మార్గదర్శిలో వారి వివరాలు తెలుసుకోండి
పత్రికల్లో విస్తృత ప్రచారం కల్పించండి
రిజిస్ట్రీకి తెలంగాణ హైకోర్టు ఆదేశం
వివరాలు కోరుతూ అఫిడవిట్ వేయాలని మాజీ ఎంపీ ఉండవల్లికి సూచన.. ఆ మేరకు ఆర్బీఐ, మార్గదర్శికి ఆదేశాలు జారీ చేస్తామన్న ధర్మాసనం
2 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు నిర్దేశం
విచారణ సెప్టెంబర్ 11కు వాయిదా వేసిన జస్టిస్ సుజోయ్‌పాల్ ధర్మాసనం
మార్గదర్శి అక్రమాలను ఆర్బీఐ తేల్చేసిందన్న అరుణ్‌కుమార్
దాని ఆధారంగా చర్యలు చేపట్టవచ్చని కోర్టుకు నివేదన
సాక్షి, హైదరాబాద్: మార్గదర్శి ఫైనాన్షియర్స్ యాజమాన్యం చందాదారులందరికీ డిపాజిట్ల తాలూకు నగదును తిరిగి చెల్లించిందా? లేక ఎవరికైనా ఎగవేసిందా..? అనే వివరాలు తెలుసుకునేలా చర్యలు చేపట్టాలని తెలంగాణ హైకోర్టు తాజాగా రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు తెలుగు, హిందీ, ఆంగ్ల పత్రికల్లో విస్తృత ప్రచారం జరిగేలా నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేసింది.
అలాగే చందాదారుల వివరాలు కోరుతూ ఓ అఫిడవిట్ దాఖలు చేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు సూచించింది. అఫిడవిట్ ఆధారంగా తాము మార్గదర్శికి ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొంది. దీనిపై రెండు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం మంగళవారం ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను సెప్టెంబర్ 11వతేదీకి వాయిదా వేసింది.
డిపాజిట్ల నిగ్గు తేలాలన్న ‘సుప్రీం’
ఆర్బీఐ చట్ట నిబంధనలను ఉల్లంఘించినందుకు మార్గదర్శి, దాని కర్త రామోజీరావు (ఇటీవల మృతి చెందారు)పై డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ కేసులో అ«దీకృత నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు 2018 డిసెంబర్ 31న తీర్పునిచ్చింది. అయితే అనంతరం ఈ తీర్పును సవాల్ చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (వైఎస్సార్ సీపీ హయాంలో) సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేశాయి.
తీర్పులో కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి, రామోజీరావు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లు అన్నింటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు ఇచ్చిన తీర్పును 2024 ఏప్రిల్ 9న కొట్టివేసింది. హైకోర్టు తీర్పును తప్పుబడుతూ మార్గదర్శి డిపాజిట్ల సేకరణకు సంబంధించి వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిందేనని స్పష్టం చేసింది. ఉండవల్లి, ఏపీ సర్కార్ సహా అందరి వాదనలు వినాలని పేర్కొంది.
మార్గదర్శి అక్రమాలను ఆర్బీఐ కౌంటర్‌లో తేల్చింది...
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసులో తెలంగాణ హైకోర్టు తాజాగా మరోసారి విచారణ ప్రారంభించింది. సీనియర్ జడ్జి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టాలన్న అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వాన్ని, ఆర్‌బీఐని ప్రతివాదుల జాబితాలో చేర్చింది.
గత విచారణ (ఈనెల 6వ తేదీన) సందర్భంగా కౌంటర్ దాఖలుకు చివరి అవకాశం ఇవ్వాలన్న ఆర్‌బీఐ వినతికి అంగీకరిస్తూ ఇకపై ఈ పిటిషన్లను మోషన్ లిస్ట్‌లో పేర్కొనాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ క్రమంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ వసూలు చేసిన డిపాజిట్లన్నీ చట్టవిరుద్ధం, అక్రమమేనని, అందుకు బాధ్యులను ప్రాసిక్యూట్ చేయాలని నివేదిస్తూ ఈ నెల 13న ఆర్బీఐ తెలంగాణ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ఈ క్రమంలో మంగళవారం జస్టిస్ సుజోయ్‌పాల్ నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది.
మార్గదర్శి తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా, కోర్టు సహాయకులుగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆన్‌లైన్‌లో హాజరయ్యారు. ఏపీ ప్రభుత్వ న్యాయవాదితోపాటు తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది పల్లె నాగేశ్వర్‌రావు, ఆర్బీఐ న్యాయవాది కె.రతంగపాణిరెడ్డి హాజరయ్యారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారిస్తూ చట్టం 45 (ఎస్)ను ఉల్లంఘించినట్లు ఆర్బీఐ కౌంటర్‌లో తేల్చిందని ఈ సందర్భంగా ఉండవల్లి హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీని ఆధారంగా మార్గదర్శిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని నివేదించారు.
దాదాపు 70 వేల మంది చందాదారుల వివరాలను 1,500కిపైగా పేజీల్లో మార్గదర్శి సుప్రీం కోర్టుకు సమర్పించిందని, ఆ వివరాలను హైకోర్టుకు కూడా పెన్‌డ్రైవ్‌లో అందజేసేలా ఆదేశించాలని కోరారు. దీనిపై జస్టిస్ సుజోయ్‌పాల్ స్పందిస్తూ.. వివరాలు కోరుతూ ఓ అఫిడవిట్ దాఖలు చేయాలని, ఆ మేరకు ఆర్బీఐ, మార్గదర్శికి ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొంటూ తదుపరి విచారణను వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment