
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి నిరుపేదకు సొంతిల్లు ఉండాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే జగనన్న కాలనీల్లో నిరుపేదలకు ఇళ్ల స్థలాలను అందించింది. ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లోని పేదలకు సైతం సొంతింటి కలను నిజం చేస్తూ వివిధ కేటగిరీల్లో టిడ్కో ఇళ్లను అందుబాటులోకి తెచ్చింది. రెండు రోజుల క్రితం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాపురంలో ఇళ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించి పట్టణ పేదల కలను నిజం చేస్తోంది. జి+3 విధానంలో రాష్ట్రవ్యాప్తంగా 88 మునిసిపాలిటీల్లో 2,62,216 ఇళ్లను రూ.21,167.86 కోట్లతో ప్రభుత్వం నిర్మిస్తోంది. వీటిలో 300 చ.అ. విస్తీర్ణంలో 1,43,600 ఇళ్లు, 365 చ.అడుగుల్లో 44,304 ఇళ్లు, 430 చ.అడుగుల్లో 74,312 ఇళ్లను కడుతోంది. అంతేకాకుండా ఆయా ప్రాంతాల్లో నిర్మాణం పూర్తయిన యూనిట్లను లబ్ధిదారులకు అందించడంలో కీలకమైన రిజిస్ట్రేషన్ల ప్రక్రియను అధికారులు వేగవంతం చేస్తున్నారు. టిడ్కో ఇళ్లు నిర్మించిన మునిసిపాలిటీల్లోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పని ఒత్తిడికి తగ్గట్టుగా రిజిస్ట్రేషన్లు చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
అన్ని పనిదినాల్లో రిజిస్ట్రేషన్లు..
ఈ ఏడాది చివరి నాటికి మొత్తం 2,62,216 ఇళ్లను రిజిస్ట్రేషన్ చేసి లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. దీంతో మార్చి చివరినాటికి 20 వేల ఇళ్లను లబ్ధిదారులకు పూర్తి హక్కులతో అందించాలన్న లక్ష్యంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించారు. సాధారణంగా మంగళ, శుక్రవారాల్లో రిజిస్ట్రేషన్లు తక్కువగా ఉంటాయని ఆ రోజుల్లో టిడ్కో ఇళ్లను రిజిస్ట్రేషన్లు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు నెల్లూరు జిల్లా వెంకటాపురంలో శుక్రవారం శ్రీకారం చుట్టారు. అయితే, లబ్ధిదారులు ఎక్కువ మంది ఉండడంతో అన్ని పనిదినాల్లో రిజిస్ట్రేషన్లు చేయాలని నిర్ణయించారు. ఒత్తిడి ఎక్కువగా ఉండే నగరాల్లోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో వారంలో ఒకటి లేదా రెండు రోజులు, ఒత్తిడి తక్కువగా ఉండే చిన్న పట్టణాల్లోని కార్యాలయాల్లో అన్ని పనిదినాల్లో రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. దీంతో ఇళ్ల నిర్మాణం పూర్తయిన ఉభయగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తున్నారు. కాగా 2.62 లక్షల ఇళ్లను దాదాపు రూ.800 కోట్లకు పైగా ఖర్చుతో ప్రభుత్వం ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి లబ్ధిదారులకు అందిస్తోంది.
వేగవంతం చేయండి..
లబ్ధిదారులకు వీలైనంత త్వరగా ఇళ్లను అందజేయాలని ఏపీ టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్ సూచించారు. విశాఖపట్నంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల టిడ్కో అధికారులతో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. మార్చి నెలాఖరు నాటికి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు, విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో పరిధిలో 3,100 రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలన్నారు. బ్యూటిఫికేషన్ కింద టిడ్కో ఇళ్ల సముదాయాల పరిసరాల్లో 35 వేల మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment