సాక్షి, అమరావతి: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో గుర్తింపు ఉన్న రాజకీయ పార్టీల తరఫున పోటీలో ఉండి, పోలింగ్‌కు ముందే మరణించిన వారి స్థానాల్లో ఈ నెల 8న కాకుండా వేరుగా.. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) కసరత్తు చేపట్టింది. కరోనాతో ఏడాది క్రితం వాయిదా పడిన ఈ ఎన్నికల ప్రక్రియలో 2020 మార్చి 14న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలిచిన వారితో పాటు పోటీలో ఉన్న మొత్తం 116 మంది అభ్యర్థులు చనిపోయినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు నిర్ధారించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం.. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో ఉండి మరణించిన చోట మాత్రం ఈనెల 8నే పోలింగ్ యథావిధిగా నిర్వహిస్తున్నారు. కానీ, గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీ తరఫున పోటీలో ఉండి అభ్యర్థి చనిపోయిన చోట మాత్రం ఎన్నికను తాత్కాలికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే.
94 చోట్ల ఎన్నికలు వాయిదా
► ఎంపీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన 14 మంది అభ్యర్థులతో పాటు పోటీలో ఉన్న 87 మందితో కలిపి మొత్తం 101 మంది.. జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవమైన వారిలో ఇద్దరు, పోటీలో ఉన్న మరో 13 మంది కలిపి మొత్తం 15 మంది మరణించినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు వెల్లడించారు.
► పోటీలో ఉండి మరణించిన 87 మంది ఎంపీటీసీ అభ్యర్థుల్లో ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు. నిబంధనల ప్రకారం.. ఈ ఐదు స్థానాల్లో ఈనెల 8న ఎన్నికలు యథావిధిగా కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు. కానీ, మిగిలిన 82 మంది గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీల తరఫున పోటీలో ఉన్నందున అక్కడ ఎన్నికలు తాత్కాలికంగా వాయిదా వేశారు.
► పోటీలో కొనసాగుతూ మరణించిన 13 మంది జెడ్పీటీసీ అభ్యర్థుల్లో ఒకరు స్వతంత్ర అభ్యర్థి. ఆ స్థానంలో ఎన్నిక యథావిధిగా 8న ఎన్నిక జరుగుతుంది. గుర్తింపు కలిగిన పార్టీ అభ్యర్థులు చనిపోయిన 12 చోట్ల మాత్రం ఎన్నికలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.
► ఇలా 82 ఎంపీటీసీ స్థానాలలో.. 12 జెడ్పీటీసీ స్థానాల్లో కలిపి మొత్తం 94 చోట్ల ఎన్నికలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఇక్కడ రాజకీయ పార్టీ తరఫున మాత్రమే మరో అభ్యర్థితో నామినేషన్‌కు అవకాశం ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
► ఎన్నికలు వాయిదా పడిన 94 స్థానాల్లో తిరిగి ఎన్నికలు నిర్వహించేందుకు వారం రోజులలోపే కొత్త నోటిఫికేషన్ జారీచేసే అవకాశముందని ఎస్‌ఈసీ వర్గాలు వెల్లడించాయి. అయితే, వీటితో పాటు ఏకగ్రీవంగా గెలుపొందిన అభ్యర్థులు (ఎంపీటీసీ సభ్యులు 14 మంది, జెడ్పీటీసీ సభ్యులు ఇద్దరు) చనిపోయిన చోట్ల ఎన్నికలు జరిపే విషయంపై ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment