రాజ్యసభ అవకాశం ఇవ్వడంపై టీడీపీలో తీవ్ర విమర్శలు
ఒత్తిళ్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు లొంగిపోయారని నేతల ఆగ్రహం
సీబీఐ, ఈడీ కేసులున్న వ్యక్తికి ఆ పదవి ఎలా ఇస్తారని ఆందోళన
కొత్త నేతను అందలం ఎక్కిస్తే తమ పరిస్థితి ఏమిటని సీనియర్ల నిలదీత
ఎవరెన్ని చెప్పినా అలాంటి నేతలే అవసరమని సీఎం స్పష్టీకరణ
సాక్షి, అమరావతి: మనీ లాండరింగ్, హవాలా కేసులు సహా సీబీఐనే వివాదంలోకి లాగిన చరిత్ర ఉన్న సానా సతీష్‌కు సీఎం చంద్రబాబు రాజ్యసభ సీటు ఇవ్వడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లాబీయింగ్, అవినీతి వ్యవహారాలతో అంటకాగే వ్యక్తికి కీలక పదవి ఇవ్వడం సరికాదంటూ టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో, వ్యక్తిగత సంభాషణల్లో విరుచుకుపడుతున్నారు.
పార్టీ కోసం సుదీర్ఘ కాలం నుంచి పని చేసిన వారిని పట్టించుకోకుండా కొత్తగా పార్టీలోకి వచ్చి పెత్తనం చెలాయిస్తున్న సానా సతీష్‌కు ఉన్నత పదవి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఆయనకు పదవి ఇస్తున్నారని కొన్ని రోజుల క్రితమే తెలియడంతో చాలా మంది ముఖ్య నేతలు చంద్రబాబును కలిసి తమ అసంతృప్తి వెలిబుచ్చారు. ఎంతో మంది సీనియర్లు ఉండగా, తీవ్ర స్థాయి ఆరోపణలున్న వ్యక్తిని పరిగణనలోకి తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు.
ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే తమ లాంటి సీనియర్ల పరిస్థితి ఏమిటని.. క్యాడర్‌కు, నాయకులకు ఏం సమాధానం చెప్పాలని అడిగినట్లు తెలిసింది. గత ఎన్నికల్లో, అంతకు ముందు.. పార్టీకి భారీగా నిధులు ఇచ్చిన వారికి ఇప్పుడు న్యాయం చేయక తప్పదని ఆయన సమాధానం ఇచ్చినట్లు సమాచారం.
లోకేశ్ పాదయాత్రలో సతీష్ లాంటి నేతలు చాలా ఉపయోగపడ్డారని, వారు డబ్బు ఖర్చు చేశారు కాబట్టే అధికారంలోకి వచ్చాక ప్రతిఫలం ఇస్తున్నామని స్పష్టం చేసినట్లు.. అంతటితో ఆగకుండా పార్టీలో కొత్త తరానికి అవకాశం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసినట్లు తెలిసింది.
చంద్రబాబు స్పందించిన తీరుతో సీనియర్ నాయకుల్లో ఇంకా ఆగ్రహం పెరిగిపోయింది. పార్టీ చంద్రబాబు చేతుల్లో లేదని, లోకేశ్ కోటరీ చేతుల్లో ఉందని చర్చించుకుంటున్నారు. లోకేశ్ కోటరీలో అత్యంత కీలకంగా ఉంటూ బదిలీలు, కాంట్రాక్టులు సహా అన్ని వ్యవహారాలను సానా సతీష్ చక్కబెడుతున్నారు. ఈ క్రమంలో ఆయన పేరును రాజ్యసభ అభ్యర్థిగా ఖరారు చేసినట్లు ప్రకటించక తప్పలేదంటున్నారు.
విస్తుగొలిపే తీవ్ర ఆరోపణలు
⇒ సానా సతీష్‌పై మనీ లాండరింగ్ అభియోగాలుండడంతో సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేసింది. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఈ కేసులకు సంబంధించి 2019 జూలైలో ఆయన్ను ఈడీ అరెస్టు చేసి జైలుకు పంపింది.
⇒ మనీ లాండరింగ్, హవాలా కేసుల్లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మీట్ వ్యాపారి మొయిన్ ఖురేషీతో సతీష్‌కు సన్నిహిత సంబంధాలున్నట్లు తేలింది. ఖురేషీతో కలిసి అక్రమ వ్యాపారాలు కూడా చేసినట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే తనపై ఉన్న మనీ లాండరింగ్ కేసుల నుంచి తప్పించుకునేందు ఖురేషీ ద్వారా సీబీఐ అధికారులకు సతీష్ లంచం ఇచ్చినట్లు స్పష్టమైంది.
⇒ అదే సమయంలో సీబీఐ డైరెక్టర్‌గా పని చేసిన రాకేష్ ఆస్థానా, మరో సీబీఐ అధికారి అలోక్ వర్మ మధ్య చిచ్చుపెట్టి.. ఏకంగా సీబీఐనే వివాదంలోకి లాగిన చరిత్ర సతీష్‌ది. తనను కేసు నుంచి తప్పించేందుకు సీబీఐ డిప్యూటీ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాకు రూ.2 కోట్లు లంచం ఇచ్చినట్లు స్పష్టమవడంతో ఈడీ అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు.
⇒ తనపై ఉన్న ఆరోపణలను కొట్టేయాలంటూ ఈ ఏడాది జులైలో సానా సతీష్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేయగా దాన్ని కోర్టు కొట్టివేసింది. ఇలా తీవ్ర స్థాయి ఆరోపణలున్న వ్యక్తిని విచారించాల్సిందేనని స్పష్టం చేసింది.
సబ్ ఇంజినీర్ నుంచి కోట్లకు పడగలెత్తి..
⇒ కాకినాడకు చెందిన సానా సతీష్ మొదట్లో విద్యుత్ శాఖలో సబ్ ఇంజినీర్‌గా పని చేశారు. ఉద్యోగం వదిలేశాక అక్రమ వ్యాపారాలతో కోట్లు కూడబెట్టినట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే మనీ లాండరింగ్, హవాలా కేసులు నమోదయ్యాయి. అలాంటి వ్యక్తి చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడిగా మారిపోయారు.
⇒ అక్రమంగా సంపాదించిన డబ్బును ఖర్చు చేసి వారికి బాగా దగ్గరయ్యారు. లోకేశ్ పాదయాత్ర ఖర్చును చాలా వరకు సతీష్ భరించినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. గత ఎన్నికల్లో భారీగా డబ్బు సమకూర్చినట్లు తెలిసింది. చాలా వ్యవహారాల్లో లోకేశ్ వెన్నంటే ఉండి అన్నీ సమకూర్చినట్లు చెబుతున్నారు. దీంతో ప్రస్తుత ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా అవతరించారు.
⇒ మంత్రి పదవులు, ఉన్నతాధికారుల పోస్టింగ్‌లు, బదిలీలు, కాంట్రాక్టులు ఇతర అనేక వ్యవహారాల్లో ఆయన ప్రమేయం ఉంటోంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి పదవి ఆయన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఇప్పుడు ఏకంగా కాకలు తీరిన సీనియర్ నేతలను కాదని రాజ్యసభ సీటునే తన్నుకుపోయారు.
Comments
Please login to add a commentAdd a comment