అంబులెన్స్ హైదరాబాద్‌కు వెళ్లకుండా కర్నూలు జిల్లా సరిహద్దు టోల్‌గేట్ వద్ద అడ్డుకుంటున్న తెలంగాణ పోలీస్
సాక్షి, అమరావతి/జగ్గయ్యపేట/దాచేపల్లి (గురజాల)/కర్నూలు (హాస్పిటల్): ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు చికిత్స కోసం వెళుతున్న కరోనా రోగుల అంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఏపీ–తెలంగాణ సరిహద్దుల్లో సోమవారం అంబులెన్సులు నిలిచిపోయి రోగుల బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. మన పోలీసు అధికారులు చర్చించడంతో తెలంగాణ పోలీసులు అంబులెన్స్‌లను హైదరాబాద్‌కు వెళ్లనిచ్చారు. కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లోని తెలంగాణ సరిహద్దుల్లో తెలంగాణ పోలీసులు కొత్త ఆంక్షలు విధించడంతో ఈ సమస్య తలెత్తింది. తెలంగాణలోకి వెళ్తున్న కోవిడ్ బాధితులకు అనుమతిపై కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. దీనివల్ల మూడు జిల్లాల్లోని తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన్సులు నిలిచిపోయి రోగులు ఇబ్బందులు పడ్దారు.
తెలంగాణ పోలీసులతో రోగుల బంధువులు తీవ్ర వాగ్వాదానికి దిగారు. చెక్‌పోస్టుల వద్ద రోడ్డుపై నిరసన తెలిపారు. తాము ఏమీ చేయలేమని, తమ అధికారుల ఆదేశాలను అమలు చేస్తున్నామని తెలంగాణ పోలీసులు చెప్పారు. హైదరాబాద్‌లో కరోనా చికిత్స కోసం ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్ సౌకర్యాలు లేవని, అందుకే ఏపీ నుంచి వచ్చే కరోనా రోగుల విషయంలో ఆంక్షలు అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర సరిహద్దుల్లోని పరిస్థితిని తెలుసుకున్న ఏపీ పోలీసులు రంగంలోకి దిగారు. సమస్యను సర్దుబాటు చేసి రోగులను వైద్యానికి పంపించేలా చర్చలు జరిపారు. కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల ఎస్పీలు రవీంద్రనాథ్‌బాబు, విశాల్‌గున్నీ, ఫక్కీరప్ప ఆదేశాలతో స్థానిక పోలీసులు చెక్‌పోస్టుల వద్ద ఉన్న తెలంగాణ పోలీసు అధికారులతో చర్చించారు.
హైదారాబాద్‌లోని ఆస్పత్రుల్లో వైద్యానికి వెళుతున్న అంబులెన్సులను అనుమతించాలని కోరారు. అనంతరం తెలంగాణ పోలీసులు అంబులెన్స్‌లు హైదరాబాద్ వెళ్లేందుకు అనుమతించారు. అప్పటికే కొన్ని అంబులెన్స్‌లు వెనుదిరిగాయి. కరోనా వైద్యం కోసం హైదరాబాద్ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా, బెడ్ కన్ఫర్మ్ కాకుండా వెళ్లి రోడ్డుపై ఇబ్బందులు పడొద్దని ఏపీ పోలీసులు సూచించారు. కరోనా రోగుల విషయంలో తెలంగాణలో కఠిన ఆంక్షలు అమలవుతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ ఆస్పత్రులకు వైద్యసేవల కోసం వెళ్లేవారు ఆయా ఆస్పత్రుల నుంచి అనుమతులు తీసుకుని వెళితే ఎటువంటి ఇబ్బంది ఉండదని రెండు రాష్ట్రాల పోలీసులు సూచిస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం పునరాలోచించాలి: ఉదయభాను
ఏపీకి చెందిన అంబులెన్స్‌లను తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో నిలిపివేయటం బాధాకరమని, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం పునరాలోచించాలని ప్రభుత్వ విప్, జగ్గయ్యపేటఎమ్మెల్యే సామినేని ఉదయభాను పేర్కొన్నారు. జగ్గయ్యపేట మండలం గరికపాడు సమీపంలో తెలంగాణ రాష్ట్రం కోదాడ మండలం రామాపురం అడ్డరోడ్డు వద్ద ఏపీకి చెందిన అంబులెన్సుల్ని సోమవారం తెలంగాణ అధికారులు నిలిపేశారు. విషయం తెలుసుకున్న ఉదయభాను అక్కడకు వెళ్లి విధుల్లోని కోదాడ రూరల్ ఎస్‌ఐ సైదులుగౌడ్‌తో చర్చించారు. చట్ట ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని, హైదరాబాద్ వెళ్లకుండా అంబులెన్స్‌లను ఆపటం సమంజసం కాదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళతామని చెప్పారు. అనంతరం ఆయన తెలంగాణ ఉన్నతాధికారులతో మాట్లాడి అంబులెన్స్‌లను హైదరాబాద్‌కు పంపారు.
Comments
Please login to add a commentAdd a comment