సాక్షి, విజయవాడ: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుకు రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. స్కిల్ డెవలప్ మెంట్ పేరిట చంద్రబాబు భారీ కుంభకోణానికి పాల్పడ్డారన్న కేసుకు సంబంధించి ఈరోజు(ఆదివారం) ఏసీబీ కోర్టులో వాదనలు జరిగాయి. సుదీర్ఘంగా ఏడున్నర గంటలపాటు ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు.. సాయంత్రం గం.6.50ని.ల సమయంలో రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ నెల 22వరకూ రిమాండ్ విధించింది కోర్టు. చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉంది.
చంద్రబాబు అరెస్ట్ రిమాండ్ రిపోర్ట్‌ను CID ఉదయమే కోర్టుకు సమర్పించింది. ఈ కేసులో 2021లో ఎఫ్ఐఆర్ నమోదు అయిందని, విచారించేందుకు చంద్రబాబును 15 రోజుల కస్టడీ ఇవ్వాలని సిఐడీ కోరింది.
ఈ కేసుకు సంబంధించి సీఐడీ 34 అభియోగాలను చంద్రబాబుపై నమోదు చేసింది. రిమాండ్ రిపోర్ట్‌లో అన్ని ఆంశాలను పకడ్భందీగా చేర్చిన సీఐడీ... రూ. 271 కోట్ల స్కిల్ స్కామ్ సూత్రధారి బాబేనంటూ సీఐడీ అన్ని ఆధారాలతో బలంగా వాదించింది. ఈ కుంభకోణంలో వివిధ పాత్రల్లో బాబు పాత్ర ఉందని సీఐడీ తరుపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఏఏజీ పొన్నవోలు వాదనతో ఏకీభవించిన కోర్టు.. చంద్రబాబుకు 14 రోజులు పాటు రిమాండ్ విధించింది.
స్కిల్ స్కాం రాజకీయ ప్రేరేపితమని, చంద్రబాబును కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని, హక్కులను భంగం కలిగేలా సీఐడీ వ్యవహరించిందని, ఈ కేసులో చంద్రబాబును ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని బాబు తరపు లాయర్ సిద్ధార్థ లుథ్రా వాదనలు వినిపించినా వాటితో కోర్టు ఏకీభవించలేదు. (చదవండి: న్యాయం గెలిచింది! )
కోర్టు వద్దు హై అలర్ట్
విజయవాడలోని ఏసిబి కోర్టు దగ్గర ముందు జాగ్రత్తగా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. బందోబస్తు నేపథ్యంలో ఏసీబీ కోర్టుకు వచ్చిన సిపి క్రాంతిరాణా అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
రిమాండ్ విధిస్తే బెయిల్ పిటిషన్ తీసుకోండి
ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరఫు లాయర్ లూథ్రా మరో విజ్ఞప్తి చేశారు. ఏసీబీ కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధిస్తే బెయిల్ అప్లికేషన్ ను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. దీనిపై న్యాయస్థానం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నంద్యాలలో కోర్టు ఉండగా చంద్రబాబును విజయవాడ ఎందుకు తీసుకువచ్చారని కొత్త వాదన లేవనెత్తారు.
ఆ ఒక్కటి తప్ప..!
చంద్రబాబు కానీ, ఆయన లాయర్లు కానీ వినిపించిన మొత్తం వాదనలు పరిశీలిస్తే.. ఎక్కడా నేరం జరగలేదని కానీ, లేదా చంద్రబాబు నిర్దోషి అని గానీ చెప్పలేదు. కేవలం సాంకేతిక కారణాలను చూపిస్తూ రిమాండ్ వద్దని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. CID సమర్పించిన ఏ సాక్ష్యంతోనూ లాయర్లు విభేదించలేదు.
మరో మారు సిద్ధార్థ లుథ్రా వాదనలు
► స్కిల్ స్కాం రాజకీయ ప్రేరేపితం
►చంద్రబాబును కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు
►హక్కులను భంగం కలిగేలా CID వ్యవహరించింది
►శుక్రవారం ఉదయం 10 నుంచి CID పోలీసుల ఫోన్ సంభాషణలను కోర్టుకు సమర్పించాలి
409 సెక్షన్ పై ఏసీబీ కోర్టులో సుదీర్ఘ వాదనలు
లుథ్రా లేవనెత్తిన ప్రశ్నలకు సీఐడీ తరపున AAG వాదనలు వినిపించారు.
► చంద్రబాబుపై సీఐడీ 34 అభియోగాలు నమోదు చేసింది
► రిమాండ్ రిపోర్ట్ లో అన్ని అంశాలు చేర్చాం
► స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంతోపాటు వివిధ అక్రమాల్లో బాబు పాత్ర ఉంది
బాబు తప్పు చేయలేదని ఎందుకు చెప్పలేకపోతున్నారు? : ఏఏజీ
►చంద్రబాబు తప్పు చేయడం లేదని ఆయన తరఫు లాయర్లు చెప్పడం లేదు
►అవినీతి చేయలేదని ఒక్క మాట కూడా చెప్పలేకపోతున్నారు
►ఎంతసేపూ సాంకేతిక అంశాల గురించి మాట్లాడుతున్నారు
►గవర్నర్ అనుమతి కోరాలని కొత్తగా అడుగుతున్నారు
►రిమాండు రిపోర్టులో భాష గురించి మాట్లాడుతున్నారు
►అంతేకాని ఇచ్చిన ఆధారాలు తప్పని కాని, అవినీతి జరగలేదని కానీ చెప్పడం లేదు
బాబు లాయర్ల వాదనలకు ఇవీ సమాధానాలు : ఏఏజీ
►అరెస్టు చేయడానికి గవర్నర్ అనుమతి అవసరం లేదు, స్పీకర్‌కు సమాచారం ఇస్తే సరిపోతుంది, ఈ నియమాలు మేం పాటించాం
►గవర్నర్‌కు అరెస్టయిన మూడునెలలోపు ఎప్పుడైనా సమాచారం ఇవ్వొచ్చు
►మాజీ ముఖ్యమంత్రి అనేది గౌరవ ప్రదమైన హోదా మాత్రమే, ఆయన వాస్తవ హోదా ఎమ్మెల్యే మాత్రమే
►మామూలు కేసుల్లో వారం అవసరం తప్ప.. ప్రజాధనం దుర్వినియోగం, అవినీతికి సంబంధించిన కేసుల్లో నోటీసు అవసరంలేదు
►తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిని ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే అరెస్టు చేయొచ్చు
►ముఖ్యమంత్రి హోదాలో నిధుల విడుదలకు చంద్రబాబు ఆదేశించారు, దీనికి సంబంధించిన ఆధారాలున్నాయి
►రాజ్యాంగ ప్రకారం వచ్చిన పదవిని దుర్వినియోగం చేస్తూ అవినీతికి పాల్పడ్డారు
►సెక్షన్ 409 చంద్రబాబుకు సంపూర్ణంగా వర్తిస్తుంది
► చంద్రబాబుకు రిమాండ్ విధించండి
Comments
Please login to add a commentAdd a comment