తిరుగుబాటుతో తత్తరపాటు.. | Sakshi
Sakshi News home page

తిరుగుబాటుతో తత్తరపాటు 

Published Tue, Apr 2 2024 4:17 AM

TDP Chandrababu Yellow Gang obstructed distribution of pensions - Sakshi

అవ్వాతాతలకు పింఛన్లపై ఆటంకాలు బాబు బృందం నిర్వాకమే 

పింఛన్ల పంపిణీపై వలంటీర్లకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 1న ఈసీకి అచ్చెన్న ఫిర్యాదు 

4 నెలలుగా సుప్రీం, ఢిల్లీ హైకోర్టు, రాష్ట్ర హైకోర్టులో నిమ్మగడ్డ పిటిషన్లు.. ఫిబ్రవరి 23, 25న ఈసీకి సైతం ఫిర్యాదు 

నిమ్మగడ్డ – బాబు బంధం స్థానిక ఎన్నికల్లోనే బట్టబయలు 

బాబు బృందం ఫిర్యాదులతోనే ఇంటి వద్ద పింఛన్లకు ఈసీ బ్రేక్‌ 

సీఎం జగన్‌ ప్రభుత్వానికి ఆపాదిస్తూ ‘ఈనాడు’ రోత కథనాలు 

గతంలో విమర్శించిన సచివాలయాల ఉద్యోగులతోనే పింఛన్లు పంచాలంటూ డిమాండ్‌  

లబ్ధిదారుల ఇళ్ల వివరాలకు వారూ ఎవరో ఒకరిపై ఆధారపడాల్సిందేగా?

ఇవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకున్న అధికారులపై అభాండాలు  

సాక్షి, అమరావతి: అవ్వాతాతలను అవస్థలకు గురి చేస్తూ ఇంటివద్ద పింఛన్ల పంపిణీకి అడ్డుపడ్డ పచ్చ ముఠా దీనిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో తత్తరపాటుకు గురై రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లేందుకు బరి తెగించింది. వలంటీర్లపై ఆది నుంచి విద్వేషాన్ని పెంచుకున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బృందం ఇన్నాళ్లూ సజావుగా సాగిన సామాజిక పింఛన్ల పంపిణీకి ఎన్నికల వేళ ఆటంకాలు కల్పించేందుకు సాహసించింది. గత నాలుగున్నరేళ్లకు పైగా రాష్ట్రంలో వలంటీర్ల ఆధ్వర్యంలో ప్రతి నెలా ఠంచన్‌గా లబ్ధిదారుల ఇంటివద్దే చిన్న అవాంతరం కూడా లేకుండా కోవిడ్‌ వేళ కూడా పెన్షన్లు అందచేసిన విషయం తెలిసిందే.

రాష్ట్ర ప్రభుత్వం కారణంగా ఇప్పుడు ఆ ప్రక్రియకు ఇబ్బందులు తలెత్తలేదన్నది నిజం. స్వతంత్ర సంస్థ ముసుగులో బాబు రాజకీయ ప్రయోజనాల కోసం పని చేస్తున్న రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ నేతృత్వంలో కొత్తగా పుట్టుకొచ్చిన ‘సిటిజన్‌ ఫర్‌ డెమోక్రసీ’ వరుస ఫిర్యాదులతో ఇంటివద్ద ఫించన్ల పంపిణీకి బ్రేక్‌ పడింది. ఆ సంస్థ ఈ ఏడాది ఫిబ్రవరి 23, 25వ తేదీల్లో రెండు విడతలుగా ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పింఛన్ల పంపిణీ నుంచి వలంటీర్లను దూరంగా ఉంచడంతోపాటు వారి వద్ద ఉన్న మొబైల్‌ ఫోన్లను సైతం స్వాదీనం చేసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. వాస్తవాలు ఇవి కాగా ఇందులో అధికార పార్టీ కుట్ర దాగి ఉందంటూ ఈనాడు రామోజీ తన విద్వేషాన్ని కుమ్మరించారు.  
 
ఆపాలని అడిగి ఆపై నాటకాలు.. 
వలంటీర్ల ద్వారా ఇంటివద్ద పింఛన్ల పంపిణీని వ్యతిరేకిస్తూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం గమనార్హం. మరోవైపు టీడీపీ నాయకులు ‘ఛలో సచివాలయం’ పేరుతో మీడియా ముందు హడావుడి చేస్తూ రాజకీయ డ్రామాను రక్తి కట్టిస్తున్నారు.  
 
నిమ్మగడ్డ నిర్వాకాలు..
► రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పదవిలో ఉన్నప్పుడు నిమ్మగడ్డ రమేష్‌ రాజ్యాంగ విరుద్ధంగా, వివాదాస్పదంగా ప్రవర్తించారు. స్థానిక సంస్థల్లో ఏర్పడే ఖాళీలకు చట్ట ప్రకారం ఆర్నెళ్లలోగా ఎన్నికలు నిర్వహించాలి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో ఓ జడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉండగా దీనివల్ల ఆ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ హోదాలో ఉన్న తమ సామాజికవర్గం నేత పదవికి ఎసరు వస్తుందని ఉప ఎన్నిక జరపలేదని నిమ్మగడ్డపై విమర్శలున్నాయి. 

► వలంటీర్లకు వ్యతిరేకంగా 2023 డిసెంబరు నాలుగో తేదీన నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ నేతృత్వంలోని సిటిజన్‌ ఫర్‌ డెమోక్రసీ సంస్థ సుప్రీం కోర్టులో కేసు వేసి మధ్యలోనే ఉపసంహరించుకుంది.  

► మళ్లీ 2024 జనవరి 12న అదే సంస్థ వలంటీర్లకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో కేసు వేసింది. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుపై తమకు నమ్మకం లేదన్నట్టు పిటిషన్‌లో నిమ్మగడ్డ తదితరులు పేర్కొన్నారు. అయితే ఢిల్లీ హైకోర్టు  ఆ విషయాన్ని ఏపీ హైకోర్టులోనే తేల్చుకోవాలంటూ పిటిషన్‌ను కొట్టివేసింది.  

► తర్వాత నిమ్మగడ్డకు చెందిన సంస్థ 2024 మార్చి 13న వలంటీర్లకు వ్యతిరేకంగా రాష్ట్ర హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. హైకోర్టు దీన్ని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయానికే వదిలివేస్తూ తీర్పు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.  

► 2021లో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వలంటీర్ల వద్ద నుంచి ఫోన్లను స్వా«దీనం చేసుకోవాలంటూ నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించడంతో స్టే ఇచ్చినట్టు అధికారులు గుర్తు చేస్తున్నారు. అప్పుడు నిమ్మగడ్డ జారీ చేసిన ఆదేశాలనే అచ్చెన్నాయుడు వలంటీర్లకు వ్యతిరేకంగా ఈసీకి అందజేసిన వినతిపత్రంలో పొందుపరిచారు. 

► సచివాలయాల ఉద్యోగులు ప్రభుత్వ శాశ్వత ఉద్యోగులే అయినప్పటికీ వారికి ఎన్నికల నిర్వహణపై అనుభవం లేదని,  వారికి ఎన్నికల విధులు అప్పగించవద్దని నిమ్మగడ్డ సంస్థ ఈసీని కోరింది. మరోవైపు సచివాలయాల ఉద్యోగుల ద్వారానే లబ్ధిదారుల ఇళ్ల వద్ద పింఛన్ల పంపిణీ చేపట్టాలంటూ టీడీపీ, ఈనాడు ప్రేమ ఒలకబోస్తున్నాయి.  
 
అన్నీ ఆలోచించాకే..
సచివాలయాల ఉద్యోగులు ఇన్నాళ్లూ విధి నిర్వహణలో భాగంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లేందుకు వలంటీర్లపై ఆధారపడే పని చేస్తూ వచ్చారు. ఇప్పుడు పింఛన్ల పంపిణీ బాధ్యతను వారికి అప్పగించినా లబ్ధిదారుల పేర్లు తెలుస్తాయి కానీ ఇళ్ల వివరాలు తెలిసే అవకాశం ఉండదు. మళ్లీ వారు తిరిగి గ్రామంలో ఎవరో ఒకరిపై ఆధారపడే పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల అభిమానులు వారిని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది.

దీనిపై అధికారులు తర్జనభర్జన పడిన అనంతరమే గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ఫించన్ల పంపిణీకి నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.  చంద్రబాబు సీఎంగా ఉన్నప్పడు 2019 ఎన్నికల సమయంలో స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన నాన్‌ ఐఏఎస్‌ అధికారిని తొలుత ఓఎస్‌డీగా నియమించుకొని తరువాత సెర్ప్‌ సీఈవోగా బాధ్యతలు అప్పగించారు. అదే అధికారి నేతృత్వంలో ఎన్నికల వేళ మహిళా ఓట్లర్లను ప్రభావితం చేసేలా పొదుపు మహిళలకు పసుపు కుంకుమ  తాయిలాలు విడుదల చేయడం గమనార్హం. 
 
పది రోజుల క్రితమే నిర్ణయం..
ఈ నెలలో పింఛన్ల పంపిణీని మూడో తేదీ నుంచి చేపట్టనుండటంపైనా టీడీపీ, ఈనాడు దుష్ప్రచారానికి దిగాయి. ఆర్థిక సంవత్సరం ముగింపుతో పాటు బ్యాంకులకు వరుసగా సెలవులు రావడంతో ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి అవ్వాతాతలకు పింఛన్ల పంపిణీ ప్రారంభించాలని పది రోజుల కిత్రం ఎన్నికల కోడ్‌ వచ్చాకే అధికారుల స్థాయిలో నిర్ణయం జరిగింది. ఈ విషయాన్ని ప్రభుత్వ  ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్‌లో అప్పుడే వివరించారు.

పింఛను డబ్బులను సచివాలయాల సిబ్బంది ఏప్రిల్‌ రెండో తేదీన డ్రా చేసుకునేందుకు వెసులుబాటు కల్పించగా మూడో తేదీ నుంచి పంపిణీ ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అప్పుడే జిల్లా అధికారులకు సమాచారమిచ్చారు. ఆర్థిక సంవత్సరం ముగింపు, సెలవుల కారణంగా ఏటా ఏప్రిల్‌ నెలలో మూడో తేదీ తర్వాత పంపిణీ కొనసాగడం అనవాయితీగా జరుగుతోంది. గతేడాది కూడా ఏప్రిల్‌లో మూడో తేదీ నుంచే పింఛన్ల పంపిణీ కొనసాగినట్లు అధికారులు గుర్తు చేస్తున్నారు.   

Advertisement

తప్పక చదవండి

Advertisement