ఎన్నికల పాఠం | Students are the key for 100 percent polling | Sakshi
Sakshi News home page

ఎన్నికల పాఠం

Published Tue, Mar 26 2024 11:27 AM | Last Updated on Tue, Mar 26 2024 2:46 PM

Students are the key for 100 percent polling - Sakshi

సాంఘిక శాస్త్రంలో ‘ఎన్నికల ప్రక్రియ’ 

విద్యార్థులకు ఓటు విలువ తెలియజేసేందుకు.. 

ప్రజాస్వామ్యంపై అవగాహనకు దోహదం 

 కోనసీమ జిల్లా: వంద శాతం పోలింగ్‌ కావాలంటే విద్యార్థుల పాత్ర కీలకం. విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పిస్తే తల్లిదండ్రులు, ఇరుగుపొరుగు వారితో ఓటు వేయిస్తారు. అందుకే విద్యార్థి దశ నుంచే సాంఘిక శాస్త్రంలో ‘భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ’ పాఠం ముద్రితమైంది. ఇది ప్రజాస్వామ్యం, ఓటు హక్కు విలువను తెలియజేసేందుకు ఉపయోగపడుతుంది. ఎన్నికల వ్యవస్థ నుంచి ఓటుహక్కు వినియోగం వరకు విద్యార్థులు సులభంగా అర్థం చేసుకునేలా పాఠ్యాంశం రూపొందించారు. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల అవసరాన్ని గుర్తించి 1950 జనవరి 25న ఎన్నికల సంఘం ఏర్పడింది. స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘం 1952లో తొలి సార్వత్రిక ఎన్నికలు నిర్వహించగా, ఆ ఎన్నికల్లో 17.32 కోట్ల మంది ఓటర్లు పాల్గొన్నారు. ప్రస్తుతం దేశంలో ఓటర్ల సంఖ్య 92 కోట్లకు చేరింది.  

6వ తరగతి నుంచి.. 
విద్యార్థి దశ నుంచే ఓటు హక్కు విలువ, ఎన్నికల విశిష్టతను తెలియజేసేందుకు విద్యార్థులకు పాఠ్యాంశాలను సాంఘికశాస్త్రంలో పొందుపర్చారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠశాల దశలోనే విద్యార్థులకు పరిచయం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రత్యక్ష, పరోక్ష ప్రజాస్వామ్యం, పార్లమెంటరీ వ్యవస్థ, కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు, శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖలు ఇలా పలు అంశాలను విద్యార్థులకు పరిచయం చేశారు.  

6వ తరగతిలో ప్రభుత్వం అంటే ఏమిటి? ప్రత్యక్ష, పరోక్ష ప్రజాస్వామ్య, పార్లమెంటరీ వ్యవస్థ, కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు, శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖలు, అధిక ఓటర్లు తీసుకునే నిర్ణయం, ప్రజల అభిప్రాయాన్ని గౌరవించే ప్రభుత్వం, ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధిని ఎన్నుకునే విధానం, ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించే విధానం, నమూనా ఎన్నికల నిర్వహణ గురించి వివరించారు. మెజారిటీ పాలన, ఆర్టికల్‌ 326, విశ్వజనీన వయోజన ఓటుహక్కు గురించి వివరించారు.  

► 7వ తరగతిలో సార్వజనీన వయోజన ఓటు హక్కు, ప్రజాస్వామ్యం, గణతంత్రం, రాజ్యాంగ రూపకల్పనా చరిత్ర, ప్రాథమిక హక్కులు, విధులు, బాధ్యతాయుతమైన పౌరసత్వం, దేశభక్తి, స్వీయ క్రమశిక్షణ, శాసనసభ్యుని ఎన్నిక, రహస్య ఓటింగ్‌ విధానం తదితర భావనలను విద్యార్థులకు పరిచయం చేశారు. 
 
► 8వ తరగతిలో మనకు పార్లమెంట్‌ ఎందుకు అవసరం?  పార్లమెంట్‌ ఎలా ఏర్పడుతుంది?  రాజ్యాంగంలో సార్వత్రిక ఓటు హక్కు ఎలా ప్రవేశ పెట్టారు? ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల వినియోగం, 2004 సాధారణ ఎన్నికల నుంచి వినియోగించిన విధానం, ఈవీఎంల వినియోగించడం వల్ల 1,50,000 చెట్లను రక్షించుకోగలగడం, బ్యాలెట్‌ పత్రాల ముద్రణకు అవసరమయ్యే 8వేల టన్నుల కాగితం ఉపయోగపడిన అంశం తదితర విషయాలను వివరించారు.  

► 9వ తరగతిలో ‘ఎన్నికల రాజకీయాలు’ అనే చాప్టర్‌లో భారతదేశంలో ఎన్నికలను మదింపు చేయడం, వివిధ నియోజకవర్గాల మధ్య సరిహద్దు రేఖలను నిర్ణయించడం, ఎన్నికల ఫలితాలను ప్రకటించే వరకు ఎన్నికల్లో వివిధ దశలను వివరించారు. ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా జరిగేలా చూడడంలో ఎన్నికల సంఘం పాత్రను వివరించారు. భారతదేశంలో ఎన్నికల విధానం, రిజర్వ్‌ నియోజకవర్గాలు, ఓటర్ల జాబితా, అభ్యర్థులు నామినేషన్‌ వేసే విధానం, విద్యార్హతలు, పోలింగ్‌ జరిగే విధానం, ఓట్ల లెక్కింపు తదితర విషయాలను ప్రస్తావించారు. ఎన్నికల సంఘం స్వతంత్రత గురించి వివరిస్తూనే ఎన్నికలు ప్రకటన చేసినప్పటి నుంచి ఫలితాలు ప్రకటించే వరకు ఎన్నికల సంఘం నిర్వహించే ప్రతి అంశాన్ని పాఠ్యాంశాల్లో పొందుపర్చారు. ఎన్నికల సంఘం విధులకు సంబంధించి చక్కటి ఫొటోలతో, విద్యార్థులను ఆకట్టుకునే విధంగా పాఠ్యాంశాల రూపకల్పన చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement