ఇక ఆయనతో కలిసి పనిచేయలేం
తేల్చి చెప్పిన తిరువూరు నియోజకవర్గ టీడీపీ నేతలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ/తిరువూరు: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వైఖరితో విసిగిపోయామని, ఆయనతో కలిసి పనిచేయలేమని టీడీపీ సీనియర్లు తేలి్చచెప్పారు. తిరువూరు నియోజకవర్గ టీడీపీ విస్తృతస్థాయి సమావేశం ఆదివారం తిరువూరులో జరిగింది. అధిక శాతం నాయకులు సమావేశాన్ని బహిష్కరించడంతో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కంగుతిన్నారు.
ఎమ్మెల్యేని వ్యతిరేకిస్తున్న నాయకులతో లక్ష్మీపురం మనో గార్డెన్స్‌లో సమావేశం ఏర్పాటు చేసి బుజ్జగించేందుకు ప్రయత్నించగా.. నాయకులెవరూ వెనక్కి తగ్గలేదు. పార్టీ శ్రేణులతో సమన్వయ లేమి, నాయకులను సైతం దూషించే ఎమ్మెల్యేతో పనిచేసేది లేదని తెగేసి చెప్పారు. టీడీపీ నేతలపైనే ఎమ్మెల్యే కేసులు పెట్టించడం, వేధింపులకు గురిచేయడంతో తాము అభద్రతా భావానికి లోనవుతున్నామని, ఎన్నికల్లో కష్టపడి గెలిపించిన తమకు అడుగడుగునా ఇబ్బందులే ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తాం
కాగా.. తిరువూరు టీడీపీ నేతలను సమన్వయం చేసేందుకు ఐదుగురు సభ్యులతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తామని పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తెలిపారు. ఎంపీ చిన్ని, వర్ల రామయ్య హామీలతో సంతృప్తి చెందని నాయకులు నియోజకవర్గ పార్టీ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించి వెళ్లిపోయారు. కాగా.. తన భార్యను ఎమ్మెల్యే వేధింపులకు గురిచేస్తున్నారని అధిష్టానానికి ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని చిట్టేల సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసరావు తన అనుచరులతో చిట్టేలలో నిరసనకు దిగారు. ఎమ్మెల్యే వేధింపులతో తన భార్య ఆత్మహత్యాయత్నం చేసి చావుబతుకుల్లో ఉందని, ఈ విషయమై తాను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు, జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment