల కోట్ల సందపను సృష్టించి మహిళలకు అందించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహాలకు వైఎస్సార్‌ కల్యాణమస్తు, షాదీతోఫా ద్వారా అండగా నిలుస్తోంది. బాలికా విద్యను ప్రోత్సహించడంలో భాగంగా ఈ పథకాలకు కనీసం 10వ తరగతి విద్యార్హతను ప్రామాణికంగా నిర్ణయించి ఇప్పటివరకు 46,062 మంది లబ్దిదారులకు రూ.349 కోట్లు పంపిణీ చేసింది.  

జలయజ్ఞం ఫలాలు.. 
నీటిపారుదల రంగంలో ప్రభుత్వ దార్శనికత కోట్లాది మంది ప్రజల తాగు, సాగునీటి అవసరాలను తీరుస్తోంది. కరువు పీడిత రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్రలోని వెనుకబడిన జిల్లాల్లో చేపట్టిన భారీ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. పెన్నా నదిపై సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీలు పూర్తి కాగా రూ.600 కోట్లతో బ్రహ్మం సాగర్‌ లీకేజీ సమస్యను పరిష్కరించింది. చిత్రావతి కోసం రూ.280 కోట్లతో భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ పూర్తి చేసి 10 టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని సాధించింది. గండికోట నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కోసం  రూ.925 కోట్లు వెచ్చించింది.

అవుకు 2వ సొరంగం పనులు పూర్తి చేసి ఎస్‌ఆర్‌బీసీ సామర్థ్యాన్ని 20 వేల క్యూసెక్కులకు పెంచింది. 3వ సొరంగం పనులు శరవేగంగా సాగుతున్నాయి. రూ.253 కోట్లతో లక్కసాగరం ఎత్తిపోతల పూర్తి కావడంతో కర్నూలు, నంద్యాల జిల్లాలకు ప్రయోజనం చేకూరుతోంది. ఖరీఫ్‌ వర్షాలతో నల్లమల సాగర్‌లో నీటిని నిల్వ చేయనుంది. రూ.240 కోట్లతో మడకశిర బైపాస్‌ కెనాల్‌ ద్వారా ఆయకట్టుకు నీటి పంపిణీ దిశగా అడుగులు వేస్తోంది. కుప్పం నియోజకవర్గానికి నీటిని అందించేందుకు కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పనులు పూర్తి చేసింది. రూ.340 కోట్లతో వరికపూడిసెల లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకాన్ని ప్రారంభించింది.

మార్చి నాటికి నాగావళి, వంశధార అనుసంధానం, జూన్‌ నాటికి వంశధార ప్రాజెక్ట్‌ 2వ దశ పూర్తి చేసి శ్రీకాకుళం జిల్లాకు మెరుగైన నీటిపారుదల సౌకర్యాన్ని కల్పిస్తాం. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా శ్రీశైలం నుంచి 800 అడుగుల్లో 3 టీఎంసీల నీటిని మళ్లిస్తాం. పోతిరెడ్డిపాడు, ఎస్‌ఆర్‌బీసీ, జీఎన్‌ఎస్‌ఎస్, కుందూ నది, నిప్పుల వాగు సామర్థ్యం పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాం. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ద్వారా ధర్మవరం నియోజకవర్గానికి నీరందించేందుకు జిల్లెడు బండ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మాణ పనులను చేపట్టాం.హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ పనులు ప్రారంభించగా తారకరామ తీర్థ సాగర్, తోటపల్లి కెనాల్‌ పనులు చురుగ్గా సాగుతున్నాయి.  

♦ భూ వివాదాలకు శాశ్వత పరిష్కారంగా దేశంలో వందేళ్ల తర్వాత చేపట్టిన వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష కార్యక్రమం ద్వారా ఇప్పటికే రెండు దశల్లో 17,460 రెవెన్యూ గ్రామాల్లో 42.6 లక్షల ఎకరాల రీ సర్వేను రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది. భూమిలేని పేదలకు భూమి పంపిణీ చేయడంతో పాటు అసైన్డ్‌ భూ­ముల లబ్ధిదారులకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.  

♦  వర్క్‌ఫ్రమ్‌ హోమ్, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత కోసం వైఎస్సార్‌ గ్రామ డిజిటల్‌ లైబ్రరీలను 12,979 పంచాయతీల్లో నిర్మిస్తూ అపరిమిత బ్యాండ్‌విడ్త్‌ సౌకర్యం కల్పిస్తోంది.  

♦ వైఎస్సార్‌ వాహనమిత్ర కింద రూ.1305 కోట్లు, నేతన్న నేస్తం కింద రూ.983 కోట్లు, జగనన్న చేదోడు కింద నాయీబ్రహ్మణులు, దర్జీలకు రూ.1268 కోట్లు, మత్స్యకార భరోసా కింద రూ.540 కోట్లు అందించింది.  

♦  జగనన్న తోడు కింద 16.73 లక్షల మంది చిరువ్యాపారులకు రూ.3374 కోట్లు వడ్డీలేని రుణాలు ఇవ్వడంతో పాటు రూ.88.33 కోట్లు రీయింబర్స్‌ చేసింది.  

♦  ప్రమాదాల్లో మరణించినవారు, దివ్యాంగులకు వైఎస్సార్‌ బీమా ద్వారా రూ.1582 కోట్లు అందించింది. 

♦ ఏపీ ఔట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుతో పారదర్శకంగా ప్రతి నెలా 1వ తేదీనే జీతాలు అందిస్తోంది.  

♦ టీటీడీకి చెందిన శ్రీవాణి ట్రస్ట్‌తో కలిసి రూ.1,695 కోట్లతో 3,967 ఆలయాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. అర్చక సంక్షేమ నిధి ట్రస్ట్‌ ద్వారా 3వేల మంది అర్చకులకు రూ.48.33 కోట్ల మేర ఆర్థిక భరోసా అందించింది. ధూపదీప నైవేద్యం పథకం కింద ఏటా రూ.30 కోట్లు ఖర్చు చేస్తోంది. 3,518 మంది టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలు కేటాయించింది. 

♦ ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కలను నెరవేరుస్తూ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసింది  51,387 మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించింది.  

♦ గ్రామాల్లో యువతను క్రీడలవైపు ప్రోత్సహించడం, సమాజంలో ఆరోగ్యకర జీవనాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ఏటా ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలకు శ్రీకారం చుట్టింది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement