అప్పిరెడ్డి, రఘురాం, అవినాష్‌లపై కఠిన చర్యలేవీ తీసుకోవద్దు
పోలీసులకు సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశం
తదుపరి విచారణ నవంబర్ 21కి వాయిదా
సాక్షి,అమరావతి : టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించిన నమోదైన కేసులో తమకు హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడాన్ని సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలు చేసిన వైఎస్సార్‌సీపీ నేతలకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. అరెస్ట్ నుంచి వారికి రక్షణ కల్పించింది. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాంతో పాటు దేవినేని అవినాష్, న్యాయవాది ఒగ్గు గవాస్కర్‌లపై ఎలాంటి కఠిన చర్యలేవీ తీసుకోవద్దని పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది.
దర్యాప్తునకు సహకరించాలని అప్పిరెడ్డి తదితరులను ఆదేశించింది. 48 గంటల్లో పిటిషనర్లందరూ తమ పాస్‌పోర్ట్‌లను దర్యాప్తు అధికారి వద్ద జమ చేయాలంది. ఈ ముందస్తు బెయిల్ పిటిషన్లపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 21కి వాయిదా వేసింది.
ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సుధాన్షు దూలియా, జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, న్యాయవాది అల్లంకి రమేష్ తమ తమ వాదనలను వినిపించారు.
జోగి రమేష్‌పైనా కఠిన చర్యలొద్దు
అలాగే చంద్రబాబు ఇంటి వద్ద జరిగిన గొడవకు సంబంధించి నమోదు చేసిన కేసులో మాజీ మంత్రి జోగి రమేష్‌కు సైతం సుప్రీంకోర్టు రక్షణ కల్పించింది. రమేష్‌పై ఎలాంటి కఠిన చర్యలేవీ తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 21కి వాయిదా వేసింది. ఈ మేరకు ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. హైకోర్టు ముందస్తు బెయిల్ కొట్టేసిన నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Comments
Please login to add a commentAdd a comment